ఇంటర్వ్యూ ప్రశ్నలు సమాధానాలు చాలా వరకు మీరు చేయబోయే జాబ్ గురించే ఉంటాయి. కానీ కొన్ని ప్రశ్నలు చాలా లాజికల్‌గా ఉంటాయి. కొన్ని నవ్వు తెప్పించేలా ఉంటాయి. కానీ ఇవన్నీ మీ మెదడుకు పని చెప్పేవే. వీటిలో కొన్ని ప్రశ్నలకు కచ్చితమైన సమాధానమే ఉండకపోవచ్చు. కానీ ఒత్తిడిలో వాళ్ల ఆలోచన విధానం ఎలా ఉంటుంది.. వాళ్లు ఎలాంటి పరిష్కారాలను ఆలోచించగలరు అని పరీక్షించడానికే గూగుల్ వంటి కంపెనీలు ఇంటర్వ్యూ లో ఇలాంటి ప్రశ్నలు అడుగుతారు.
ఇంటర్వ్యూలో అడిగే ప్రశ్నలకు సమాధానం ఇవ్వాలంటే రొటీన్‌గా కాకుండా మీరు కూడా కొత్తగా ఆలోచించగలగాలి. అంటే ఔట్ ఆఫ్ ద బాక్స్ థింకింగ్ అంటాం కదా.. అలా అన్నమాట.
గూగుల్‌కు ఈ కాలంలో ఉన్న క్రేజ్ తెలుసు కదా. అది ఓ మోడర్న్ డే గురు. వరల్డ్‌లోనే బెస్ట్ సెర్చ్ ఇంజిన్. పైగా తాను పని చేయడానికి ఎలాంటి వాతావరణం ఉండాలని ఓ ఉద్యోగి కోరుకుంటాడో సరిగ్గా అలాగే ఉంటుంది. ఆడుతూ పాడుతూ పని చేసుకుంటారు గూగుల్ ఉద్యోగులు.
ఫ్రీ కేఫ్టేరియాలు, మసాజ్ రూమ్స్, ఫ్రీ హెల్త్ చెకప్స్, నిద్రొస్తే పడుకోవడానికి నాప్ పాడ్స్, వీడియో గేమ్స్, స్విమ్మింగ్ పూల్.. సింపుల్‌గా చెప్పాలంటే అదొక స్వర్గం. పైగా ప్రపంచంలో ఏ కంపెనీ ఇవ్వనంత జీతాలు, అలవెన్సులు. అలాంటి కంపెనీలో పని చేయడానికి ఎవరు మాత్రం ఇష్టపడరు.
ప్రతి ఏటా కొన్ని లక్షల మంది ఇందులో ఉద్యోగం కోసం ప్రయత్నిస్తుంటారు. వీళ్లలో తమకు కావాల్సిన ఉద్యోగులను ఎంచుకోవడానికి గూగుల్ కూడా వినూత్నంగా ఆలోచిస్తుంది.
కొన్నేళ్లుగా గూగుల్‌లో వివిధ ఉద్యోగాల కోసం ఎలాంటి కఠినమైన, వింత ప్రశ్నలు అడుగుతున్నారు.. ఆ ప్రశ్నలు అడగడం వెనుక ఉన్న ఉద్దేశమేంటి? అన్న అంశాలను డియర్ అర్బన్.కామ్ అందిస్తున్న ఈ స్టోరీలో చూడండి.
ఓ స్కూల్ బస్‌లో ఎన్ని గోల్ఫ్ బాల్స్ నింపొచ్చు?
ప్రోడక్ట్ మేనేజర్ జాబ్ కోసం గూగుల్ ఇంటర్వ్యూలో అడిగిన ప్రశ్న ఇది. ఈ ప్రశ్న అడగడం వెనుక అసలు ఉద్దేశం ఏంటంటే.. మీరు సమస్యను ఎలా పరిష్కరిస్తారని తెలుసుకోవడం. దీనికి కచ్చితమైన సమాధానం ఏమీ ఉండదు.
కానీ సమస్యను పరిష్కరించడంలో మీ ఆలోచన విధానాన్ని ఇంటర్వ్యూయర్‌కు వివరించాల్సి ఉంటుంది. అంటే ముందుగా స్కూల్ బస్ కొలతలు ఎలా ఉంటాయో చెబుతూ బస్ ఘన పరిమాణం ఎంత అన్నది అంచనా వేయాలి.
