nainital tour: నైనిటాల్‌ టూర్ .. ఆహ్లాదం.. ఆధ్యాత్మికం

nainital tour
Nainital lake view

nainital tour: నైనిటాల్‌ టూర్ .. మంచు కురిసే వేళలో మల్లె విరిసేదెందుకో అని పాడుకోగలిగే మూడ్‌ ఉంటే ఈ టూరిస్ట్‌ ప్లేస్‌ మీకోసమే. ఢిల్లీ నుంచి 300 కి.మీ. దూరంలో ఉండే నైనితాల్‌ ప్రకృతి పర్యాటకుల్లో నూతనోత్సాహాన్ని నింపుతుంది. మంచుతో మైమరిపిస్తుంది.

ప్రకృతితో తన్మయులను చేస్తుంది. ఆధ్మాత్మికతలో లీనం చేస్తుంది. జీవితంలో కొత్త జోష్‌ నింపుకోవాలనుకుంటే నైనితాల్‌ వెళ్లి తీరాల్సిందే. నైనిటాల్ టూరిస్ట్ ప్లేసెస్ పై డియర్ అర్బన్ డాట్ కామ్ అందిస్తున్న ప్రత్యేక కథనమిది..

సిటీ ఆఫ్‌ లేక్స్‌గా ప్రాచుర్యం పొందిన ప్రాంతం నైనిటాల్. సముద్ర మట్టానికి 2,084 మీటర్ల ఎత్తులో ఉంటుంది. ఈ నగరంలో సరస్సులు, లోయలు, పర్వతాలు టూరిస్టులను ఆకట్టుకుంటాయి. మంచు దుప్పట్లు కప్పుకున్న పర్వతాలు, నగరం మధ్య మంచినీటి సరస్సు, సరస్సు చుట్టూ పర్యాటకుల కోసం విడిది కేంద్రాలు.. ఈ నగరం టూరిస్టుల కోసమే సృష్టించిందా అన్నట్టుగా ఉందనడంలో అతిశయోక్తి లేదు.

Nainital Night view
By Vaibhav321369 – Own work, CC BY-SA 4.0, https://commons.wikimedia.org/w/index.php?curid=93336059

తాల్‌ అంటే సరస్సు. సరస్సు ఒడ్డునే నైనాదేవి శక్తిపీఠం ఉటుంది. నైనాదేవీ పేరుతోనే ఈ నగరాన్ని నైనిటాల్‌గా పిలుస్తారు. ఈ శక్తి పీఠాన్ని దర్శించుకునేందుకు నిత్యం వేలాది మంది భక్తులు వస్తారు. నైనితాల్‌ సరస్సులో బోటు విహారం సరికొత్త శక్తినిస్తుంది.

ఉత్తర్‌ ప్రదేశ్‌లో ఉన్న ఈ నగరం ఆ రాష్ట్ర విభజన అనంతరం ఉత్తరాఖండ్‌ పరిధిలోకి వచ్చింది. ఉత్తరాఖండ్‌ ఎగ్జిక్యూటివ్‌ క్యాపిటల్‌ డెహ్రాడూన్‌ కాగా జ్యుడిషియల్‌ రాజధాని నైనిటాల్‌.

నైనిటాల్‌ టూరిస్ట్‌ ప్లేసెస్‌ (nainital tourist places) ఇవీ..

నైనితాల్‌ సమీపంలోని ప్రాంతాలన్నింటినీ తాల్‌ పేరుతో పిలుస్తారు. నైనితాల్ టూర్ లో చూడాల్సిన ప్రదేశాలు బీమతాల్, నౌకుచియాతాల్, నైనా పర్వతం, నైనా దేవి ఆలయం, గవర్నర్‌ హౌస్, ఎత్తైన పర్వత ప్రాంతం కిల్‌బరీ, టిఫిన్‌ టాప్‌ లేదా డొరోతి సీట్, హనుమాన్‌ ఘరీ, అరబిందో ఆశ్రమం, పాన్గోట్, బారా బజార్, స్నో వ్యూ, కేవ్‌ గార్డెన్, సాత్‌ తాల్, హనుమాన్‌గర్హీ, మాల్‌ రోడ్, జీబీ పంత్‌ జూ, టిబెటిన్‌ మార్కెట్, హిమాలయ దర్శన్‌ వంటివి ఉన్నాయి.

