టాక్స్ ఎగ్జెంప్షన్స్ వేటికి వర్తిస్తాయో తెలుసా? ఇన్‌కమ్ ట్యాక్స్ (ఆదాయ పన్ను) కట్టే ప్రతి ఒక్కరూ ఈ మినహాయింపుల గురించి తెలుసుకోవాలి. ప్రస్తుతం ఏడాదికి రెండున్నర లక్షల వరకు వ్యక్తిగత ఆదాయం ఉన్న వాళ్లకు ఇన్‌కమ్ ట్యాక్స్ నుంచి పూర్తిగా మినహాయింపు ఉంది. ఆ తర్వాత రెండున్నర లక్షల నుంచి 5 లక్షల ఆదాయం ఉన్న వాళ్లు 5 శాతం.. 5 నుంచి పది లక్షల ఆదాయం ఉన్న వాళ్లు 20 శాతం, పది లక్షలకుపైగా ఆదాయం ఉన్న వాళ్లు 30 శాతం పన్ను చెల్లించాల్సి ఉంటుంది. అయితే ఆదాయ పన్ను చట్టంలోని కొన్ని సెక్షన్ల ప్రకారం ప్రభుత్వం కొన్నింటికి మినహాయింపులు ఇస్తోంది.
అందుబాటులో ఉన్న ఈ పన్ను మినహాయింపులను సరిగా సద్వినియోగం చేసుకోగలిగితే.. ఏడాదికి సుమారు రూ. 9 లక్షల ఆదాయం ఉన్న వాళ్లు కూడా రూపాయి పన్ను చెల్లించాల్సిన అవసరం ఉండదు. హోమ్ లోన్ నుంచి మీరు చేసే పొదుపు, వివిధ చారిటీ సంస్థలకు ఇచ్చే విరాళాల వరకు చాలా మార్గాల్లో పన్ను మినహాయింపుల పొందే వీలుంది. ఆ మినహాయింపులేంటో డియర్ అర్బన్.కామ్ అందిస్తున్న ఈ స్టోరీలో చూడండి.
హెచ్‌ఆర్‌ఏపై పన్ను మినహాయింపు
ఉద్యోగులు తరచూ సొంతూరును వదిలి వేరే ప్రదేశాలకు వెళ్లి ఉండాల్సి వస్తుంది. అలాంటి వాళ్లు ఎక్కడికెళ్తే అక్కడ ఓ ఇంటిని అద్దెకు తీసుకుంటారు. దీనికోసం సదరు సంస్థ ప్రతి ఉద్యోగికి హౌజ్ రెంట్ అలవెన్స్ (హెచ్‌ఆర్‌ఏ) ఇస్తుంది. ఈ అలవెన్స్‌పై పన్ను మినహాయింపు ఉంటుంది. ఆదాయ పన్ను చట్టం 10 (13ఎ) కింద హెచ్‌ఆర్‌ఏపై ఈ మినహాయింపు ఇస్తారు. ముంబై, చెన్నై, కోల్‌కతా, ఢిల్లీలాంటి నగరాల్లో జీతంలో గరిష్ఠంగా 50 శాతం, మిగతా చోట్ల గరిష్ఠంగా 30 శాతం హెచ్‌ఆర్‌ఏ ఉంటుంది. మరీ సాంకేతిక అంశాల్లోకి వెళ్లకుండా సూటిగా చెప్పాలంటే.. మీ హెచ్ఆర్ఏ లేదా మీరు చెల్లిస్తున్న ఇంటి అద్దెలో ఏది తక్కువగా ఉంటే అది మినహాయింపు వర్తిస్తుంది.
టాక్స్ ఎగ్జెంప్షన్స్ లో కీలకం 80 సీ
టాక్స్ ఎగ్జెంప్షన్స్ లో ప్రధానంగా తెలుసుకోవాల్సింది.. అందరూ ఆదా చేసుకోగలిగింది ఈ 80 సీ ద్వారా. ఆదాయ పన్ను చట్టం సెక్షన్ 80 సీ కింద పన్ను మినహాయింపు పొందే అవకాశం ఉంటుంది. ఈ సెక్షన్ కింద గరిష్ఠంగా రూ. 1.5 లక్షల వరకు పన్ను మినహాయింపు ఉంటుంది. కొన్ని ఇన్వెస్ట్‌మెంట్లకు భారత ప్రభుత్వం టాక్స్ ఎగ్జెంప్షన్స్ ఇస్తోంది. ఈ సెక్షన్ కింద వ్యక్తిగత పన్ను చెల్లింపుదారులతోపాటు హిందూ అన్‌డివైడెడ్ ఫ్యామిలీ (హెచ్‌యూఎఫ్) కూడా పన్ను మినహాయింపు పొందవచ్చు. 80 సీ పరిధిలోకి వచ్చే ఇన్వెస్ట్‌మెంట్లు ఏంటో చూద్దాం.