ఆ తర్వాత గోల్ఫ్ బాల్ ఉండే సైజు, దాని ఆకారం గురించి వివరిస్తూ.. ఆ బస్సులో సుమారుగా ఇన్ని బాల్స్ పట్టొచ్చు అని వివరిస్తే ఇంటర్వ్యూయర్ సమస్య పరిష్కారంలో మీకున్న ఆలోచనా విధానాన్ని అర్థం చేసుకోగలుగుతారు. రొటీన్ ఇంటర్వ్యూల్లో అయితే చాలా మంది ఓ నంబర్ చెప్పేసి ఊరుకుంటారు. గూగుల్ ఇంటర్వ్యూలో అది కుదరదు. అలా చేస్తే జాబ్ పోయినట్లే.
ఎక్కువ బరువున్న బంతి ఏది?
– ఒకే సైజులో ఉన్న ఎనిమిది బాల్స్ మీకు ఇస్తాం. అందులో ఏడు ఒకే బరువు ఉంటాయి. ఒక్క బాల్ బరువు మాత్రం ఎక్కువగా ఉంటుంది. మీరు ఈ బాల్స్ బరువు చూడటానికి ఓ త్రాసు కూడా ఇస్తాం. కేవలం రెండే ప్రయత్నాల్లో వీటిలో ఎక్కువ బరువున్న బంతి ఏదో చెప్పాలి?
ఇది కూడా ఓ ప్రోడక్ట్ మేనేజర్ జాబ్ కోసం వచ్చిన వ్యక్తిని గూగుల్ ఇంటర్వ్యూయర్ అడిగిన ప్రశ్న. అభ్యర్థి క్రియేటివిటీని పరీక్షించడానికి అడిగిన ప్రశ్న ఇది. పరిమిత స్థాయిలో వనరులు ఉన్నపుడు సమస్య పరిష్కారంలో ఎలా వ్యవహరిస్తారో తెలుసుకోవడమే ఈ ప్రశ్న ఉద్దేశం.
నిజానికి ఆన్సర్ సింపుల్. ముందు ఆరు బాల్స్ తీసుకోండి. రెండు వైపులా మూడేసి బాల్స్‌ను ఉంచండి. రెండూ సమానంగా ఉంటే ఇందులో బరువైన బాల్ లేదని అర్థం. మిగతా రెండు బాల్స్‌ను కూడా ఇలాగే చూస్తే తెలిసిపోతుంది. అంటే రెండే ప్రయత్నాల్లో బరువైన బాల్ ఏదనేది చెప్పేస్తారు. లేదా తొలిసారి ఆరు బాల్స్ తీసుకున్నపుడే ఒకదాంట్లో బరువైనది ఉందనుకుందాం. అప్పుడు త్రాసు ఒకవైపు ఎక్కువ బరువు తూగుతుంది.
అప్పుడు ఆ మూడు బాల్స్‌లో రెండింటిని తీసుకొని మళ్లీ బరువు చూడండి. అవి సమానంగా ఉంటే మూడో బంతి బరువైనదని చెప్పొచ్చు. లేదా ఆ రెండింటిలోనే ఒకటి బరువైనది ఉంటే అక్కడే మీకు తెలిసిపోతుంది.
మ్యాన్‌హోల్ కవర్స్ ఎందుకు గుండ్రంగానే ఉంటాయి?
సాఫ్ట్వేర్ ఇంజినీర్ జాబ్ కోసం వచ్చిన అభ్యర్థిని అడిగిన ప్రశ్న ఇది. నిజానికి గూగుల్ ఇంటర్వ్యూల్లో చాలాసార్లు ఈ ప్రశ్న అడిగారు. కానీ చాలా మంది సమాధానం చెప్పలేకపోయారు. దీనికి జవాబు ఏంటంటే.. అది మ్యాన్‌హోల్‌లో పడిపోదు కాట్టి. ఎందుకంటే తనలో తాను పడిపోని ఏకైక ఆకారం సర్కిల్ మాత్రమే.
డేటాబేస్ గురించి మీ 8 ఏళ్ల వయసున్న అల్లుడికి మూడు ముక్కల్లో ఎలా వివరిస్తారు?
