అన్ని పనులకూ యాప్స్ ఉన్నట్లే.. ఇప్పుడు డేటింగ్కూ యాప్స్ ఉన్నాయి. అందులో బెస్ట్ డేటింగ్ యాప్స్ ఏవో మీకు తెలుసా? నిజానికి ఆన్లైన్ డేటింగ్ యాప్స్‌కు యూత్‌లో మంచి క్రేజ్ ఉంది. ఇన్నాళ్లూ కేవలం వెస్టర్న్ కంట్రీస్‌కు మాత్రమే పరిమితమైన డేటింగ్.. ఇప్పుడు ఇండియాకూ పాకింది. అర్బన్ ఏరియాల్లో డేటింగ్ కామనైపోయింది.
అయితే నేరుగా తమ డేటింగ్ మేట్స్‌ను వెతుక్కోవడం కష్టం అనుకునే వాళ్ల కోసం ఇప్పుడు ఆన్లైన్ డేటింగ్ యాప్స్ వచ్చాయి. టైంపాస్ చేసేవాళ్లకైనా, సీరియస్ రిలేషన్షిప్ కోసం ఎదురుచూస్తున్న వాళ్లకైనా ఈ యాప్స్ మంచి వినోదాన్ని పంచుతున్నాయి. అయితే డేటింగ్ కోసం కూడా గూగుల్ ప్లే స్టోర్‌లో, ఐఓఎస్ యాప్ స్టోర్‌లో ఎన్నో యాప్స్ ఉన్నాయి.
వాటిలో చాలా వరకు మన డేటా చోరీ చేసేవో లేక సరిగా పని చేయనివో ఉంటాయి. పైగా అన్ని యాప్స్ మన దేశంలో సరిగా పని చేయవు. ఈ నేపథ్యంలో ఇండియాలో పని చేసే బెస్ట్ డేటింగ్ యాప్స్ ఏంటో ఇప్పుడు చూద్దాం. టిండర్ అనే డేటింగ్ యాప్ ఇప్పటికే చాలా మందికి తెలుసు. అయితే డేటింగ్ కోసం అదొక్కటే కాదు.. ఇంకా చాలా యాప్సే ఉన్నాయి.
టిండర్ (Tinder)
ఇది ఇండియాలో చాలా మందికి సుపరిచితమైన డేటింగ్ యాప్. మన దేశంలో టిండర్‌కు భారీ సంఖ్యలో యూజర్లు ఉన్నారు. టిండర్‌లో మీ ఫేస్బుక్ అకౌంట్‌తో లాగిన్ అవచ్చు. అందులో నుంచే మీ ప్రొఫైల్‌ను తీసుకుంటుంది. ముందుగానే మీ ఆసక్తి ఏంటన్నది కూడా ఇవ్వాలి. ఫేస్బుక్ అకౌంట్ వద్దు అనుకుంటే.. మీ మొబైల్ నంబర్ ద్వారా కొత్తగా అకౌంట్ క్రియేట్ చేసుకోవచ్చు. మీలాంటి ఆలోచనలు, ఆసక్తి ఉన్న వాళ్ల ప్రొఫైల్స్‌ను మీరు చూడొచ్చు. మీకు నచ్చిన ప్రొఫైల్‌ను కుడివైపు స్వైప్ చేయాలి. నచ్చకపోతే ఎడమవైపు స్వైప్ చేయాలి. అవతలి వ్యక్తికి కూడా మీ ప్రొఫైల్ నచ్చితే ఇద్దరూ నేరుగా చాట్ చేసుకోవచ్చు. అయితే టిండర్‌లో మీ లుక్కే ఎక్కువ ప్రాధాన్యత ఉంటుంది. ఎందుకంటే అవతలి వ్యక్తికి కనిపించేది కేవలం మీ ఫొటో మాత్రమే. ఫొటోలను బట్టే రైట్ లేదా లెఫ్ట్ స్వైప్స్ వస్తాయి. ఫ్రీ అకౌంట్ అయితే పరిమిత సంఖ్యలోనే ప్రొఫైల్స్ మీకు కనిపిస్తాయి. అదే ప్రీమియం అకౌంట్ తీసుకుంటే.. మీ లొకేషన్లో అపరిమిత సంఖ్యలో ప్రొఫైల్స్ చూడొచ్చు. లొకేషన్ మార్చుకోవచ్చు. మీ ప్రొఫైల్‌ను లైక్ చేసిన వాళ్లు ఎవరో చూడొచ్చు. ఒక వ్యక్తిని పేరుతో సెర్చ్ చేసే అవకాశం ఇందులో ఉండదు. మీరు నమ్మదగిన వ్యక్తి దొరికే వరకు మీ అసలు పేరును చెప్పొద్దు అనుకుంటే.. నిక్నేమ్తోనూ ప్రొఫైల్ క్రియేట్ చేసుకోవచ్చు. ఆండ్రాయిడ్, ఐఓఎస్‌లలో ఈ యాప్ అందుబాటులో ఉంది.
