Manali Tour: మ‌నాలి టూర్ ప్లాన్ చేస్తున్నారా! అయితే ఈ ప్రదేశాలు అస్స‌లు మిస్ కావొద్దు

3 women lying on snow covered ground during daytime
రోహ్‌తంగ్ పాస్‌లో పర్యాటకుల సందడిPhoto by Vishy on Unsplash

Manali Tour: హిమాచ‌ల్ ప్ర‌దేశ్‌లోని మ‌నాలి మంచి ప‌ర్యాట‌క ప్ర‌దేశం. మ‌నాలి ప్ర‌కృతి అందాలు, పూల వ‌నాలు, మంచు ప‌ర్వ‌తాల‌తో క‌ప్ప‌బ‌డి ఉంటుంది. మ‌నాలిలో అనేక ప‌ర్యాట‌క ప్రాంతాలను సంద‌ర్శించ‌వ‌చ్చు. బియాస్ నది ఒడ్డున ఉన్న మనాలి మంచుతో నిండిన శిఖరాలు, పచ్చని లోయలు మరియు హృదయాన్ని కదిలించే మ‌రెన్నో అందమైన దృశ్యాలతో కూడి ఉంటుంది. 

మ‌నాలి చుట్టుప‌క్క‌ల చూడ‌దగిన అనేక అంద‌మైన ప్ర‌దేశాలు ఉన్నాయి. అక్క‌డికి వెళ్లిన ప్ర‌తీ ఒక్క‌రికి మ‌నాలి ట్రిప్ ఒక మంచి  అనుభూతిని క‌లిగిస్తుంది. అక్క‌డ చూడ‌వ‌ల‌సిన  వాటిలో కొండ‌లు, ప‌ర్వ‌తాలు, ఫుడీ హాట్‌స్పాట్‌లు, ఆఫ్‌బీట్ ర‌త్నాలు, మ్యూజియంలు, రోహ్‌తంగ్ పాస్‌తో పాటు ఇంక మ‌రెన్నో ప‌ర్యాట‌కుల‌ను ఆనందపిచేస్తాయి. పచ్చని దేవదారు, పైన్ చెట్లు ఆహ్లాదాన్ని కలిగిస్తాయి. నీటి ప్రవాహాలు మనుసును తేలికపరుస్తాయి. పాత మనాలి హిప్పీ మరియు బోహేమియన్ జీవన విధానానికి ప్రసిద్ధి చెందింది. అయితే న్యూ మనాలిలో అనేక రెస్టారెంట్లు మరియు షాపింగ్ ప్రదేశాలు ఉన్నాయి. 

నగ్గర్ కాజిల్, షోజా హిమాచల్ ప్రదేశ్, జలోరి జోట్ మరియు జిభి. అలాగే హిడింబా దేవి ఆలయం, పాత మనాలి, హిమాలయన్ నైన్మపా బౌద్ధ విహారం, రోహ్‌తంగ్ పాస్, మను ఆలయం, సోలాంగ్ వ్యాలీ, మాల్ రోడ్ కూడా మనాలిలో చూడాల్సిన ప్రదేశాల జాబితాలో ఉన్నాయి. మరిన్ని వివరాలు ఈ కథనంలో చూడొచ్చు.

మనాలి ఎలా చేరుకోవాలి:

భుంటార్ మనాలికి సమీప విమానాశ్రయం. మనాలి నుండి 10కి.మీ. దూరంలో ఉన్న ఈ విమానాశ్రయం ప్రధాన నగరాలకు అనుసంధానించబడి ఉంటుంది.  మనాలిలో సందర్శించాల్సిన ప్రదేశాలను ఎక్కువగా చూడగలిగేలా తక్కువ సమయం ప్రయాణించాలనుకునే వ్యక్తులు విమాన మార్గాన్ని ఎంచుకోవచ్చు. 

మనాలికి దగ్గరలో ఉన్న రైలు స్టేషన్ జోగిందర్ నగర్. చండీగఢ్ మరియు అంబాలా నుండి మనాలికి రైలు మార్గాలు ఉన్నాయి. చుట్టుపక్కల పర్యాటక ప్రాంతాలను టాక్సీలో వెళ్లి సందర్శించవచ్చు. 

