పిల్లలకు సెప్టెంబర్‌ నుంచి వాక్సిన్లుః ఎయిమ్స్‌ చీఫ్‌

vaccine for children
Photo by CDC on Unsplash

పిల్లలకు సెప్టెంబరు నుంచి వాక్సిన్లు అందుబాటులోకి రానున్నట్టు ఎయిమ్స్‌ డైరెక్టర్‌ డాక్టర్‌ రణదీర్‌ గులేరియా తెలిపారు. శనివారం ఆయన ఎన్డీటీవీకి ఇచ్చిన ఇంటర్వ్యూలో మాట్లాడారు. కోవిడ్‌ వ్యాప్తిని బ్రేక్‌ చేయడంలో ఇదొక కీలక అడుగు అవుతుందని ఆయన వివరించారు.

‘జైడస్‌ ఇప్పటికే క్లినికల్‌ ట్రయల్స్‌ నిర్వహించింది. అత్యవసర వినియోగానికి దరఖాస్తు చేసుకుంది. ఆథరైజేషన్‌ కోసం ఎదురుచూస్తోంది. అలాగే భారత్‌ బయోటెక్‌ కోవాగ్జిన్‌ ట్రయల్స్‌ కూడా ఆగస్టు లేదా సెప్టెంబరులోగా పూర్తవ్వాల్సి ఉంది. ఆ సమయానికి అప్రూవల్‌ రావొచ్చు.

ఇక ఫైజర్‌ వాక్సిన్‌ ఇప్పటికే యూఎస్‌ రెగ్యులేటరీ వ్యవస్థ ఫుడ్‌ అండ్‌ డ్రగ్‌ అడ్మినిస్ట్రేషన్‌ అనుమతి పొందింది. అందువల్ల సెప్టెంబరు నుంచి పిల్లలకు వాక్సిన్‌ అందుతుందని ఆశిస్తున్నాం. ఈ చర్య కోవిడ్‌ వ్యాప్తి గొలుసుకు అడ్డుకట్ట వేస్తుందని భావిస్తున్నాం..’ అని ఆయన తన ఇంటర్వ్యూలో పేర్కొన్నారు.

‘మన దేశంలో చిన్నారులకు వాక్సిన్‌ వేయాలంటే మన టీకా ఉండడం వల్ల లభ్యత పెరుగుతుంది. అందువల్ల జైడస్, కోవాగ్జిన్‌ టీకాల కోసం ఎదురు చూస్తున్నాం. ఫైజర్‌ లభ్యత కూడా ఒకింత మేలు చేస్తుంది. ఈ వాక్సిన్‌ సురక్షితమైనదే అనేందుకు తగిన డేటా అందుబాటులో ఉంది.

అయితే తగిన సంఖ్యలో వాక్సిన్‌ అందుబాటులో ఉంటుందా అన్న విషయమై స్పష్టత లేదు. సెప్టెంబరు నాటికి ఒకటి కంటే ఎక్కువ సంఖ్యలో కంపెనీలు వాక్సిన్లు అందుబాటులోకి తెస్తాయన్న విశ్వాసం ఉంది..’ అని ఆయన వివరించారు.

స్కూల్స్ ఎప్పుడు ప్రారంభమవుతాయి?

‘చిన్నారులు బడికి వెళ్లడం స్టార్ట్‌ చేస్తే వారికి ఉండే ఇమ్యూనిటీ వల్ల కోవిడ్‌ను సులువుగా ఎదుర్కొనే అవకాశం ఉంటుంది. కానీ వారి నుంచి ఇంట్లో పెద్దవారికి, ఇతర వ్యాధులు ఉన్న వారికి వైరస్‌ సోకే ప్రమాదం ఉంటుంది. అందుకే చాలా మంది ఇప్పుడే స్కూళ్లు తెరవొద్దు అని అంటున్నారు.

అయితే థర్డ్‌ వేవ్‌ వల్ల చిన్నారులకూ ప్రమాదం పొంచి ఉందన్న ఆందోళనలూ ఉన్నాయి. ఈ ఏడాది చివరలో పాఠశాలలు తెరుచుకునే అవకాశం ఉంది..’ అని పేర్కొన్నారు. ‘నేను వ్యక్తిగతంగా భావిస్తున్నదేంటంటే పిల్లలకు గ్రేడెడ్‌ పద్ధతిలో పాఠశాలలు తెరవాలి. ఆన్‌లైన్‌ క్లాసుల లభ్యత లేనివారు తీవ్ర ఇక్కట్లలో ఉన్నారు. అక్టోబరు, నవంబరులో పిల్లలకు వాక్సిన్లు వేస్తే ఆ టైమ్‌కు పాఠశాలలు తెరుచకోవడం మంచిది..’ అని అభిప్రాయపడ్డారు.

దేశంలో ఇప్పటికే 42 కోట్ల డోసుల మేర టీకా వేయడం పూర్తయింది. దేశ జనాభాలో దాదాపు 6 శాతం మందికి టీకా అందింది. ఈ ఏడాది చివరి వరకు దేశ ప్రజలందరికీ టీకా అందించాలన్న లక్ష్యంతో కేంద్ర ప్రభుత్వం టీకా కార్యక్రమాన్ని విస్తృతం చేస్తోంది.

అయితే ఇప్పటివరకు దేశంలో చిన్నారులకు టీకా విషయంలో ఇంకా స్పష్టత రాలేదు. ఇక మోడర్నా సంస్థ 12 నుంచి 17 ఏళ్ల మధ్య పిల్లలకు టీకా ఇచ్చేందుకు యూరోపియన్‌ మెడిసిన్స్‌ రెగ్యులేటరీ సంస్థ నుంచి ఆమోదం పొందింది.

Previous articlemental health: మానసిక వ్యాధులు రాకుండా ఉండాలంటే ఏంచేయాలి?
Next articleఅమెజాన్‌ గ్రేట్‌ ఫ్రీడమ్‌ ఫెస్టివల్‌ సేల్ : మొబైల్స్, ఎలక్ట్రానిక్స్‌పై ఆఫర్లు