ప్రోడక్ట్ మేనేజర్ ఇంటర్వ్యూలో అడిగిన ప్రశ్న ఇది. క్లిష్టమైన అంశాలను సులువుగా అవతలి వ్యక్తులకు చేరవేయడంలో అభ్యర్థికి ఉన్న సామర్థ్యాన్ని పరీక్షించడమే ఈ ప్రశ్న అడగడం వెనుక ఉన్న ఉద్దేశం. దీనికి ఓ వ్యక్తి చెప్పిన సమాధానం.. డేటాబేస్ అంటే చాలా విషయాలను గుర్తు పెట్టుకొనే ఓ మెషీన్. ఆ సమాచారాన్ని తెలుసుకోవడానికి మనం దానిని వాడుతుంటాం అని.
– మనకు 30 రోజులు ఉన్న నెలలు ఉన్నాయి.. 31 రోజులు ఉన్న నెలలు ఉన్నాయి. మరి 28 రోజులు ఉన్న నెలలు ఎన్ని ఉన్నాయి?
చాలా సింపుల్‌గా కనిపించే తెలివైన ప్రశ్న ఇది. ఇది కూడా తెలియదా అన్నట్లు ఫిబ్రవరి అని చెప్పారో.. జాబ్ పోయినట్లే. ఎందుకంటే ఏడాదిలో ఉన్న నెలల్లోనూ 28, అంతకంటే ఎక్కువ రోజులు ఉంటాయి.
– మీ ఫ్రెండ్ బాబ్ దగ్గర మీ సరైన మొబైల్ నంబరే ఉందా లేదా తెలుసుకోవాలి. కానీ బాబ్ను నేరుగా అడక్కూడదు. ఆ ప్రశ్నను మీరు ఓ పేపర్‌పై రాసి మధ్యలో ఉన్న ఈవ్‌కు ఇచ్చి బాబ్‌కు ఇవ్వమని చెప్పాలి. అలాగే బాబ్ రాసిచ్చిన ఆన్సర్ మీరు తీసుకోవాలి. అయితే మీరు అడిగిన ప్రశ్న బాబ్ అర్థం చేసుకోవాలి కానీ.. మధ్యలో ఉన్న ఈవ్‌కు మీ ఫోన్ నంబర్ తెలియకూడదు. ఆ ప్రశ్న ఎలా రాస్తారు?
సాఫ్ట్వేర్ ఇంజినీర్ జాబ్ కోసం వచ్చిన అభ్యర్థిని గూగుల్ ఇంటర్వ్యూలో అడిగిన ప్రశ్న ఇది. మీరు ఎంత క్రియేటివ్‌గా, వినూత్నంగా ఆలోచించగలరు అని తెలుసుకోవడానికే ఈ వింత ప్రశ్న. దీనికి సింపుల్ ఆన్సర్ ఏంటంటే.. ఓసారి మీ మొబైల్‌కు కాల్ చేయమని చెప్పి పేపర్‌పై రాసివ్వడమే. మీకు కాల్ వచ్చిందంటే అతని దగ్గర సరైన నంబరే ఉందని అర్థం. లేదంటే లేనట్లే. మరో వ్యక్తి దీనికి కాస్త తికమకగా ఆన్సర్‌గా ఇచ్చాడు. అదేంటంటే మీ మొబైల్ నంబర్లోని అంకెలన్నీ కూడితే ఎంత మొత్తం వస్తుందో చెప్పమని బాబ్ను అడగాలి.
ఆ మొత్తం వేరుగా ఉంటే మీ సరైన మొబైల్ నంబర్ అతని దగ్గర లేదని అర్థం. పైగా బాబ్ కేవలం మొత్తం ఎంత అన్న నంబర్ మాత్రమే రాస్తాడు కాబట్టి మధ్యలో ఉన్న ఈవ్‌కు మొబైల్ నంబర్ తెలుసుకునే అవకాశం ఉండదు. దీనికి చెక్ సమ్ (check-sum) మెథడ్ అంటారు.
సీటెల్ నగరంలో ఉన్న అన్ని కిటికీలను శుభ్రం చేయడానికి మీరు ఎంత మొత్తం తీసుకుంటారు?
