Bhimashankar jyotirlinga: భీమశంకర్ జ్యోతిర్లింగం భారతదేశంలోని ద్వాదశ జ్యోతిర్లింగాలలో ఒకటి. ఈ భీమశంకర్ టెంపుల్ సహ్యాద్రి పర్వతశ్రేణుల్లో పచ్చటి ప్రకృతి
భీమశంకర్ టెంపుల్ Bhimashankar Temple ఎలా చేరుకోవాలి?
మహారాష్ట్రలోని (bhimashankar jyotirlinga maharashtra) పుణెకు 127 కి.మీ దూరంలోని ఖేడ్ మండలంలో ఉంది. ముంబై నుంచి 200 కి.మీ దూరం వస్తుంది. పూణె చేరుకుంటే అక్కడి నుంచి ప్రయివేటు టాక్సీలో గానీ, మహారాష్ట్ర ఆర్టీసీ బస్సులో గానీ వెళ్లొచ్చు. పూణె నుంచి ప్రతి అరగంటకో ఆర్టీసీ బస్సు భీమశంకర్ దేవాలయానికి వెళుతుంది. అక్కడ భీమశంకర్ జ్యోతిర్లింగం దర్శించుకోవచ్చు.
రోడ్డు మార్గం
హైదరాబాద్ నుంచి పూణె వరకు కారులో వెళ్లాలనుకునే వారు దాదాపు 14 గంటలు ప్రయాణించాల్సి ఉంటుంది. హైదరాబాద్ నుంచి జహీరాబాద్, షోలాపూర్, ఇందాపూర్ మీదుగా పూణె చేరుకోవాలి. పూణె నుంచి భీమశంకర్ (pune to bhimashankar jyotirlinga distance) 127 కిలోమీటర్లు ఉంటుంది. భీమశంకర్ జ్యోతిర్లింగం కొండ మీద ఉంటుంది. కొండను చేరుకునేందుకు రోడ్డుమార్గం ఉంది.
బస్సులో వెళ్లాలనుకుంటే మహారాష్ట్ర బస్ సర్వీస్‌లో రూ. 1055, తెలంగాణ ఆర్టీసీ ద్వారా రూ. 650 నుంచి రూ. 931(ఎక్స్‌ప్రెస్, సూపర్ లగ్జరీ, ఏసీ సెమీస్లీపర్ రాజధాని) మధ్య ఛార్జీ ఉంటుంది. ఎంజీబీఎస్ బస్ స్టేషన్ నుంచి, అమీర్ పేట్, ఎస్ఆర్ నగర్, కూకట్ పల్లి, మియాపూర్, చందానగర్, శేరిలింగంపల్లి, బీరం గూడ బస్ స్టేషన్ల నుంచి ఆర్టీసీ బస్సులు లభిస్తాయి.
ప్రయివేటు ట్రావెల్ సర్వీసు బస్సుల్లో రూ. 1,100 నుంచి రూ. 1,500 వరకు ఛార్జీలు ఉన్నాయి. బెంజ్ బస్ అయితే రూ. 3 వేల వరకు ఛార్జీ వసూలు చేస్తారు. బస్ సర్వీసును బట్టి ప్రయాణం తొమ్మిదిన్నర గంటల నుంచి 14 గంటలు పడుతుంది.
బస్సులో వెళ్లాలనుకుంటే మేక్ మై ట్రిప్ వంటి ట్రావెల్ వెబ్ సైట్ల ద్వారా టికెట్లు బుక్ చేసుకోవచ్చు. ఆర్టీసీ టికెట్లు కూడా వీటిలో లభిస్తాయి.
రైలు మార్గం (bhimashankar jyotirlinga nearest railway station)
హైదరాబాద్ నుంచి పూణె వరకు ఐఆర్సీటీసీ ద్వారా టిక్కెట్ బుక్ చేసుకోవాల్సి ఉంటుంది. సికింద్రాబాద్ నుంచి పూణె వెళ్లాలంటే స్లీపర్ క్లాస్ అయితే రూ. 370, థర్డ్ ఏసీ అయితే రూ. 975, సెకెండ్ ఏసీ అయితే రూ. 1,365 ఛార్జీ చెల్లించాల్సి ఉంటుంది.
పూణె నుంచి ప్రైవేటు వాహనాలు, లేదా ప్రభుత్వ బస్సుల్లో భీమశంకర్ చేరుకోవాలి. లేదా షిరిడి రైల్వే స్టేషన్ వరకు వెళ్లి అక్కడి నుంచి కూడా భీమశంకర్ వెళ్లొచ్చు. కాకపోతే కొంచెం దూరం పెరుగుతుంది.
విమాన మార్గం
భీమశంకర్ జ్యోతిర్లింగం టెంపుల్ దగ్గరగా ఉన్న విమానాశ్రయం పూణె. హైదరాబాద్ విమానాశ్రయం నుంచి పూణె టికెట్ ధర నెల ముందుగా బుక్ చేస్తే రూ. 2,500లకు అటుఇటుగా లభిస్తుంది. అక్కడి నుంచి ప్రైవేటు వాహనాలు అద్దెకు లభిస్తాయి. షిరిడి విమానాశ్రయం నుంచి భీమశంకర్ 180 కిలోమీటర్లు ఉంటుంది.
