ది బ్లూ అంబ్రెల్లా నవలను రస్కిన్ బాండ్ రాశారు. చిన్నారులు బాగా ఇష్టపడే నవల. ఇది చాలా చిన్న నవల. కానీ చిన్నారుల మనసును ఇట్టే హత్తుకుంటుంది. నైతిక విలువలను పెంపొందించేదిగా ఉంటుంది.
బిన్యా అనే అమ్మాయి కథ ఇది. బిన్యా గర్‌వాల్ కొండ ప్రాంతంలో అమ్మా, అన్నయ్యతో కలిసి జీవిస్తుంది. నీలూ, గోరి అనే రెండు ఆవులను కొండ ప్రాంతంలో మేపడానికి తీసుకెళుతుంటుంది. అది పర్యాటక ప్రాంతం కూడా.
అక్కడికి వచ్చిన ఓ పర్యాటక కుటుంబంలోని మహిళ.. బిన్యా మెడలో చిరుత పులి గోరుతో కూడిన పెండెంట్‌ను చూసి ముచ్చటపడుతుంది. బిన్యాకు వారి దగ్గర ఉండే నీలి రంగు గొడుగు చాలా నచ్చుతుంది. పెండెంట్ కావాలని ఆ మహిళ కోరగా.. అందుకు బదులుగా గొడుగు ఇవ్వాలంటుంది బిన్యా.
అలా గొడుగు తెచ్చుకున్న బిన్యా.. దాన్ని తన ప్రాణంగా చూసుకుంటుంది. అంతులేని ఆనందాన్ని ఈ గొడుగు ద్వారా పొందుతుంది. ఊరు ఊరంతా బిన్యా మీద అసూయ పడేంతగా ఆ గొడుగు అందంగా ఉంటుంది. దగ్గరలో కొట్టు నడిపే రామ్ భరోసాకు ఆ గొడుగుపై కన్ను పడుతుంది. కానీ బిన్యా ఆ గొడుగు ఎవరికీ ఇవ్వదు.
రామ్ భరోసా ఆ గొడుగును దక్కించుకోవడానికి ఎలాంటి ప్రయత్నాలు చేశాడు? చివరికి ఏమైంది.. అన్న అంశాలతో కథ ముగుస్తుంది.
తీసుకోవడంలో కన్నా ఇవ్వడం గొప్ప సంతోషాన్ని ఇస్తుందని చెప్పే కథ ఇది. బిన్యా తీసుకున్న నిర్ణయం రామ్‌భరోసాలోని మంచితనాన్ని మేల్కొలుపుతుంది.
బిన్యా పాత్రను రచయిత మలిచిన తీరు అద్భుతంగా ఉంటుంది. బిన్యా గురించి, తన ఆలోచన గురించి ప్రతి చిన్న విషయమూ ఆకట్టుకునేలా రాశారు.
ది బ్లూ అంబ్రెల్లా నవలలో కొన్ని పదాల కోసం మాత్రమే డిక్షనరీ వెతుక్కోవాల్సి వస్తుంది. కానీ చిన్నారులకు ఇలాంటి చిన్న చిన్న పుస్తకాలను పరిచయం చేయడం ద్వారా బుక్‌రీడింగ్‌పై మంచి ఇష్టం ఏర్పడుతుంది.
ది బ్లూ అంబ్రెల్లా నవల ప్రస్తుతం అమెజాన్ చిల్డ్రెన్ ఫాంటసీ బుక్స్‌లో నెంబర్ 1 గా ఉంది. అలాగే అమెజాన్ టాప్ 100 బుక్స్‌లో నెంబర్ 12గా ఉంది.
అలాగే చిల్డ్రెన్ లిటరేచర్ అండ్ ఫిక్షన్ బుక్స్‌లో మూడో స్థానంలో నిలిచింది. రూపా పబ్లికేషన్స్ వెలువరించిన ఈ పుస్తకం ధర అమెజాన్ లో ప్రస్తుతం రూ. 72 మాత్రమే.
ఇవీ చదవండి