పిల్లలకు మంచి, చెడు అలవాట్లు నేర్పించాలంటే తల్లిదండ్రులు పాత్ర కీలకం. సాధారణంగా పిల్లలు ఏదైనా తల్లిదండ్రుల నుంచే నేర్చుకుంటారు. ఇంకా చెప్పాలంటే పిల్లలకు మొదటి గురువు తల్లి, తండ్రి. అలాంటి సమయంలో పిల్లలకు ఏది మంచి ఏది చెడు అనే విషయాలను నేర్పించడంలో పూర్తిగా తల్లిదండ్రులే బాధ్యత వహించాల్సి ఉంటుంది. ప్రతీ పేరెంట్ కోరుకునేది తమ పిల్లల భవిష్యత్తు ఉన్నతంగా ఉండాలనే.
ఈ క్రమంలో పిల్లల ప్రవర్తనను సరైన మార్గంలో పెట్టేందుకు ఎన్నో ప్రయత్నాలు చేస్తుంటారు. కానీ పిల్లలకు మంచి అలవాట్లు రావాలంటే ముందుగా అది తల్లిదండ్రుల అలవాట్లపైనే ఆధారపడి ఉంటుందనే విషయాన్ని గుర్తుంచుకోవాలి. ఈ రోజుల్లో పిల్లలు ఎక్కువగా చెడు అలవాట్లకు బానిసలుగా మారుతున్నారు. అలాంటి సందర్భంలో వారి భవిష్యత్తుకు బాటలు వేసేలా చేయాల్సిన బాధ్యత కేవలం తల్లిదండ్రులదే. పిల్లల భవిష్యత్తు సగం వారి అలవాట్లపైనే ఆధారపడి ఉంటుంది. ఎప్పుడైతే మంచి అలవాట్లను నేర్పుకోగలరో అప్పడే వారి జీవితం కూడా మంచి మార్గం వైపు ప్రయాణిస్తుంది.
తల్లిదండ్రులు ఎప్పుడూ కూడా పిల్లలతో సానుకూలంగానే ప్రవర్తించాలి. అలాగే వారికి ఏది మంచి ఏది చెడు అనేవి వివరంగా చెప్తూ ఉండాలి. అలాగే వాటి మధ్య ఉండే వ్యత్యాసాన్ని అర్థవంతంగా వివరించే శ్రద్ద తల్లిదండ్రులకు ఉండాలి. మంచి మర్గాలను అన్వేషించి వారి ఎదుగుదలకు దోహదపడేటట్టు ఉండాలి. అందుకే పిల్లలు మంచి అలవాట్లవైపు మొగ్గుచూపే విధంగా తల్లిదండ్రులు తెలుసుకోవలసిన అంశాలు ఇక్కడ చూడొచ్చు.
నిజాయితీగా ఉండడం:
నిజాయితీగా ఉండడం అనేది మంచి అలవాట్లలో చాలా ముఖ్యమైనది. కనుక తల్లిదండ్రులు పిల్లలకు ముందుగా నేర్పాల్సింది నిజాయితీగా ఉండడం. తద్వారా వాళ్లు చెడు ప్రవర్తన, చెడు మార్గం వైపు వెళ్లకుండా ఉంటారు. అలాగే వాళ్లు చేసే పనుల్లో కూడా నిజాయితీతో చేయడానికి ఇష్టపడతారు. పిల్లలు ఇవి నేర్చుకోవాలంటే ముందుగా తల్లిదండ్రులు పిల్లల దగ్గర నిజాయితీగా ఉండాలి.
భావోద్వగ నియంత్రణ:
పిల్లలకు మంచి ఎమోషన్స్ అలవడేలా చేయాలి. వారి భావోద్వేగాలను నియంత్రించుకునే సామర్థ్యాన్ని వారికి అందించాలి. తద్వారా వాళ్లు సక్సస్ అవ్వడానికి ఉపయోగపడుతుంది. కనుక ప్రతి తల్లిదండ్రి పిల్లలకు వారి భావోద్వాగాలను నియంత్రించే దిశగా ఉండాలి. సత్సంబంధాలను ఏర్పరుచుకునే విధంగా పిల్లలను తీర్చిదిద్దాలి. పిల్లల ఎమోషన్స్‌తో ఇతరులు ఇబ్బంది పడే విధంగా ఉండకూడదు. ఇతరుల పట్ల సానుకూల వైఖరి ఉండేలా చేయాలి. ఎవరి మీద అజమాయిషి చెలాయించే ప్రవర్తన ఉండకూడదు.
సానుభూతిని చూపడం:
తల్లిదండ్రులు పిల్లల దగ్గర దయా హృదయంతో మెలగాలి. అప్పుడే పిల్లలకు కూడా వాటి గురించి తెలుసుకునే ప్రయత్నం చేస్తారు. ఎక్కడ, ఎవరి దగ్గర ఎలా ప్రవర్తించాలో వాళ్లకు ఒక అవగాహన అందించాలి. ఇతరుల పట్ల వ్యవహరించేటప్పుడు ఆయా పరిస్థితులకు అనుగుణంగా ఉండేలా నేర్పించాలి. సానుభూతితో ఉండాలి. తల్లిదండ్రలకు ఆ అలవాటు ఉన్నట్లైతే ఆటోమేటిక్‌గా పిల్లలకు సహజంగానే వచ్చేస్తుంది. ఎందుకంటే వాళ్లు తల్లిదండ్రులను చూసే నేర్చుకుంటారు.
తనదైన నిర్ణయాలు తీసుకోవడం:
తల్లిదండ్రులు పిల్లలకు చిన్న చిన్న విషయాల నుంచి తమ నిర్ణయాలను తాము తీసుకునే విధంగా నేర్పించాలి. ఆ సందర్భంలోనే వాళ్లు తీసుకున్న నిర్ణయాలు సరైనవా లేవా అని గమనిస్తూ వాళ్లకు మంచి చెడులను వివరించాలి. పిల్లలు స్వయంగా నిర్ణయాలు తీసుకుంటే అందులో ఉన్న తప్పొప్పులను కూడా వాళ్లు గ్రహించే అవకాశం ఉంటుంది. పిల్లలు చాలావరకూ వాళ్ల పనులు వాళ్లు స్వయంగా చేసుకుంటారు. స్వీయ ఆలోచన కూడా కలిగే విధంగా తల్లిదండ్రులు పిల్లలను ప్రోత్సహించాలి.
ఇతరులతో పోలిక:
చాలామంది తల్లిదండ్రులు ఇతరులతో తమ పిల్లలను పోల్చుతూ ఉంటారు. కానీ అలా చేయడం వల్ల పిల్లల మనసు బాధపడే అవకాశం ఉంటుంది. తల్లిదండ్రులే తమ పిల్లలను ఎవరోతోనూ పోల్చుకోకూడదని వాళ్లకు చెప్పాలి. కొద్దిమంది పిల్లలు అలా పోల్చడం వల్ల మానసికంగా కృంగిపోతూ ఉంటారు కూడా. కనుక తమ పిల్లల నైపుణ్యాలనే ప్రత్సహిస్తూ మంచి మార్గాన్ని చూపడం మంచిది.
– లక్ష్మీ నెక్కల, ఫ్రీలాన్స్ జర్నలిస్ట్