Bharat jodo yatra in hyderabad: కన్యాకుమారి నుండి కాశ్మీర్ వరకు సాగుతున్న రాహుల్ గాంధీ భారత్ జోడో యాత్ర హైదరాబాద్ నగరంలో మంగళవారం విజయవంతంగా సాగింది. భారత్ జోడో యాత్ర 54వ రోజు, తెలంగాణలో 7వ రోజున హైదరాబాద్ నెక్లెస్ రోడ్ కు చేరుకుంది. ఇక్కడి కార్నర్ మీటింగ్ లో రాహుల్ గాంధీతోపాటు కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లిఖార్జున్ ఖర్గే, ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్, రాష్ట్ర వ్యవహారాల ఇంచార్జ్ మాణిక్యం ఠాగూర్, టిపిసిసి అధ్యక్షుడు రేవంత్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.
ఉదయం ఆరు గంటలకే శంషాబాద్ నుండి ప్రారంభమైన యాత్ర చార్మినార్, గాంధిభవన్, నాంపల్లిల మీదుగా నెక్లెస్ రోడ్ చేరుకుంది. దారి పొడవునా స్వాగత తోరణాలు, భారీగా జన సందోహం నడుమ రాహుల్ పాదయాత్ర జనసంద్రంగా మారింది. ఎక్కడికక్కడ రాహుల్ గాంధీని స్వాగతించేందుకు ప్రజలు వేలాదిగా తరలిరావటంతో కొన్ని ప్రాంతాల్లో భద్రత కూడా కష్టతరంగా మారింది.
భారీ జన జాతరలోనూ రాహుల్ గాంధీ సామాన్యుడిలా ఎక్కడికక్కడ అభిమానులు, కార్యకర్తలను చిరునవ్వుతో పలకరిస్తూ అభివాదం చేస్తూ కార్నర్ మీటింగ్‌కు చేరుకున్నారు. అనంతరం కార్నర్ మీటింగ్ లో మాట్లాడుతూ.. జాతి సమైక్యత, జాతి శాంతి సౌభ్రాతృత్వాలను ఆకాంక్షిస్తూ ముందుకు సాగుతున్న వైనాన్ని వివరించారు.
మతం పేరుతో దేశాన్ని విచ్ఛిన్నం చేస్తున్న బీజేపీ పాలనకు ముగింపు పలకాల్సిన ఆవశ్యకత ఉందని రాహుల్ గాంధీ అన్నారు. దేశంలో అత్యంత కాలుష్యం ఇప్పుడు హైదరాబాద్‌లో ఉందని అన్నారు. నరేంద్ర మోదీ, కేసీఆర్ నడుమ డైరెక్ట్ లింక్ ఉండడమే ఇందుకు కారణమని వ్యాఖ్యానించారు. దేశంలో, రాష్ట్రంలో ఉద్యోగ ఉపాధి అవకాశాలు లేకుండా పోయాయని, రైతులకు గిట్టుబాటు ధరలు లేవని అన్నారు.
లక్షలాది మంది నిరుద్యోగులు ఫుడ్ డెలివరీ బాయ్స్‌గా ఉన్నారని, ఇదేనా దేశ అబివృద్ధి అని ప్రశ్నించారు. దేశంలోని ప్రభుత్వ సంస్థలన్నీ మోదీ స్నేహితులకు ధారాదత్తం అయ్యాయని ఆరోపించారు. బ్యాంకుల నుండి లక్షల కోట్లు మోదీ తన స్నేహితులకు దోచిపెడుతున్నారని ఆరోపించారు.
గ్యాస్ సిలిండర్ నాలుగు వందల నుంచి 11 వందలకు పెరిగిందని దుయ్యబట్టారు. సామాన్యుల నడ్డి విరచడ మోదీకి సర్వసాధారణమైందని అన్నారు. అందుకే భారత్ జోడో యాత్ర ప్రారంభించానని, దేశ సమైక్యత కోసం ఈ యాత్ర సాగుతోందని అన్నారు. గడిచిన 56 రోజులుగా సాగుతున్న భారత్ జోడో యాత్రలో ఎన్నడూలేనంతగా హైదరాబాద్ నగరంలో భారీగా ప్రజలు తరలివచ్చి రాహుల్ గాంధీకి మద్దతు పలికారు.