ట్రూలీమ్యాడ్లీ (TrulyMadly)
టిండర్లాగే ఇండియాలో ఈ ట్రూలీ మ్యాడ్లీ యాప్‌కు కూడా మంచి డిమాండ్ ఉంది. ఈ డేటింగ్ యాప్ ప్రొఫైల్‌ను చాలా సీరియస్‌గా వెరిఫై చేస్తుంది. ప్రూఫ్ కోసం కొన్ని డాక్యుమెంట్లను కూడా అడుగుతుంది. ఆ తర్వాతే మీ ప్రొఫైల్ క్రియేట్ అవుతుంది. అప్పటి నుంచీ మీలాంటి ప్రొఫైల్స్ ఉన్న వాళ్లను చూపిస్తుంది. మీ వివరాలన్నీ వెరిఫై చేసి, అవన్నీ కరెక్టేనని తేలితే.. మీకు ట్రస్ట్ స్కోరు కూడా వస్తుంది. మీకు ఎంత ఎక్కువ స్కోరు వస్తే.. మీది అంత నమ్మకమైన ప్రొఫైల్ అని అర్థం. టిండర్లాగే ఇందులోనూ మీకు నచ్చిన, నచ్చని ప్రొఫైల్స్‌ను వేరు చేయొచ్చు. ఇద్దరూ ఒకరికొకరు నచ్చితే నేరుగా చాట్ చేసుకోవచ్చు. ఈ యాప్‌లో వెరిఫికేషన్ ప్రక్రియ చాలా కఠినంగా ఉండటంతో నకిలీ వ్యక్తుల బెడద ఉండదు. పైగా మీ ఫొటోలను అవతలి వ్యక్తులు స్క్రీన్‌షాట్ తీయడంగానీ, డౌన్లోడ్ చేయడంగానీ జరగదు. అందువల్ల మీ ఫొటోలు కూడా సేఫ్‌గానే ఉంటాయి. ఆండ్రాయిడ్, ఐవోఎస్‌లలో ఈ యాప్ అందుబాటులో ఉంది.
హ్యాపెన్ (Happn)
పై రెండు డేటింగ్ యాప్స్‌లో లేని ఓ యూనిక్ ఆప్షన్ ఈ హ్యాపెన్ యాప్‌లో ఉంది. అదేంటంటే.. మీకు నచ్చిన, మీరు గతంలో నేరుగా కలిసిన వ్యక్తుల ప్రొఫైల్స్‌ను ఇందులో చెక్ చేసుకోవచ్చు. వాళ్లు కూడా ఈ యాప్‌లో ఉంటే ఓ సీక్రెట్ లైక్‌ను పంపొచ్చు. అవతలి వ్యక్తి కూడా అదే చేస్తే.. ఇద్దరూ చాట్ చేసుకునే చాన్స్ ఉంటుంది. గతంలో ఓ వ్యక్తి నచ్చినా, ఆ విషయం వాళ్లతో నేరుగా చెప్పలేకపోయామన్న బాధ మీలో ఉండొచ్చు. అలాంటి వ్యక్తులకు ఈ యాప్ ఓ వరమనే చెప్పాలి. ఆ వ్యక్తి వివరాల ఆధారంగా సెర్చ్ చేసే అవకాశం Happnలో ఉంటుంది. ఒకవేళ వాళ్లకు కూడా ఇందులో అకౌంట్ ఉంటే మీ పంట పండినట్లే. ఒకటి కంటే ఎక్కువ ఫొటోలతో ప్రొఫైల్ క్రియేట్ చేసుకోవచ్చు. ఆండ్రాయిడ్, ఐవోఎస్‌లలో ఈ యాప్ డౌన్లోడ్ చేసుకోవచ్చు.