ప్రోడక్ట్ మేనేజర్ జాబ్ ఇంటర్వ్యూలో అడిగిన ప్రశ్న ఇది. క్లిష్టమైన సమస్యలకు సింపుల్‌గా పరిష్కారాలను కనుగొనే సామర్థ్యం మీకు ఉందా లేదా తెలుసుకోవడానికి అడిగే ప్రశ్న ఇది. దీనికి ఆ నగరంలో ఉన్న కిటికీలు ఎన్ని అన్న లెక్కలు వేస్తూ కూర్చోవాల్సిన అవసరం లేదు. సింపుల్‌గా ఒక్కో కిటీకి ఇంత తీసుకుంటాను అని చెబితే సరిపోతుంది.
– హెచ్‌టీఎంఎల్ (HTML) ప్రాముఖ్యత గురించి సెర్గీ బ్రిన్కు, మీ అమ్మమ్మ లేదా నాన్నమ్మకు వివరించాల్సి వచ్చింది అనుకోండి? ఎలా చేస్తారు?
క్రియేటివ్ స్పెషలిస్ట్ ప్రొఫైల్ కోసం చేసిన గూగుల్ ఇంటర్వ్యూలో అడిగిన ప్రశ్న ఇది. ఇది మీ కమ్యూనికేషన్ స్కిల్స్‌ను పరీక్షించడానికి అడిగిన ప్రశ్న. ఓ క్లిష్టమైన సబ్జెక్ట్‌ను టెక్నికల్‌గా చెప్పగలగడంతోపాటు ఓ సగటు వ్యక్తికి అర్థమయ్యేలా సాధారణ భాషలోనూ మీరు చెప్పగలగాలి. సెర్గీ బ్రిన్ ఓ కంప్యూటర్ సైంటిస్ట్ కాబట్టి.. ఆయనకు మీరు టెక్నికల్ భాషలో వివరించగలుగుతారు. అదే సమయంలో మీ అమ్మమ్మ లేదా నాన్నమ్మకు టెక్నాలజీపై అవగాహన ఉండదు కాబట్టి.. దానిని ఓ సాధారణ భాషలో అర్థమయ్యేలా వివరించాలి.
– మీకు బిలియన్ డాలర్లు, ఓ స్పేస్‌క్రాఫ్ట్ ఇస్తే.. మనిషి ఎదుర్కొంటున్న అతిపెద్ద సవాలును ఎలా అధిగమిస్తావు?
డేటాబేస్ అడ్మినిస్ట్రేటర్ జాబ్ కోసం వచ్చిన అభ్యర్థిని అడిగిన ప్రశ్న ఇది. ప్రపంచంలో మనిషి ఎదుర్కొంటున్న అతి పెద్ద సవాళ్లను ఎదుర్కోవడానికి టెక్నాలజీని వాడాలన్న ఉద్దేశంతో గూగుల్ ఎక్స్ కొన్ని ప్రాజెక్టులను చేపడుతోంది. దీనికోసమే కొత్త కొత్త ఐడియాల కోసం వెతుకుతోంది. అందులో భాగంగానే కొన్ని ప్రత్యేకమైన ఉద్యోగాల కోసం వచ్చిన అభ్యర్థులను ఈ ప్రశ్న అడుగుతోంది. దీనికి మీ దగ్గర బెస్ట్ ఐడియా ఉంటే.. ఆ గూగుల్ ఎక్స్ ప్రాజెక్టుల్లో కీలకమైన జాబ్ పక్కా.
మీరు నేర్చుకోవడానికి ఎక్కువ ఆసక్తి చూపుతారా లేక సంపాదించడానికా?
ఇదొక సాధారణ ప్రశ్న. ఏ జాబ్ ప్రొఫైల్ వాళ్లనైనా ఈ ప్రశ్న అడగొచ్చు. పైకి సింపుల్‌గా కనిపించే క్లిష్టమైన ప్రశ్న ఇది. మీకు డబ్బు ముఖ్యమా లేక నైపుణ్యాన్ని ఎప్పటికప్పుడు పెంచుకోవడమా అని పరీక్షించడానికి గూగుల్ ఈ ప్రశ్న అడుగుతుంది. నిజానికి గూగుల్‌లాంటి సంస్థలో పని చేయాలంటే ఎప్పటికప్పుడు మీ స్కిల్స్‌ను డెవలప్ చేసుకోవడం చాలా చాలా అవసరం. అదే సమయంలో మీకు డబ్బు అవసరం లేదని కూడా కాదు కదా. నాకు మంచి ఆదాయాన్నిస్తూ.. ఎప్పటికప్పుడు కొత్త విషయాలు నేర్చుకునేందుకు వీలు కల్పించే ఉద్యోగం చేయాలని అనుకుంటున్నానులాంటి సమాధానాలు ఇంటర్వ్యూయర్‌ను సంతృప్తి పరుస్తాయి.