– పీపీఎఫ్ (పబ్లిక్ ప్రావిడెంట్ ఫండ్)
– ఈపీఎఫ్ (ఎంప్లాయీస్ ప్రావిడెంట్ ఫండ్)
– ఐదేళ్ల బ్యాంకు లేదా పోస్ట్ ఆఫీస్ ట్యాక్స్ సేవింగ్ డిపాజిట్స్
– నేషనల్ సేవింగ్స్ సర్టిఫికెట్ (ఎన్‌ఎస్‌సీ)
– ఈక్విటీ లింక్‌డ్ సేవింగ్ స్కీమ్స్ మూచువల్ ఫండ్స్
– పిల్లల చదువుల కోసం కట్టే ఫీజులు (బోధనా రుసుము)
– లైఫ్ ఇన్సూరెన్స్ ప్రీమియం
– సుకన్య సమృద్ధి అకౌంట్ డిపాజిట్ స్కీమ్
– పోస్ట్ ఆఫీస్ సీనియర్ సిటిజెన్ సేవింగ్స్ స్కీమ్
– రీపేమెంట్ ఆఫ్ హోమ్ లోన్ (అసలు మాత్రమే)
– నాబార్డ్ రూరల్ బాండ్స్
– కొత్త ఇల్లు కొనడానికి అయ్యే స్టాంప్ డ్యూటీ చార్జీలు
సెక్షన్ 80 సీసీడీ
ఈ సెక్షన్ కింద నేషనల్ పెన్షన్ స్కీమ్‌లో ఉద్యోగులు ఇన్వెస్ట్ చేయొచ్చు. నెలవారీ జీతం అందుకునే ఉద్యోగులైతే.. ఏటా రూ. 50 వేలు ఈ నేషనల్ పెన్షన్ స్కీమ్ లో పొదుపు చేయడం ద్వారా సెక్షన్ 80 సీపై పొందే రూ. 1.50 లక్షలకు అదనంగా ఈ 80 సీసీడీ ద్వారా మరో రూ. 50 వేల ఆదాయానికి పన్ను మినహాయింపు పొందవచ్చు. అంటే మొత్తంగా రూ. 2 లక్షల మేర ఆదాయానికి ఈ రెండు సెక్షన్ల ద్వారా పన్ను రాయితీ పొందవచ్చు.
హోమ్ లోన్‌పై చెల్లించే వడ్డీకి టాక్స్ ఎగ్జంప్షన్ (సెక్షన్ 24)
ఆదాయ పన్ను చట్టంలోని సెక్షన్ 24 ప్రకారం హోమ్ లోన్‌పై చెల్లించే వడ్డీకి పన్ను మినహాయింపు పొందే అవకాశం ఉంటుంది.
– ఒకవేళ ఆ ఇంట్లో మీరు ఉంటే ఏడాదికి మీరు చెల్లించే వడ్డీలో గరిష్ఠంగా రూ. 2 లక్షల వరకు పన్ను మినహాయింపు పొందవచ్చు. ఇళ్ల అమ్మకాలను ప్రోత్సహించేందుకు కేంద్ర ప్రభుత్వం 2020 మార్చి 31 వరకు ఒక కొత్త మినహాయింపు ఇచ్చింది. దీని ప్రకారం మీరు చెల్లించే వడ్డీలో గరిష్టంగా రూ. 3.5 లక్షల వరకు వర్తిస్తుంది. ఇది కేవలం మార్చి 31 2020లోపు రుణం తీసుకున్నవారికే. దీనిని మరింత కాలం పొడిగించే అవకాశం ఉంది.