నైనిటాల్‌ను ఎలా చేరుకోవాలి?

nainital lake
lensnmatter, CC BY 2.0 <https://creativecommons.org/licenses/by/2.0>, via Wikimedia Commons

నైనిటాల్ టూర్ ఎలా వెళ్లాలో ఇప్పుడు చూద్దాం. విమానమార్గమైతే నైనితాల్‌కు సమీపంలో పంత్‌నగర్‌ విమానాశ్రయం ఉంది. ఢిల్లీ నుంచి పంత్‌నగర్‌కు కేవలం గంట ప్రయాణం. మేక్‌ మై ట్రిప్, క్లియర్‌ ట్రిప్‌ వంటి వెబ్‌సైట్లలో విమాన టికెట్‌ కొనుగోలు చేయవచ్చు. పంత్ నగర్‌లో విమానం దిగి సుమారు 75 కి..మీ. రోడ్డు మార్గంలో ప్రయాణిస్తే నైనితాల్‌కు చేరుకోవచ్చు.

బస్సు మార్గం సులువు

దేశ రాజధాని ఢిల్లీ నుంచి నిత్యం నైనిటాల్‌కు బస్సు సేవలు అందుబాటులో ఉంటాయి. రెడ్‌బస్‌ ద్వారా ఆన్‌లైన్‌లో టికెట్లు పొందవచ్చు. ఒక్కరికి రూ. 500 నుంచి రూ. 900 మధ్య టికెట్‌ ఉంటుంది. ఢిల్లీ నుంచి సుమారు 8 గంటల్లో నైనితాల్‌ చేరుకోవచ్చు. రాత్రి 10 గంటల సమయంలో బస్సెక్కితే ఉదయం 6 గంటలకల్లా చేరుకోవచ్చు. ఉత్తరాఖండ్‌ పర్యాటక శాఖ కూడా వివిధ ప్యాకేజీలు అందిస్తోంది.

రైలు మార్గంలో ఇలా చేరుకోవచ్చు..

రైలు మార్గంలో చేరుకోవాలంటే నైనిటాల్‌కు నేరుగా రైలు లేదు. కానీ సమీపంలోని కాఠ్ గోదామ్‌ స్టేషన్‌ వరకు రైలులో వెళ్లవచ్చు. అక్కడి నుంచి నైనితాల్‌ 17 కి.మీ. దూరంలో ఉంటుంది. ఢిల్లీ నుంచి కాఠ్ గోదామ్‌ మూడు రైళ్లు అందుబాటులో ఉన్నాయి.

శతాబ్ది ఎక్స్ ప్రెస్ ఉదయం 6.20కి న్యూఢిల్లీ రైల్వే స్టేషన్‌లో బయలుదేరి  ఉదయం 11.40కి కాఠ్ గోదామ్‌ చేరుకుంటుంది. కేవలం 5 గంటల 20 నిమిషాల్లో చేరుకుంటుంది. అయితే ఇందులో ఛైర్‌ కార్‌ (ఏసీ) రూ. 805 కాగా ఎగ్జిక్యూటివ్‌ ఛైర్‌ కార్‌ టికెట్‌ రూ. 1250గా ఉంది.

అయితే ఉత్తరాఖండ్‌ సంపర్క్‌క్రాంతి ఎక్స్‌ప్రెస్‌లో మాత్రం సెకండ్‌ సిట్టింగ్‌ (2ఎస్‌) ధర కేవలం రూ. 120 మాత్రమే. ఏసీ ఛైర్‌ కార్‌ రూ. 425గా ఉంటుంది. ఇక ఈ ట్రైన్‌ సాయంత్రం ఢిల్లీ స్టేషన్‌(న్యూఢిల్లీ కాదు) నుంచి బయలుదేరి రాత్రి 10.45కి కాఠ్ గోదామ్‌ చేరుకుంటుంది. సుమారు 7 గంటల్లో గమ్యస్థానం చేరుకుంటుంది.

ఢిలీ కంటోన్మెంట్‌ నుంచి కాఠ్ గోదామ్‌ వెళ్లేందుకు రాణికేత్‌ ఎక్స్‌ప్రెస్‌ ఉంది. దీనిలో సెకెండ్‌ సిట్టింగ్‌ అయితే కేవలం రూ. 125. స్లీపర్‌ క్లాస్‌ అయితే రూ. 205. థర్డ్‌ ఏసీ రూ. 505గా ఉంది. సెకండ్‌ ఏసీ రూ. 710, ఫస్ట్‌ ఏసీ రూ. 1175గా ఉంది.

కాఠ్ గోదామ్‌ నుంచి బస్సుల్లో గానీ, టాక్సీల్లో గానీ ప్రయాణించి నైనిటాల్‌ చేరుకోవచ్చు. అల్మోర, రానిఖేట్, బద్రినాథ్‌ల నుంచి నైనిటాల్‌కు బస్సులు ఉన్నాయి. నైనితాల్‌ సమీపంలో మూడు కిలోమీటర్ల దూరంలో ఉండే స్నో వ్యూపాయింట్‌కు రోడ్‌ మార్గం, ట్రెక్‌ , పోనీ లేదా రోప్‌ వే ద్వారా చేరుకోవచ్చు.

