Prawns Curry Recipe: ఆంధ్రాలో రొయ్యల కూర ఎంతో ఫేమస్. రొయ్యల బిర్యానీ, రొయ్యల ఇగురు, రొయ్యల వేపుడు, గోంగూర రొయ్యలు, రొయ్యల మునగకాయ ఇలా పలు రకాలుగా రొయ్యలను వండుతుంటారు. రొయ్యలతో ఎలాంటి కాంబినేషన్ అయినా రుచిగానే ఉంటుంది. ముఖ్యంగా గోదావరి జిల్లాల వంటకాలలో రొయ్యలు ముందు వరుసలో ఉంటాయి. వేడి వేడి అన్నంలో ఈ కూరను కలుపుకుని తింటే మజానే మజా. మరింకెందుకు ఆలస్యం స్పైసీగా ఉండే రొయ్యల కూరను ఎలా చేయాలో ఈజీగా తెలుసుకోండి.
రొయ్యల కూరకు కావలసిన పదార్థాలు:
- రొయ్యలు – అరకిలో
- ఉల్లిపాయలు – పెద్దవి రెండు
- టమాటాలు – రెండు
- పచ్చిమిర్చి – రెండు
- అల్లం వెల్లుల్లి పేస్ట్ – ఒక టేబుల్ స్పూన్
- కారం – ఒక టేబుల్ స్పూన్
- ఉప్పు – రుచికి సరిపడా
- పసుపు – చిటికెడు
- ధనియాల పొడి – ఒక టేబుల్ స్పూన్
- గరం మసాలా – ఒక టేబుల్ స్పూన్
- కొత్తిమీర – కొద్దిగా
- నూనె – రెండు టేబుల్ స్పూన్లు
రొయ్యల కూర తయారీ విధానం:
1. ముందుగా రొయ్యలను బాగా శుభ్రంగా కడిగి పక్కన పెట్టుకోవాలి.
2. స్టౌ మీద కళాయి పెట్టి అందులో రెండు టేబుల్ స్పూన్ల వరకూ నూనె వేసుకోవాలి. తర్వాత నూనె కొద్దిగా వేడెక్కాక, ముందుగా కడిగి పెట్టుకున్న రొయ్యలను వేసి కొంచెం రంగు వచ్చేలా వేపుకోవాలి.
3. అవి కొద్దిగా వేగిన తర్వాత ఒక గిన్నెలో తీసి పక్కన పెట్టుకోవాలి.
4. ఇప్పుడు ఆదే కళాయిలో మరి కొంచెం నూనె వేసి ఉల్లిపాయ ముక్కలను వేసుకుని గోధుమ రంగు వచ్చేంతవరకూ వేపుకోవాలి. పచ్చిమిర్చిని కూడా వేసుకోవాలి.
5. ఇప్పుడు అల్లం వెల్లుల్లి పేస్ట్‌ను వేసి పచ్చి వాసన పోయేంతవరకూ కలుపుకోవాలి.
6. టమాటా ముక్కలను వేసి అందులో కొంచెం పసుపు, ఉప్పు వేసి కలుపుకుని మూత పెట్టుకోవాలి.
7. అవి కొద్దిగా మగ్గిన తర్వాత అందులో కారం, ధనియాల పొడి, గరం మసాలా వేసి అంతా పట్టే విధంగా కలుపుకోవాలి.
8. ఆ కలుపుకున్న మిశ్రమంలొ వేయించిన రొయ్యలను వేసి కలపాలి.
9. ఇప్పుడు ఒక గ్లాసు వాటర్‌ను అందులో వేసుకోవాలి. ఆపై మూత పెట్టుకుని కొన్ని నిమిషాలు ఉడికించుకోవాలి. కొద్దిసేపటి తర్వాత మూత తీసుకుని కొత్తిమీర తరుగును వేసుకుని స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. అంతే ఎంతో ఈజీగా చేసుకునే రొయ్యల ఇగురు రెడీ. చాలా టేస్టీగా, కమ్మగా ఉంటుంది.
– లక్ష్మీ నెక్కల, ఫ్రీలాన్స్ జర్నలిస్ట్