వూ (woo)
Happnలాగే ఇందులోనూ ఓ యూనిక్ ఆప్షన్ ఉంది. ఈ యాప్‌లో బాగా చదువుకున్న ప్రొఫెషనల్స్ మాత్రమే ఉంటారు. వాయిస్ ఇంట్రో, ట్యాగ్ సెర్చ్, డైరెక్ట్ మెసేజింగ్ ఫీచర్లు ఈ యాప్‌లో ఉంటాయి. వాయిస్ కాల్స్ ఆప్షన్ కూడా ఉంటుంది. ఇది గాళ్స్‌కు బాగా పనికొస్తుంది. వాళ్ల నంబర్ షేర్ చేయకుండానే ఈ వాయిస్ కాలింగ్ ద్వారా అవతలి వ్యక్తితో మాట్లాడొచ్చు. ఈ యాప్ మహిళల పేరు, నంబర్, లొకేషన్లను ఎట్టి పరిస్థితుల్లోనూ షేర్ చేయదు. టిండర్లాగే ఓ ప్రొఫైల్‌ను లెఫ్ట్ లేదా రైట్‌కు స్వైప్ చేయడం ద్వారా మీ లైక్ లేదా డిస్లైక్ చెప్పొచ్చు. బేసిక్ వూ యాప్ ద్వారా రోజుకు పరిమిత సంఖ్యలో ప్రొఫైల్స్‌ను చెక్ చేయొచ్చు. అదే వూ ప్లస్‌కు సబ్‌స్క్రైబ్ చేసుకుంటే.. అపరిమిత ప్రొఫైల్స్‌తోపాటు మీ ప్రొఫైల్‌ను ఎవరు చూశారో తెలుసుకోవచ్చు. ఆండ్రాయిడ్, ఐఓఎస్‌లలో ఈ యాప్ ఉంది.
ఓకే క్యుపిడ్ (okcupid)
ఇదొక ఇంటర్నేషనల్ డేటింగ్ యాప్. 113 దేశాల్లో అందుబాటులో ఉంది. నమ్మదగిన డేటింగ్ యాప్. మీకు నచ్చిన మ్యాచ్ కావాలంటే ఈ యాప్ ఎన్నో ప్రశ్నలు వేస్తుంది. లొకేషన్‌ను బట్టి ఈ ప్రశ్నలు ఉంటాయి. మీకు నచ్చినవాళ్లు ఇందులో ఉన్నారో లేదో తెలుసుకోవడానికి సెర్చ్ ఆప్షన్ కూడా అందుబాటులో ఉంటుంది. ప్రైవసీకి కూడా ఈ యాప్ ప్రాధాన్యత ఇస్తుంది. మీకు నచ్చని వ్యక్తుల నుంచి మీ ప్రొఫైల్‌ను దాచుకోవచ్చు. ఆండ్రాయిడ్, ఐఓఎస్ యూజర్లు ఈ యాప్ డౌన్లోడ్ చేసుకోవచ్చు.
హింజ్ (Hinge)
ఈ డేటింగ్ యాప్‌లోకి మీ ఫేస్బుక్ ప్రొఫైల్ ద్వారా సైన్ ఇన్ కావచ్చు. మీ ఫ్రెండ్స్ ఫ్రెండ్స్‌తో ఈ యాప్ లింకు కలుపుతుంది. ఫ్రెండ్స్‌ను బట్టి ఈ యాప్ మీకు సలహాలు కూడా ఇస్తుంది. ప్రొఫైల్ క్రియేట్ చేసినప్పుడే మీ ఫొటోలు సబ్మిట్ చేయడంతోపాటు కొన్ని ప్రశ్నలకు సమాధానాలు ఇవ్వాల్సి ఉంటుంది. వీటి ప్రకారం మీకో టైమ్‌లైన్ క్రియేటవుతుంది. ఎవరైనా మీ టైమ్‌లైన్‌ను లైక్ చేస్తే.. మీకు నోటిఫికేషన్ వస్తుంది. ఆండ్రాయిడ్, ఐవోఎస్‌లలో యాప్ అందుబాటులో ఉంది.