– ఒకవేళ ఆ ఆస్తిని అద్దెకు ఇచ్చినట్లయితే మీరు చెల్లించే వడ్డీకి ఎలాంటి గరిష్ఠ పరిమితి లేదు. ఎంత వడ్డీ చెల్లిస్తే అంత మొత్తానికి పన్ను మినహాయింపు కోరవచ్చు.
– ఇక ఇంటి రిపెయిర్లు లేదా పునర్నిర్మాణం కోసం ఈ హోమ్ తీసుకునే ఉంటే ఏడాదికి చెల్లించే వడ్డీలో గరిష్ఠంగా రూ. 30 వేల వరకే మినహాయింపు పొందే వీలుంటుంది. మీ వార్షిక ఆదాయం రూ. 10 లక్షలు దాటితే మీకు పన్ను పోటు తప్పదు కనుక.. మీరు ఇంటి రుణం తీసుకోవడం ద్వారా మీరు పన్ను పోటు నుంచి తప్పించుకోవచ్చు.
సెక్షన్ 80 డీడీ
ఇంట్లో మీపై ఆధారపడిన వాళ్ల (భార్య/భర్త, తల్లిదండ్రులు, పిల్లలు)లో ఎవరైనా 40 శాతం కంటే ఎక్కువ అంగవైకల్యంతో బాధపడుతుంటే.. వాళ్ల ఏడాది చికిత్సకయ్యే ఖర్చులో గరిష్ఠంగా రూ. 75 వేల వరకు పన్ను మినహాయింపు ఉంటుంది. ఈ అంగవైకల్యం 80 శాతం వరకు ఉంటే.. ఈ పరిమితి రూ. 1.25 లక్షల వరకు ఉంటుంది.
సెక్షన్ 80 డీడీబీ
వ్యక్తిగత ఆదాయ పన్ను చెల్లించే వాళ్లు ఎవరైనా ఈ సెక్షన్ కింద కొన్ని నిర్ధిష్ఠమైన అనారోగ్యాలకయ్యే చికిత్సలో కొంత మొత్తానికి పన్ను మినహాయింపు పొందవచ్చు. పన్ను చెల్లించే వాళ్లపై ఆధారపడిన వాళ్లకు అయ్యే చికిత్సకు కూడా ఇది వర్తిస్తుంది.
– 60 ఏళ్లలోపు వాళ్లయితే రూ.40 వేల వరకు
– 60 ఏళ్లు పైబడిన వాళ్లయితే రూ. 60 వేల వరకు
– 80 ఏళ్లు పైబడిన వాళ్లయితే రూ. 80 వేల వరకు పన్ను మినహాయింపు పొందే వీలుంటుంది.
ఈ సెక్షన్ కింద పన్ను మినహాయింపు పొందాలనుకునే వాళ్లు స్పెషలిస్ట్ డాక్టర్ నుంచి మెడికల్ సర్టిఫికెట్ పొందాల్సి ఉంటుంది.
సెక్షన్ 80 యు
ఇది కూడా సెక్షన్ 80 డీడీ లాంటిదే. కాకపోతే దీని కింద కేవలం శారీరక లేక మానసిక వైకల్యంతో బాధపడుతున్న ఉద్యోగి మాత్రమే పన్ను మినహాయింపు కోరే వీలుంటుంది.
సెక్షన్ 80 డీ : టాక్స్ ఎగ్జెంప్షన్స్ లో కీలకం
ఈ సెక్షన్ కింద సీనియర్ సిటిజెన్స్ (60 ఏళ్లు పైబడిన వాళ్లు) అయితే ఏడాదికి చెల్లించే మెడికల్ ఇన్సూరెన్స్ ప్రీమియంలో గరిష్ఠంగా 30 వేల వరకు పన్ను మినహాయింపు పొందవచ్చు. అదే 60 ఏళ్లులోపు వాళ్లయితే వ్యక్తిగత ఇన్సూరెన్స్, తనపై ఆధారపడిన వాళ్ల ఇన్సూరెన్స్ ప్రీమియంలో గరిష్ఠంగా 25 వేల వరకు మినహాయింపు ఉంటుంది. దీనికి అదనంగా పేరెంట్స్ కోసం మెడికల్ ఇన్సూరెన్స్ ప్రీమియం చెల్లిస్తుంటే.. అందులోనూ గరిష్ఠంగా రూ. 25 వేలకు మినహాయింపు కోరవచ్చు. పేరెంట్స్ ఇద్దరూ సీనియర్ సిటిజన్స్ అయితే ఈ మొత్తం రూ. 30 వేల వరకు ఉంటుంది. అందరికీ హెల్త్ ఇన్సూరెన్స్ తప్పనిసరి కాబట్టి టాక్స్ ఎగ్జెంప్షన్స్ లో ఇది కూడా అందరూ తెలుసుకోవాల్సిన అంశం.
