కరోనా వైరస్ జీవితాలను స్తంభింపజేసినా.. కొన్ని విషయాల్లో ప్రపంచ వేగాన్ని పెంచింది. అందులో వర్క్ ఫ్రం హోం ఒకటి. ఇప్పటి వరకు వర్క్ ఫ్రం హోం చేసేందుకు కొన్ని సందర్భాల్లో కొంత మంది ఉద్యోగులకు కొన్ని రోజులు మాత్రమే వీలుకలిగేది. కానీ కరోనా వైరస్ ఈ విధానాన్ని ప్రక్షాళన చేసింది.
ఆఫీసును కేవలం భౌతికంగా ఉంచి, అందులో పని చేసే ఉద్యోగులను ఇళ్లకు పరిమితం చేసింది. ఎంత మంది ఉంటె అంత మందిని వర్క్ ఫ్రమ్ హోం చేసేలా మార్చేసింది.
వారం పదిరోజుల వర్క్ ఫ్రం హోం విధానానికి ‘కరోనా నెలలు’ గడిచాయి. ఈ విధానం సంస్థలకు కొన్ని విషయాల్లో లాభాలనే తెచ్చిపెట్టిందని చెప్పాలి. ఆఫీసు మెయింటేనెన్స్, స్టాఫ్ మెయింటేనెన్స్ ఖర్చులు, భోజన ఖర్చులు, విద్యుత్ చార్జీలు ఇలా కొన్ని విషయాల్లో ఖర్చులను తగ్గించింది.
ఇక పని విషయానికి వస్తే ఉద్యోగులు కళ్ల ముందు లేరు అన్న ఆలోచన తప్ప ‘పని’ ఎక్కడ జరిగినా పనే అన్న భావనను ఇప్పుడిప్పుడే కార్పొరేట్ కంపెనీలు అర్థం చేసుకుంటూ ఆ దిశగా సర్దుబాటు చేసుకుంటున్నాయి.
‘కరోనా’ వర్క్ ఫ్రమ్ హోమ్ విధానం ఇక తరచుగా అమలయ్యే పరిస్థితులు ప్రపంచంలో ఏర్పడ్డాయి. ఇప్పటికే తమ ఉద్యోగులతో ఇంటి నుంచి పనిచేయించుకుంటున్న ప్రపంచ ప్రసిద్ధ సంస్థలు వాటిని ఏడాదిపాటు పొడిగించాలని యోచిస్తున్నాయి.
గూగుల్, ట్విటర్, ఫేస్ బుక్ సంస్థలు తమ ఉద్యోగులకు ఈ ఏడాది మొత్తం ఇంటి నుంచి పని చేసే వెసులుబాటు కల్పించే ప్రయత్నాల్లో ఉన్నాయి. అంతేకాకుండా ఈ ఇంటి నుంచి పని విధానాన్ని ఏడాదిలో క్రమం తప్పకుండా అమలు చేయాలని భావిస్తున్నాయి.
ఇలా ప్రతి ఉద్యోగి ఇన్ని రోజులు ఇంటి నుంచే పనిచేయవచ్చు అని లెక్కలేసుకొనే రోజులు త్వరలోనే రానున్నాయని చెప్పడంలో అతిశయోక్తి లేదు. ఇక ఈ విషయంలో మన కేంద్ర ప్రభుత్వం కూడా త్వరగానే నిర్ణయం తీసుకుందని చెప్పవచ్చు. అర్హులైన ఉద్యోగులు ఏడాదిలో 15 రోజులు ఇంటి నుంచి పని చేసే వీలు కల్పించాలని నిర్ణయించింది. ఈ మేరకు కేంద్ర సిబ్బంది, శిక్షణ వ్యవహారాల శాఖ మార్గదర్శకాలు జారీ చేసింది.
ఇలా ప్రపంచంలోని బడా బడా కార్పొరేట్ సంస్థలు, దేశీయ ప్రైవేటు సంస్థలు, ప్రభుత్వాలు తమ ఉద్యోగులను ఏడాదిలో క్రమం తప్పకుండా ఇంటి నుంచే పని చేసే వీలుకల్పిస్తుండడంతో.. ఉద్యోగులు ఇక నుంచి తమ ప్లే స్లిప్పుల్లో ఈఎల్స్, ఎస్ఎల్స్, సీఎల్స్ సరసనా వర్క్ ఫ్రం హోం లెక్కలు కూడా చూసుకొనే రోజులు దగ్గరలోనే ఉన్నాయి!
నిజానికి ప్రయాణ బడలిక, కాలుష్య ప్రభావం, బయటి ఆహారం, వీటన్నింటి ద్వారా కలిగే ఒత్తిళ్ల నుంచి బయటపడేందుకు కరోనా ఇచ్చిన గిఫ్ట్ ఈ వర్క్ ఫ్రమ్ హోం.