గడ్డివాములో గుండుసూది వెతకడానికి ఎన్ని దారులు ఉన్నాయి?
బిజినెస్ అసోసియేట్ ఉద్యోగం కోసం వచ్చిన అభ్యర్థిని గూగుల్ ఇంటర్వ్యూయర్ అడిగిన ప్రశ్న ఇది. మీరు ఎంత క్రియేటివ్‌గా, వినూత్నంగా ఆలోచించగలరు అని తెలుసుకోవడానికే అడిగే ప్రశ్న ఇది. మీ ఆలోచనకు తగినట్లు ఎన్నో సమాధానాలు ఉంటాయి. ఓ మెటల్ డిటెక్టర్‌ను వాడటం.. గుండుసూది కరిగిపోని టెంపరేచర్లో గడ్డివామును తగులబెట్టడంలాంటి ఆన్సర్లు కొంతమంది అభ్యర్థులు ఇచ్చారు.
మీ జీవితాంతం ఒక గదిలోకి వెళ్లినప్పుడల్లా ఒకే పాట వినే అవకాశం ఉందనుకోండి.. అది ఏ పాట?
అసోసియేట్ అకౌంట్ స్ట్రేటజిస్ట్ ప్రొఫైల్‌కు జరిగిన ఇంటర్వ్యూలో ఈ ప్రశ్న అడిగారు. దీని వెనుక ఉద్దేశం ఒకటే. మీరు తీసుకున్న నిర్ణయాలకు మీరు ఎంత మేర కట్టుబడి ఉంటారో తెలుసుకోవడం. పరిమితంగా ఉన్న అవకాశాలను వాడుకొని సమస్యను పరిష్కరించడంలో మీకున్న నైపుణ్యం అంచనా వేయడం.
– నలుగురు వ్యక్తులు రాత్రి వేళ ఓ కొండపై చిక్కుకుపోయారు. శిథిలావస్థలో ఉన్న ఓ బ్రిడ్జిను దాటి అవతలికి వెళ్లాలి. వాళ్ల దగ్గర ఓ టార్చ్‌లైట్ ఉంది. కానీ అందులో ఉన్న బ్యాటరీలు కేవలం 17 నిమిషాలు మాత్రమే పని చేస్తాయి. ఈ బ్రిడ్జిపై ఒకసారి ఇద్దరు మాత్రమే వెళ్లే వీలు ఉంటుంది. టార్చ్‌లైట్ లేకుండా వెళ్లడం అసాధ్యం. నలుగురు వ్యక్తుల్లో బ్రిడ్జిని దాటడానికి ఒక్కొక్కరు ఒక్కో సమయం తీసుకుంటారు. తొలి వ్యక్తి ఒక నిమిషం, రెండో వ్యక్తి రెండు నిమిషాలు, మూడో వ్యక్తి ఐదు నిమిషాలు, నాలుగో వ్యక్తి పది నిమిషాలు తీసుకుంటారు. మరి టార్చ్‌లైట్‌లో ఉన్న బ్యాటరీలు డెడ్ కాకముందే వాళ్లంతా ఎలా బ్రిడ్జిని దాటగలరో వివరించండి?
సమస్య పరిష్కారంలో అభ్యర్థికి ఉన్న క్రియేటివిటీని తెలుసుకోవడానికి గూగుల్ ఇంటర్వ్యూలో అడిగిన ప్రశ్న ఇది. దీనికి సమాధానం ఇది.. ముందు మొదటి ఇద్దరు వ్యక్తులు బ్రిడ్జిని దాటాలి. దానికి రెండు నిమిషాల టైమ్ పడుతుంది. ఆ తర్వాత తొలి వ్యక్తి టార్చ్‌లైట్ తీసుకొని మళ్లీ వెనక్కి వెళ్తాడు. దీనికి ఒక నిమిషం పడుతుంది. అంటే మూడు నిమిషాలు అయింది.
