ఈమధ్యనే ‘ఫోరెన్సిక్’ అనే తెలుగు సినిమా టీవీలో వచ్చింది. ఆ సినిమాను తెలుగు రాష్ట్రాల్లో చాలా మంది చూసే ఉంటారు. అందులో చిన్న పిల్లల్ని ఎవరో కిడ్నాప్ చేసి చంపేస్తుంటారు. ఆ సినిమాలో ఓ కేస్ స్టడీగా బీహార్ కు చెందిన ఓ పిల్లాడి గురించి చెప్పారు.
అదేదో సినిమా కోసం రాసుకున్న పాత్ర కాదు. ఆ పిల్లాడు ఉండడం నిజం, అతడు చేసిన హత్యలూ నిజం. అందుకే ఇక్కడ మనం చెప్పుకునేది ఆ సినిమా గురించి కాదు. ఆ కేస్ స్టడీగా చెప్పిన పిల్లాడి గురించి. అతడు మన దేశంలోనే అతి చిన్న వయసు సీరియల్ కిల్లర్. చూడటానికి బక్కగా, అమాయకంగా, పోషకాహారలోపం ఉన్నట్టు కనిపిస్తున్నా… వాడు మామూలోడు కాదు.
ఆ వయసు పిల్లలకు తమను ఎవరైనా కొడితే ఎదిరించడమే రాదు, ఏడ్వడం తప్ప. అలాంటిది చంపేంత కోసం కసి ఎందుకుంటాయి? ఇది సబబైన ప్రశ్నే. కానీ ఇక్కడ మనం అందరిలాంటి సాధారణ పిల్లాడి గురించి చెప్పుకోవడం లేదు. ఒక అసాధారణమైన వ్యక్తి గురించి మాట్లాడుకుంటున్నాం.
ముక్కు పచ్చలారక ముందే హంతకుడిగా మారిన వీడి పేరు అమర్జీత్ సదా. అతడికి బాధ అంటే తెలియదు. ఎదుటివారిని పాశవికంగా చంపుతుంటే కలిగే ఆనందం మాత్రమే అనుభవించగలడు. స్పైడర్ సినిమాలో విలన్ తెలుసుగా? అలాంటి క్యారెక్టర్ ఈ పిల్లాడిది.
అమర్జీత్ సదా ఏం చేశాడు?
అమర్జీత్ సదా బీహార్లో చాలా పేద కుటుంబంలో 1998లో పుట్టాడు. ఒకపూట తింటే రెండో పూట పస్తులుండే జీవితం. తల్లీతండ్రీ ఇద్దరూ కూలి పనికి వెళ్లేవారు. ఆరోజు పనికి వెళితేనే రోజు గడిచే జీవితం వారిది. అమర్జీత్‌కు ఆరేళ్ల వయసు ఉండగా ఆ తల్లిదండ్రులకు ఒక అమ్మాయి పుట్టింది. అమర్జీత్ ఎప్పుడూ ఒంటరిగానే ఆడుకునే వాడు. ఎవరితో స్నేహం చేసేవాడు కాదు.
2006లో అమర్జీత్ పిన్ని (తల్లి చెల్లెలు) తన ఆరు నెలల పాపతో ఇంటికి వచ్చింది. ఆ పాపని అక్కకి అప్పగించి పనికి వెళ్లింది. ఆ తల్లి తన బిడ్డ, చెల్లి బిడ్డ బాధ్యతను అమర్జీత్ కు అప్పగించి మార్కెట్ కు వెళ్లింది. ఇంట్లో ఎవరూ లేని సమయంలో ఆ పిల్లాడి చూపు ఆరునెలల పసిపాపపై పడింది.
నవ్వుతూ దగ్గరకు వెళ్లాడు. చెంపలు వాయించాడు, గిచ్చాడు. చివరికి మెడ నొక్కి చంపేశాడు. అమ్మ వచ్చేలోపు పక్కనున్న అడవికి వెళ్లి ఇటుకతో తలపై మోదాడు. చివరికి గొయ్యితీసి పాతి పెట్టి ఇంటికి వచ్చేశాడు. తల్లి వచ్చాక జరిగిందంతా చెప్పాడు. ఆ క్షణమే తన జంతువులాంటి కొడుకుని పోలీసులకు పట్టిస్తే మరో రెండు నిండు ప్రాణాలు దక్కేవి.
కానీ ఆ తల్లి అలా చేయలేదు. కొడుకుపై ఉన్న గుడ్డి ప్రేమ తప్పును ఒప్పుకోనివ్వలేదు. చెల్లికేవో అబద్ధాలు చెప్పి తప్పించుకుంది. రెండు నెలలు గడిచింది. ఈసారి బలైంది సొంత చెల్లే. ఎనిమిది నెలల పసిదాన్ని చంపేశాడు. ఆ విషయమూ తల్లిదండ్రులకు తెలిసింది.