కేబుల్‌ కార్‌.. మధురానుభూతి

ఏరియల్‌ కేబుల్‌ కార్‌ మాల్‌ రహదారి నుంచి స్నో వ్యూ పాయింట్‌కు చేరుస్తుంది. కేబుల్‌ కార్‌ నుంచి నైనితాల్‌ అందాలు చూడొచ్చు. దేశంలోనే ప్రథమ కేబుల్‌ కార్‌గా చెబుతారు. 300 మీటర్ల ఎత్తులో సుమారు 705 మీటర్ల దూరం కేబుల్‌ కార్‌లో ప్రయాణించవచచు. ఒక్కో కేబుల్‌ కార్‌లో 12 మంది వ్యక్తులు వెళ్లొచ్చు. గరిష్టంగా 825 కేజీల బరువు మోస్తుంది.

స్నో వ్యూ పాయింట్‌… బర్ఫ్‌ ఆట

నైనితాల్‌కు వచ్చే టూరిస్టులంతా బర్ఫ్‌ (మంచు)తో ఆడేందుకు వస్తుంటారు. ఇదే పర్యాటకులను అలరిస్తుంది. మంచు కొండల అందాలను స్నో వ్యూ పాయింట్‌ నుంచి చూడాల్సి ఉంటుంది. నైనితాల్‌ నుంచి సుమారు మూడు కిలోమీటర్ల దూరంలో స్నోవ్యూ పాయింట్‌ ఉంది. రోప్‌ వే కేబుల్‌ కార్‌ ద్వారా గానీ, టాక్సీల్లో గానీ, నడక ద్వారా గానీ దీనిని చేరుకోవచ్చు.

నైనిటాల్‌ టూర్ లో ఇలా ప్లాన్ (nainital tour plan) చేయండి

స్నో వ్యూ పాయింట్‌ సందర్శన అనంతరం సాత్‌ తాల్‌ గా పేరొందిన ఏడు సరస్సుల సమూహాన్ని సందర్శించండి. పన్నా తాల్‌ (గరుడ తాల్‌), నల దమయంతి తాల్, పూర్ణ తాల్, సీతా తాల్, రామ్‌ తాల్, లక్ష్మణ్‌ తాల్, సుఖ తాల్‌.. ఈ ఏడింటిని సాత్‌ తాల్‌గా పిలుస్తారు.

ఇక్కడ విభిన్న రకాల పక్షులను చూడొచ్చు. తదుపరి భీమ్‌ తాల్, నౌకుచియాతాల్‌ సందర్శించండి. అనంతరం నైని తాల్‌కు చేరుకోండి. ఇక్కడ బోటింగ్‌ బాగుంటుంది. బోటింగ్‌ అనంతరం నైనా దేవి ఆలయాన్ని సందర్శించవచ్చు.

nainital tourist places
nainital city

వర్షపాతం అధికమే..

కాలమేదైనా వర్షం ఇక్కడ నిత్యకృత్యమే. వర్షంతో పాటు మంచు కురుస్తుంది. రద్దీ ఎక్కువగా ఉంటున్నందున హోటల్‌ ముందే బుక్‌ చేసుకోవడం మేలు.

మాల్‌ రోడ్డులో రద్దీ ఎక్కువగా ఉంటుంది. ఊరిలోకి ప్రవేశించడానికే మూడు నాలుగు గంటలు పడుతుంది.

నైనిటాల్‌ టూర్ ఎప్పుడు బెటర్?

నైనితాల్‌ను ఎప్పుడైనా సందర్శించవచ్చు. అయితే మంచు కురిసే సమయంలో ఎంజాయ్‌ చేయాలనుకుంటే మాత్రం నవంబరు నుంచి ఫిబ్రవరి వరకు బాగుంటుంది. ఇంకెందుకు ఆలస్యం.. నైనిటాల్ టూర్ ప్లాన్ చేయండి. హాపీ జర్నీ.

ఇవి కూడా చదవండి

  1. కులు మనాలి టూర్ ఎలా ప్లాన్ చేయాలి
  2. సిమ్లాలో ఇలా విహరించండి
  3. గోవా టూర్ ఇలా ప్లాన్ చేయండి
Previous articleహెల్త్‌ చెక్‌ అప్‌ .. మహిళలకు ఏ ఆరోగ్య పరీక్షలు తప్పనిసరి
Next articleఓ పిట్టకథ .. ఇట్స్‌ ఏ లాంగ్‌ స్టోరీ