ఆ తర్వాత అక్కడున్న మూడు, నాలుగో వ్యక్తులు బ్రిడ్జిని దాటాలి. దీనికి గరిష్ఠంగా పది నిమిషాలు పడుతుంది. మొత్తం 13 నిమిషాలు అయింది. అప్పుడు ఇవతలివైపున్న రెండో వ్యక్తి టార్చ్‌లైట్ తీసుకొని మళ్లీ అవతలికి వెళ్తాడు. అతనికి రెండు నిమిషాల సమయం పడుతుంది కదా అప్పుడు మొత్తం 15 నిమిషాలు అయింది. ఆ ఇద్దరూ కలిసి రెండు నిమిషాల్లో మళ్లీ ఇవతలికి వచ్చేస్తారు. ఆ లెక్కన 17 నిమిషాల్లో అందరూ సేఫ్‌గా బయటపడతారు.
ఇంజినీరింగ్ మేనేజర్ జాబ్ కోసం..
– మీరో పైరేట్ షిప్‌కు కెప్టెన్ అనుకోండి. అప్పుడే మరో షిప్‌లోని వస్తువులను దొంగతనం చేశారు. కెప్టెన్‌గా వాటిని ఎలా పంచుకోవాలో మీరే డిసైడ్ చేయాలి. అయితే మీ నిర్ణయాన్ని సగం కంటే ఎక్కువ మంది ఆమోదించాలి. లేదంటే మిమ్మల్ని చంపేస్తారు. ఇలాంటి పరిస్థితుల్లో మీ ప్రాణాలకు ఎలాంటి ముప్పు వాటిల్లకూడదు. అయినా ఆ సొమ్ములో చెప్పుకోదగిన వాటా మీకు రావాలి అంటే ఏం చేస్తారు?
ఇంజినీరింగ్ మేనేజర్ జాబ్ కోసం వచ్చిన అభ్యర్థిని అడిగిన ప్రశ్న ఇది. కంప్యూటింగ్‌లో వచ్చే సమస్యలకు అందరికీ ఆమోదయోగ్యమైన పరిష్కారం కనుగొనడంలో అభ్యర్థికి ఉన్న సామర్థ్యాన్ని పరీక్షించడానికి ఈ ప్రశ్న అడుగుతారు. ఈ ప్రశ్నకు సమాధానం చాలా సింపుల్. షిప్లో ఉన్న టీమ్‌లో 51 శాతం మందికి దోచుకున్న సొమ్మును సమంగా పంచడం. ఆ లెక్కన సగం కంటే ఎక్కువ మంది మీ నిర్ణయానికి ఆమోదం తెలుపుతారు. పైగా వాళ్లందరికీ మంచి వాటా వస్తుంది.
– మిమ్మల్ని ఓ చిన్న ఇనుప వస్తువుగా మార్చేసి బ్లెండర్లో వేసేస్తాం. ఆ బ్లెండర్లోని బ్లేడ్లు 60 సెకన్లలో తిరగడం ప్రారంభిస్తాయి. అప్పుడు తప్పించుకోవడానికి మీరేం చేస్తారు?
ఇది కూడా మీ క్రియేటివిటీని పరీక్షించడం కోసం వేసే ప్రశ్నే అని గుర్తుంచుకోవాలి. దీనికి కచ్చితమైన సమాధానం ఏదీ ఉండదు. ఇంతకుముందే చెప్పినట్లు మీ క్రియేటివిటీని బట్టి ఎన్ని మార్గాల్లో అయినా బయటపడొచ్చు. ఆ బ్లెండర్ మోటార్‌ను పని చేయకుండా చేయడంలాంటి సమాధానాలు కొందరు అభ్యర్థులు ఇచ్చారు.
ప్రశ్న సింపుల్ గానే..
– ఓ గోడ గడియారంలో సమయం 3:15 అయింది. అప్పుడు గంటల ముల్లు, నిమిషాల ముల్లు ఎన్ని డిగ్రీల కోణంలో ఉంటాయి?