ఢిల్లీ నుంచి రోడ్డు మార్గంలో వెళ్లేందుకు అనేక ట్రావెల్ ఏజెన్సీలు వాహనాలను సమకూరుస్తాయి. ఇన్నోవా, మినీ బస్సు, లేదా ట్రావెల్ బస్సుల్లో మనాలి చేరుకోవచ్చు.

మనాలిలో చూడవలసిన పర్యాటక ప్రదేశాలు:

హిడింబా దేవి ఆలయం:

హిడింబా దేవి ఆలయాన్ని ధుంగారి ఆలయం అని కూడా అంటారు. ఇది భీముని భార్య హిడింబా దేవికి అంకితం చేయబడిన గుహ క్షేత్రం. రాక్షసుడి నుండి దేవతగా రూపాంతరం చెందడానికి, హిడింబా దేవి ఇక్కడ తపస్సు చేసిందని నమ్ముతారు. నవరాత్రి సమయంలో, మనాలిలోని ప్రజలు దుర్గా దేవిని కాకుండా ఆమెను పూజిస్తారు. ఈ మందిరం చుట్టూ దట్టమైన అడవులు మరియు చక్కగా చెక్కబడిన చెక్క తలుపులు ఉన్నాయి.

రోహ్‌తంగ్ పాస్:

థ్రిల్ కోరుకునే వారి కోసం ఇది ప్రసిద్ధ గమ్యస్థానం. రోహ్‌తంగ్ పాస్ అద్భుతమైన దృశ్యాలకు నిలయం. సాహసికులకు ఇష్టమైనది. పారాగ్లైడింగ్, స్కీయింగ్, రివర్ రాఫ్టింగ్ , క్వాడ్ బైకింగ్  వంటి అడ్వెంచర్ యాక్టివిటీల కోసం రోహ్‌తంగ్ పాస్ ముఖ్య‌మైన‌ది. థ్రిల్ కోరుకునేవారు బైక్ ట్రిప్ చేస్తారు. సముద్ర మట్టానికి 3900 మీటర్ల ఎత్తులో ఉండి, గంభీరమైన హిమాలయాలు మరియు తెల్లటి మంచు ఎల్లప్పుడూ ప్రయాణికులను స్వాగతించడానికి సిద్ధంగా ఉంటాయి. మనాలిలో హిమపాతం అనుభవించడానికి ఇది ఉత్తమమైన ప్రదేశం.

మను దేవాలయం:

ఆలయానికి చేరుకోవడం ఒక థ్రిల్లింగ్ అడ్వెంచర్. ఇక్కడకు చేరుకోవడానికి మీరు కొద్దిగా ట్రెక్కింగ్ చేయాల్సి ఉంటుంది. చల్లని గాలి, గంభీరమైన శిఖరాలు, లోతైన లోయలతో కూడిన ప్రకృతి శోభలో మీరు మైమరిచిపోతారు. పగోడా-శైలితో ఆలయం పునరుద్ధరణకు నోచుకుంది. పాత నిర్మాణానికి కొత్త పాలరాతి ఫ్లోరింగ్‌లు, పైకప్పులతో పునరుద్ధరించారు. మనాలిలో సందర్శించడానికి అత్యంత విశిష్టమైన ప్రదేశాలలో ఒకటి. ప్రపంచం మొత్తం మీద మనువుకు అంకితం చేయబడిన ఏకైక ఆలయం.

సోలాంగ్ వ్యాలీ:

సోలాంగ్ వ్యాలీ మనాలి నుండి 13 కి.మీ. దూరంలో ఉంది. మంచుతో కూడిన చెట్లు, స్పష్టమైన నీలి ఆకాశం, పర్వతాలతో నిండిన సుందరమైన ప్రకృతి దృశ్యాల కారణంగా ఇది మనాలిలో సందర్శించదగిన ప్రదేశాల జాబితాలో అగ్రస్థానంలో నిలిచింది. జోర్బింగ్, పారాగ్లైడింగ్, స్కీయింగ్, స్నోమొబైల్ వంటి ఆక్టివిటీస్ ప్రయత్నించవచ్చు. కేబుల్ కార్ నుండి హిమాలయాల అందాలను ఆస్వాదించవచ్చు. 