సెక్షన్ 80 టీటీఏ
ఈ సెక్షన్ కింద బ్యాంకులు లేదా పోస్ట్ ఆఫీస్ లేదా కో ఆపరేటివ్ సొసైటీల్లోని సేవింగ్స్ అకౌంట్ డిపాజిట్లపై వచ్చే వడ్డీలో గరిష్ఠంగా రూ. 10 వేల మొత్తం వరకు పన్ను మినహాయింపు పొందవచ్చు.
సెక్షన్ 80 జీజీ
సంస్థ నుంచి హెచ్‌ఆర్‌ఏ పొందని, సొంతంగా ఇల్లు లేని ఉద్యోగులకు మాత్రమే ఈ సెక్షన్ కింద పన్ను మినహాయింపు వర్తిస్తుంది. మొదట్లో రూ. 24 వేలుగా ఉన్న ఈ మొత్తాన్ని 2016 బడ్జెట్‌లో రూ. 60 వేలకు పెంచారు. అంటే గరిష్ఠంగా నెలకు ఐదు వేల అద్దె వరకు ఈ మినహాయింపు వర్తిస్తుంది.
సెక్షన్ 80 జీ
చారిటీలు, కొన్ని సహాయక చర్యల కోసం ఇచ్చిన మొత్తానికి ఈ సెక్షన్ కింద పన్ను మినహాయింపు కోరవచ్చు. అది కూడా ఆ డబ్బును చెక్కు లేదా డీడీ రూపంలో ఇస్తేనే ఇది వర్తిస్తుంది. మీరు ఎన్ని విరాళాలు ఇచ్చినా మీ మొత్తం ఆదాయంలో గరిష్ఠంగా పది శాతం వరకే పన్ను మినహాయింపు ఉంటుంది. ఒకవేళ నేరుగా డబ్బు రూపంలో విరాళం ఇచ్చి ఉంటే.. ఇది గరిష్ఠంగా రూ. 10 వేలకే పరిమితం అవుతుంది. ఇక బట్టలు, ఆహారం, మందులులాంటివి విరాళాలుగా ఇస్తే.. ఈ సెక్షన్ కింద మినహాయింపు కోరేందుకు వీలుండదు.
సెక్షన్ 80 ఈ
చదువు కోసం తీసుకున్న లోన్‌పై కట్టే వడ్డీకి ఈ సెక్షన్ కింద పన్ను మినహాయింపు ఉంటుంది. ఇది మీకోసం లేదా మీ భార్య/భర్త కోసం లేదా మీ పిల్లల కోసం లేదా మీరు చట్టపరమైన గార్డియన్‌గా ఉన్న పిల్లల ఉన్నత చదువుల కోసం తీసుకున్న లోనే అయి ఉండాలి. అసలుపై కాకుండా కేవలం మీరు చెల్లించే వడ్డీపైనే పన్ను మినహాయింపు ఇస్తారన్న సంగతి గుర్తుంచుకోండి. గరిష్ఠంగా 8 ఏళ్లు లేదా వడ్డీ మొత్తం చెల్లించే వరకు ఈ మినహాయింపు తీసుకోవచ్చు. ఈ సెక్షన్ కింద చెల్లించే వడ్డీకి గరిష్ఠ పరిమితి అంటూ ఏదీ లేదు.
సెక్షన్ 80 జీజీసీ
ఏదైనా పొలిటికల్ పార్టీకి ఇచ్చే విరాళంపై ఈ సెక్షన్ కింద పన్ను మినహాయింపు పొందవచ్చు. అయితే డబ్బు రూపంలో మాత్రం ఈ విరాళం ఉండకూడదు. ఇక్కడ రాజకీయ పార్టీ అంటే.. ప్రజా ప్రాతినిధ్య చట్టం 1951లోని సెక్షన్ 29 ఏ కింద రిజిస్టర్ అయిన పార్టీ మాత్రమే.