గూగుల్ ఇంటర్వ్యూలో ఇంత సింపుల్ ప్రశ్నలు అడుగుతారా అని కొందరికి అనిపించవచ్చు. కానీ ఈ ప్రశ్నలో చాలా మతలబే ఉంది. అవతలి వ్యక్తి చెబుతున్న అంశాన్ని మీరు ఎంత క్షుణ్నంగా అర్థం చేసుకుంటున్నారో తెలుసుకోడానికి అడిగే ప్రశ్న ఇది. దీనికి ఆన్సర్ జీరో అని అనుకుంటే మీరు పప్పులో కాలేసినట్లే. 3:15ను గోడ గడియారంలో సూచించేది 3 అంకెనే కాబట్టి.. రెండు ముళ్లూ దానిపైనే ఉంటాయి కదా అనుకోవచ్చు.
కానీ నిమిషాలు గడుస్తున్న కొద్దీ గంటల ముల్లు మెల్లగా తర్వాతి అంకె వైపు వెళ్తుందన్నది గుర్తుంచుకోవాలి. గంటలో మొత్తం 60 నిమిషాలు. ఓవరాల్‌గా 360 డిగ్రీలు అనుకుంటే.. ఒక్కో నిమిషం ఆరు డిగ్రీలు ఉంటుంది. అంటే 3, 4 మధ్య 30 డిగ్రీల కోణం ఉంటుంది. ఇప్పుడు నిమిషాల ముల్లు 3 అంకెపైకి చేరుకునే సమయానికి గంటల ముల్లు ఓ 25 శాతం 4 అంకె వైపుగా ఉంటుంది. ఆ లెక్కన 30 డిగ్రీల కోణంలో నాలుగో వంతు అంటే 7.4 డిగ్రీలు. అంటే గోడ గడియారంలో సమయం 3:15 అయితే నిమిషాలు, గంటల ముళ్ల మధ్య 7.4 డిగ్రీల కోణం ఉంటుంది.
– ఇవాళ రాత్రికి డిన్నర్లో ఏం తిందాం?
మీరు నమ్మినా నమ్మకపోయినా.. ఇది గూగుల్ ఇంటర్వ్యూలో అడిగిన ప్రశ్నే. మీలో ఓ లీడర్ లక్షణాలు ఉన్నాయా లేదా తెలుసుకోవడమే దీని ఉద్దేశం. ఓ లీడర్‌కు తాను తీసుకునే నిర్ణయాలపై స్పష్టత ఉండాలి. ఓ నిర్ణయం తీసుకోవాలి.. దానిని టీమ్‌లోని అందరూ పాటించేలా చేయాలి. అందువల్ల మీకు ఏది ఇష్టమైతే అది తిందాంలాంటి సమాధానాలు ఇక్కడ పనికి రావు. కచ్చితంగా ఇది తిందామని చెప్పాలి.
– మీ ఐక్యూ లెవల్ 130 కంటే ఎక్కువగా ఉందా?
ఇది కూడా సింపుల్‌గా కనిపించే ఓ క్లిష్టమైన ప్రశ్న అని గుర్తుంచుకోండి. మిమ్మల్ని మీరు ఎలా భావిస్తున్నారు అని తెలుసుకోవడానికి అడిగే ప్రశ్న ఇది. నిజంగా మీ ఐక్యూ లెవల్ 130కిపైనే ఉన్నా ఈ ప్రశ్నకు నేరుగా అవును అన్న సమాధానం చెప్పకూడదు. ఎందుకంటే ఐక్యూ టెస్టుల్లో పాల్గొని తమ ఫలితాలను గుర్తుంచుకునే వాళ్లు అభద్రతాభావంతో ఉంటారని, తమను తాము ఎక్కువగా ఊహించుకుంటారన్న అభిప్రాయం ఉంది.
– ఆరు గ్లాసులను ఒక వరుసలో ఉంచారు. అందులో మొదటి మూడు గ్లాసులు ఖాళీగా ఉన్నాయి. తర్వాత మూడు గ్లాసుల్లో జ్యూస్ ఉంది. ఒక ఖాళీ గ్లాస్ తర్వాత మరో ఫుల్ గ్లాస్ వచ్చేలా అమర్చాలి. కానీ ఒక్క గ్లాస్ మాత్రమే కదిలించే అవకాశం ఉంటుంది. మీరేం చేస్తారు?