బియాస్ కుండ్:

బియాస్ కుండ్ సముద్ర మట్టానికి 3,700 మీటర్ల ఎత్తులో ఉన్న అందమైన ఎత్తైన సరస్సు. ఇది ఒక ప్రసిద్ధ ట్రెక్కింగ్ గమ్యస్థానం. బియాస్ కుండ్ ట్రెక్ సోలాంగ్ లోయ నుండి ప్రారంభమవుతుంది. సరస్సు చేరుకోవడానికి 3-4 గంటల సమయం పడుతుంది. ఇది తేలికపాటి ట్రెక్ కాబట్టి ఈజీగా చేసేయొచ్చు.

నగ్గర్:

నగ్గర్ మనాలి సమీపంలో ఉన్న పట్టణం. పురాతన దేవాలయాలు, అందమైన వాస్తుశిల్పం, హిమాలయాల అందాలు చూడొచ్చు. ఇది 15వ శతాబ్దానికి చెందిన చారిత్రాక మైలురాయి అయిన నగ్గర్ కోటకు ప్రసిద్ధి చెందిన పర్యాటక ప్రదేశం ఇది.

కులు:

కులు బియాస్ నది ఒడ్డున ఉన్న ఒక అందమైన లోయ. ఆపిల్ తోటలు, సాంప్రదాయ హస్తకళలకు ప్రసిద్ధి చెందింది. ఈ పట్టణం రాఫ్టింగ్, ట్రెక్కింగ్ వంటి సాహస క్రీడలకు కూడా ప్రసిద్ధి చెందింది. అక్టోబర్‌లో జరిగే కులు దసరా ఉత్సవం ఒక ప్రధాన ఆకర్షణ. 

కసోల్:

కసోల్ పార్వతి లోయలో ఉన్న ఒక చిన్న గ్రామం. సుందరమైన అందాలు, హిప్పీ సంస్కృతికి ప్రసిద్ధి చెందింది. బ్యాక్‌ప్యాకర్‌లకు ప్రసిద్ధ గమ్యస్థానం. అద్భుతమైన ప్రకృతి దృశ్యాలు, జలపాతాలు, వేడి నీటి బుగ్గలు, రుచికరమైన ఆహారాన్ని అందించే అనేక కేఫ్‌లు, రెస్టారెంట్‌లు ఆకట్టుకుంటాయి.

మనాలిలో చేయవలసిన పనులు:

సోలాంగ్‌లో రాఫ్టింగ్, పారాగ్లైడింగ్, క్వాడ్ బైకింగ్, బియాస్ కుండ్ ట్రెక్

మనాలి సందర్శించడానికి ఉత్తమ సమయం:

మనాలి యొక్క ఆకర్షణ మంచుతో కప్పబడిన పర్వతాలు, సుందరమైన ప్రకృతి దృశ్యాలు మరియు మంచుతో నిండి ఉన్న లోయలు. మనాలి వాతావరణం ఏడాది పొడవునా ఆహ్లాదకరంగా ఉంటుంది. అయితే మనాలి సందర్శించడానికి ఉత్తమ సమయం మార్చి నుండి జూన్ మధ్య అని చెప్పొచ్చు. మనాలి ఉష్ణోగ్రత ఈ సమయంలో 10°C నుండి 25°C మధ్య ఉంటుంది. మనాలిలో అడ్వెంచర్ యాక్టివిటీస్‌లో నిమగ్నమవ్వడానికి, తిరగడానికి ఇది ఉత్తమ సమయం. అక్టోబరు నుండి ఫిబ్రవరి వరకు సున్నా ఉష్ణోగ్రతలతో కూడిన చలికాలం ఉంటుంది. మీరు హిమపాతాన్ని ఆస్వాదించాలనుకుంటే, హిమపాతం కోసం మనాలిని సందర్శించడానికి డిసెంబర్ నుండి ఫిబ్రవరి వరకు ఉత్తమ సమయం. 

– లక్ష్మీ నెక్కల, ఫ్రీలాన్స్ జర్నలిస్ట్

Previous articlePrawns Curry Recipe: రొయ్య‌ల కూర ఇలా చేస్తే ఇష్టంగా తింటారు..
Next articleBreakfast Food: ఉదయం అల్పాహారంలో వీటిని చేర్చితే ఎంతో ఉత్సాహంగా ఉంటారు