కాఫీ మీట్స్ బాగెల్ (Coffee Meets Bagel)
ప్రత్యేకంగా అమ్మాయిల కోసం రూపొందించిన యాప్ ఇది. ఇక్కడ అబ్బాయిల కంటే అమ్మాయిలకు ఎక్కువ ఆప్షన్స్ ఉంటాయి. అమ్మాయిలకు ఎవరివి పడితే వాళ్ల సజెషన్స్ పంపే చాన్స్ ఇందులో ఉండదు. అంతకుముందు తమపై ఆసక్తి చూపిన వాళ్లవి మాత్రమే సజెషన్స్ వస్తాయి. అబ్బాయిలకు కేవలం లైక్ కొట్టడం లేదంటే పాస్ చేసే ఆప్షన్స్ మాత్రమే ఉంటాయి. రోజుకోసారి మాత్రమే ఈ యాప్ సజెషన్స్ పంపిస్తుంది. దీనివల్ల రోజంతా యాప్‌పై కూర్చొని మీ టైమ్ వేస్ట్ చేసుకోవాల్సిన అవసరం లేదు. రోజుకోసారి యాప్ సజెషన్స్ను బట్టి మీకు ఆసక్తి ఉన్న ప్రొఫైల్స్‌ను లైక్ చేయొచ్చు. ఆండ్రాయిడ్, ఐఓఎస్‌లలో యాప్ డౌన్లోడ్ చేసుకోవచ్చు.
ఐల్ (Aisle)
ఐల్ డేటింగ్ యాప్ టైంపాస్ చేసేవాళ్ల కోసం కాదు. ఓ సీరియస్ రిలేషన్షిప్ కోరుకునే వాళ్లకు ఈ యాప్ బాగా పనికొస్తుంది. ఫేస్బుక్ లేదా లింక్డిన్ ప్రొఫైల్ ద్వారా లాగిన్ కావచ్చు. మీ ప్రొఫైల్ క్రియేటయ్యే ముందే ఈ యాప్ మిమ్మల్ని చాలా ప్రశ్నలు అడుగుతుంది. ఆ తర్వాత ఆన్సర్లను వెరిఫికేషన్ కోసం సబ్మిట్ చేయాలి. వెరిఫికేషన్ పూర్తయిన తర్వాత యాప్‌ను యూజ్ చేసుకోవచ్చు. దీనిని ఫ్రీగానే డౌన్లోడ్ చేసుకోవచ్చు. కాకపోతే వీఐపీ మెంబర్షిప్ ద్వారా చాలా ఫీచర్లను వాడుకునే వీలుంటుంది.
బడూ (Badoo)
ఈ యాప్ కూడా ఇంటర్నేషనల్ లెవల్లో పాపులర్. 40 కోట్ల మంది యూజర్లు ఉన్నారు. ఇది కూడా టిండర్‌లాంటి యాపే. కాకపోతే ఇందులో ఉండే మరిన్ని ఆప్షన్స్ కారణంగా మీకు తగిన జోడీని వెతుక్కునే అవకాశం ఉంటుంది. సోషల్ మీడియా అకౌంట్స్ లేదా ఈమెయిల్ ఐడీ ద్వారా సైనప్ అవచ్చు. మొబైల్ నంబర్ వెరిఫికేషన్ కూడా ఉంటుంది. మీ లొకేషన్‌కు దగ్గరగా ఉన్న యూజర్ల సమాచారాన్ని నియర్ మి ఆప్షన్ ద్వారా తెలుసుకోవచ్చు. లైవ్ స్ట్రీమింగ్, వీడియో చాట్ ఆప్షన్స్ కూడా ఉన్నాయి.