మొదటి చేసిన తప్పునే తిరిగి చేశారు. కొడుకునే కాపాడుకుందామని చూశారు కానీ, అతడి చేతిలో బలైపోతున్న చిన్నారుల గురించి ఆలోచించలేదు. రోజులు గడిచాయి.
మూడో ప్రాణం బలి
ఆ ఊళ్లో నివసించే ఓ తల్లి తన ఆరు నెలల పసిపాపని ఉయ్యాలలో పడుకోబెట్టి, ఎదురుగా ఉన్న ఓ పాఠశాలలో పనిచేయడానికి వెళ్లింది. కాసేపయ్యక బిడ్డ గట్టిగా ఏడ్చింది. అటుగా వెళ్తున్న అమర్జీత్ పాప ఒంటరిగా ఉండడం చూసి ఎత్తుకుపోయాడు.
తన చెల్లెళ్లలాగే ఆ పసిదాన్ని చిదిమేశాడు. ఈసారి గ్రామమంతా ఉలిక్కిపడింది. ఓ వ్యక్తి తాను అమర్జీత్ పాపని ఎత్తుకుని వెళ్లడం చూశానని చెప్పాడు. అందరూ ఆ పిల్లాడిని అడిగారు. ‘నేనే చంపా’ అని ధైర్యంగా చెప్పాడు. పోలీసులు వచ్చి పిల్లాడిని అదుపులోకి తీసుకున్నారు.
స్టేషన్లో ఎస్ఐ ఎదురుగా బల్లమీద కూర్చున్నాడు అమర్జీత్. ‘ఆకలేస్తోంది బిస్కెట్లు ఉంటే ఇస్తారా’ అని అడిగాడు. ఆ ఎస్ఐ కి అమర్జీత్ ముఖం పగలగొట్టాలన్నంత కోపం వచ్చింది. అయినా తమాయించుకున్నాడు.
‘ఎందుకు చంపావ్ పిల్లల్ని’ అని పోలీసులు అడిగితే ‘ఊరకే’ అని చెప్పాడు. కనీసం బాధ, పశ్చాత్తాపం, తప్పు చేశానన్న భావన ఆ పిల్లాడి ముఖంలో లేదు. పోలీసులకు సైకో లక్షణాలు కనిపించడంతో వైద్యుల దగ్గరికి తీసుకెళ్లారు.
అమర్జీత్ ఇప్పుడు ఎక్కడున్నాడు?
మానసిక వైద్యులు పిల్లాడిని పర్యవేక్షించి ‘కండక్ట్ డిజార్డర్’ అనే వ్యాధితో బాధపడుతున్నాడని తేల్చారు. ‘కేవలం ఆనందం కోసమే వారు పక్కవారిని చంపుతారు. ఏడేళ్ల వయసులో పెద్దవారిని చంపడం కష్టం. ఎందుకంటే వాళ్లు ప్రతిఘటిస్తారు. అదే నెలల పిల్లలు ప్రతిఘటించలేరు. అందుకే అమర్జీత్ బాధితులంతా పసిపిల్లలే’ అని చెప్పారు వైద్యులు.
ఈ మానసిక వ్యాధికి చికిత్స కూడా లేదని, కౌన్సిలింగ్ ద్వారానే మార్పు తీసుకురావాలని చెప్పారు. చాలా రోజులు కౌన్సిలింగ్ ఇచ్చారు. అమర్జీత్ పద్దెనిమిదేళ్ల వయసు వచ్చేవరకు జువైనల్ హోంలోనే ఉన్నాడు. ఆ తరువాత జైలు నుంచి విడుదలయ్యాడు. ప్రస్తుతం పేరు మార్చుకుని జీవిస్తున్నట్టు సమాచారం.
ఇండియాలోనే యంగెస్ట్ సీరియల్ కిల్లర్‌గా పేరుగాంచిన అమర్‌జీత్ సదా ఇప్పుడు ఎక్కడ ఉన్నాడో పోలీసులకు మాత్రమే తెలుసు. వారు ఆ విషయాన్ని బయటికి చెప్పరు. ఎక్కడున్నా.. ఎవరికీ హాని కలిగించకుండా జీవిస్తున్నాడని ఆశిద్దాం.
అమర్జీత్ సదా జీవితం చదివాక తల్లిదండ్రులు తమ పిల్లల చదువు పైనే కాదు వారి ప్రవర్తన పైన కూడా చాలా శ్రద్ధ పెట్టాలని అర్థమవుతుంది.