లీవ్ ట్రావెల్ అలవెన్స్
అన్ని సంస్థలూ కాకపోయినా.. కొన్ని సంస్థలు తమ ఉద్యోగులకు ఈ లీవ్ ట్రావెల్ అలవెన్సులు ఇస్తుంటాయి. ఈ అలవెన్స్‌ను తమ కుటుంబంతో కలిసి ఏదైనా టూర్‌కు వెళ్లడానికి ఉద్యోగి ఉపయోగించుకోవచ్చు. ఇది కూడా పన్ను మినహాయింపు కిందకే వస్తుంది. అయితే అది ఇండియాలో టూర్‌కి మాత్రమే వర్తిస్తుంది. ఈ అలవెన్స్‌ను ఉద్యోగి కచ్చితంగా టూర్ కోసమే ఖర్చు చేయాలి. పన్ను మినహాయింపు కోరే సమయంలో దీనికి సంబంధించిన బిల్స్ అన్నీ ఇవ్వాల్సి ఉంటుంది. దీనిని రెండేళ్లలో ఒకసారి వినియోగించుకోవచ్చు.
లీవ్ ఎన్‌క్యాష్‌మెంట్
చాలా వరకు సంస్థల్లో పెయిడ్ లీవ్స్ ఉంటాయి. వీటిని వాడుకోకపోతే చివరికి ఎన్‌క్యాష్ చేసుకునే వీలు కూడా ఉంటుంది. అలా సెలవులు వాడుకోకుండా వచ్చిన మొత్తానికి కూడా సెక్షన్ 10 (10ఎఎ)కింద పన్ను మినహాయింపు ఉంటుంది. అయితే ఇది అందరికీ ఒకేలా ఉండదు.
– కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులైతే.. రిటైర్మెంట్ సమయంలో వాడకుండా వదిలేసిన సెలవులకు ఎంత మొత్తం వచ్చినా దానిని పన్ను నుంచి మినహాయిస్తారు.
– ఇతర ఉద్యోగులైతే.. కొంత మొత్తం వరకే ఈ పరిమితి ఉంటుంది. పది నెలల సగటు జీతం లేదా ప్రతి ఏటా గరిష్ఠంగా ఏడాదికి 30 రోజుల సెలవుగా లెక్కగడితే వచ్చిన మొత్తం లేదా ప్రభుత్వ విధించిన గరిష్ఠ పరిమితి (రూ. 3 లక్షలు).
ట్రాన్స్‌పోర్టేషన్, ఎడ్యుకేషన్ అలవెన్సులు
కొన్ని సంస్థలు ట్రాన్స్‌పోర్టేషన్ కోసం, పిల్లల చదువుల కోసం ప్రత్యేకంగా అలవెన్సులు ఇస్తుంటాయి. టాక్స్ ఎగ్జెంప్షన్స్ వీటికి కూడా వర్తిస్తాయి. ట్రాన్స్‌పోర్టేషన్ అంటే మీరు ఇంటి నుంచి పని చేసే చోటుకు వెళ్లడానికి ఇచ్చే అలవెన్స్. ఇది గరిష్ఠంగా నెలకు రూ. 1600 వరకు ఉంటుంది. ఇక పిల్లల చదువుల కోసం ఇచ్చే అలవెన్సు నెలకు గరిష్ఠంగా రూ. 100 వరకు ఉంటుంది. అది కూడా గరిష్ఠంగా ఇద్దరు పిల్లల వరకే.
వీఆర్‌ఎస్ కింద వచ్చిన మొత్తం
కొంత మంది ఉద్యోగులు రిటైర్మెంట్ వయసు కంటే ముందే వాలంటరీ రిటైర్మెంట్ తీసుకుంటారు. అలాంటి ఉద్యోగులకు సంస్థలు కొంత మొత్తాన్ని అందిస్తాయి. ఆ మొత్తంపై కూడా సెక్షన్ 10 (10 సీ) కింద పన్ను మినహాయింపు ఉంటుంది.
(మీకు పన్ను మినహాయింపులకు సంబంధించి మరిన్ని చిట్కాలు తెలిస్తే [email protected] కు రాయడం మరిచిపోకండి. ధన్యవాదాలు.
ఇవి కూడా చదవండి