ఇది కూడా మీ క్రియేటివిటీని పరీక్షించడానికి అడిగే ప్రశ్న. ఈ ప్రశ్న అడగ్గానే ఏవేవో ఆలోచనలు వచ్చేస్తుంటాయి. నిజానికి కాస్త క్రియేటివ్‌గా ఆలోచిస్తే ఇది చాలా చాలా సింపుల్. ఐదో గ్లాస్‌లోని జ్యూస్‌ను రెండో గ్లాస్లో పోస్తే సరిపోతుంది.
– యూట్యూబ్‌లో యాడ్స్‌ను తీసేయాల్సిన పరిస్థితి వచ్చింది అనుకోండి.. దాన్నుంచి మీరు ఎలా ఆదాయం పొందుతారు?
యూట్యూబ్‌లాంటి డిజిటల్ ప్లాట్‌ఫామ్‌పై ఎన్ని రకాలుగా డబ్బు సంపాదించవచ్చో సదరు అభ్యర్థికి తెలుసా లేదా అన్నది పరీక్షించడానికి ఇలాంటి ప్రశ్న వేశారు. దీనిపై మీకున్న ఐడియాలను చెప్పేయడమే. కొంత మొత్తానికి ప్రీమియం మెంబర్షిప్ ఇవ్వడం, లేదంటే యూట్యూబ్‌లో కంటెంట్‌ను అప్లోడ్ చేసే వాళ్ల నుంచి డబ్బు వసూలు చేయడంలాంటివి చెప్పొచ్చు.
– మీకు కచ్చితంగా ఉద్యోగం చేయాల్సిన అవసరం లేదు అనుకోండి.. మరి మీరు ఏం చేస్తారు?
గూగుల్ ఇంటర్వ్యూలోనే అడిగిన మరో వింత ప్రశ్న ఇది. సాధారణంగా ఎవరైనా డబ్బు సంపాదించడానికే ఉద్యోగం చేస్తారు. ఆ అవసరం మనకు లేదు అంటే మనమేం చేస్తాం.. మనకు నచ్చిన పని చేసుకుంటూ వెళ్తాం. సాధారణంగా మీ అభిరుచుల గురించి తెలుసుకోవడానికి ఇంటర్వ్యూయర్ ఇలాంటి ప్రశ్నలు వేస్తుంటారు.
– గూగుల్ నుంచి వచ్చిన వాటిలో మీకు నచ్చింది ఏంటి? దానిని మీరు మరింత మెరుగ్గా ఎలా మార్చగలరు?
గూగుల్‌లాంటి ప్రతిష్ఠాత్మక సంస్థలు తమ దగ్గర పని చేసే ఉద్యోగులకు తమ ఉత్పత్తులపై పూర్తి అవగాహన ఉండాలని అనుకుంటాయి. అందులో భాగంగానే ఈ ప్రశ్న అడిగారు. గూగుల్ ఇంటర్వ్యూకి వెళ్తున్నారంటే సంస్థకు సంబంధించిన అన్ని అంశాలను పూర్తిగా తెలుసుకొని వెళ్లాల్సిన అవసరాన్ని ఈ ప్రశ్న వెనుక ఉన్న ఉద్దేశంగా చెప్పొచ్చు.
– ఒక రోజులో గడియారంలోని నిమిషాల ముల్లు, గంటల ముల్లు ఎన్నిసార్లు కలుస్తాయి?
గూగుల్ ఇంటర్వ్యూకి వెళ్లే వారిని ఆశ్చర్యపరిచే వింత ప్రశ్న ఇది. మీరు ఊహించని ఈ ప్రశ్న వేసి.. మీరు ఒత్తిడిలో ఎలా స్పందిస్తారు అన్నది తెలుసుకోవడమే వాళ్ల ఉద్దేశం. రోజులో 22 సార్లు నిమిషాల ముల్లు, గంటల ముల్లు కలుస్తాయి.
అర్ధరాత్రి 12:00 నుంచి మొదలుకొని 1:05, 2:11, 3:16, 4:22, 5:27, 6:33, 7:38, 8:44, 9:49, 10:55లకు నిమిషాలు, గంటల ముళ్లు కలుస్తాయి.
సేమ్ మధ్యాహ్నం కూడా ఇవే సమయాల్లో మరోసారి రెండు ముళ్లు ఒకదానిపై ఒకటి ఉన్నట్లుగా కనిపిస్తాయి.
ఇవి కూడా చదవండి