భీమశంకర్ ఆలయ స్థలవిశేషం (bhimashankar jyotirlinga story)
భీమశంకర్ ఆలయాన్ని సందర్శిస్తే భూత, ప్రేత, పిశాచాల పీడలు తొలిగిపోతాయని భక్తుల నమ్మకం. దానిక్కారణం భీమశంకర్ ఆలయం ఏర్పడింది భీమాసురుడనే రాక్షసుడి పేరు మీద. అతడు కుంభకర్ణుడు, కర్కటి అనే రాక్షసికి జన్మించినవాడు. రాముడు రావణుడు, కుంభకర్ణుడిని సంహరించాక కర్కటి ఇలా సహ్యాద్రి పర్వతశ్రేణుల్లో తలదాచుకుని శివభక్తురాలిగా మారిపోతుంది.
భీమాసురుడు విష్ణుభక్తులను, రుషులను లేకుండా చేసేందుకు బ్రహ్మకోసం తపస్సు చేసి వరాలు పొందుతాడు. ఇంద్రుడిని కూడా జయించి బంధిస్తాడు. ప్రస్తుతం భీమశంకర ఆలయం ఉన్న ప్రాంతాన్ని పూర్వం సుదక్షుణుడనే రాజు పాలించేవాడు. అతను పరమ శివభక్తుడు. అతడిని కూడా ఓడించి, కారాగారంలో బంధిస్తాడు భీమాసురుడు.
అంతేకాదు శివుణ్ని కాకుండా తననే పూజించమని చిత్రహింసలు పెడతాడు. తన కత్తితో సుదక్షణుడు తయారుచేసి శివలింగాన్ని ఖండించబోతాడు. అందుకే అక్కడి శివలింగంపై ఇప్పటికీ కత్తిగాటు కనిపిస్తుంది. భీమాసురుడి చర్యకు కోపోద్రిక్తుడైన లయకారుడు ప్రత్యక్షమై భీమాసురుడిని అంతమొందిస్తాడు.
అతడి తల్లి కర్కటి కోరిక మేరకు భీమాసురుడికి మోక్షం ప్రసాదించి, భీమాశంకరుడిగా ఆ కొండపై వెలిశాడని అంటారు. అందుకే డాకిని, శాకిని వంటి ప్రేత పిశాచాలు అక్కడ శివుడిని పూజిస్తాయని చెబుతారు. శివుడు యుద్ధం చేస్తున్నప్పుడు కారిన చెమట బిందువులతోనే అక్కడ భీమా నది ఏర్పడిందని అంటారు. కృష్ణా నది ఉపనదే భీమా నది.
భీమశంకర్ టెంపుల్ కట్టినది ఎవరు?
పదమూడో శతాబ్ధంలో పీష్వాన్ దివాన్ అయిన నానా ఫడ్నవీస్ ఈ ఆలయాన్ని నిర్మించినట్టు చరిత్రకారులు చెబుతారు. ఇక్కడ శివలింగం భూమి కన్నా లోతుగా ఉంటుంది. అందుకే మెట్లు దిగి వెళ్లి శివలింగాన్ని దర్శించుకోవాలి.
ఏ కాలం అనుకూలం?
ఈ టెంపుల్ చూసేందుకు ఆగస్టు నుంచి ఫిబ్రవరి నెలల మధ్య కాలం అనుకూలం. వర్షాలు పడే కాలంలో నిత్యం కొండపై వాన పడుతూనే ఉంటుంది. శీతాకాలంలో వెళితే చాలా బాగా ఎంజాయ్ చేయొచ్చు. మేఘాలు కిందకి దిగినట్టు కనిపిస్తాయి. మంచు పొగలతో కనీసం పదడుగుల దూరంలో ఉన్న మనుషులు కూడా కనిపించరు. అక్కడ చాలా కొత్తగా అనిపిస్తుంది. వెజ్ వంటకాలతో కూడిన చిన్న చిన్న హోటళ్లు అందుబాటులో ఉంటాయి.
ఎక్కడ బస చేయాలి?
భీమశంకర్ జ్యోతిర్లింగం దర్శించుకునే వారు పుణెలోనే వసతి తీసుకోవడం ఉత్తమం. ఇక్కడ పరిశుభ్రమైన లాడ్జ్‌లు, హోటళ్లు దొరుకుతాయి. భీమశంకర్ ఆలయ ప్రాంతంలో సత్రాలు ఉన్నప్పటికీ వసతి దొరకడం కాస్త కష్టమే.
అదిరే ట్రెక్కింగ్
ట్రెక్కింగ్ చేయాలనుకునేవారికి భీమశంకర్ టెంపుల్ నగరం మంచి ఎంపిక. షిడి ఘాట్, గణేష్ ఘాట్ల నుంచి ట్రెక్కింగ్ మొదలవుతుంది. షిడి ఘాట్ లో మూడు నిచ్చెనలు కూడా ఎక్కాల్సి వస్తుంది. చిన్నపిల్లలతో ట్రెక్కింగ్ కుదరదు.
దారి పొడవునా జలపాతాలు, పచ్చని చెట్లు, లోయలు పలకరిస్తూనే ఉంటాయి. దారిలో ఆహారపదార్థాలు, పానీయాలు అమ్మే చిన్న షాపులు కూడా ఉంటాయి. దాదాపు నాలుగున్నర గంటల పాటూ ట్రెక్కింగ్ సాగుతుంది. ఇందులో భీమశంకర్ ఆలయంతో పాటూ హనుమాన్ సరస్సు, అనేక హిల్ స్టేషన్లనూ చూడొచ్చు.
భీమ్ శంకర్‌లో సందర్శనీయ స్థలాలు
భీమ శంకర్ జ్యోతిర్లంగం దర్శనంతో పాటూ చుట్టుపక్కల చాలా ప్రదేశాలను చూసి రావొచ్చు. భీమ్ శంకర్ వైల్డ్ లైఫ్ సాంక్చురీలోని జంతువును తిలకించవచ్చు. అందులో పెద్ద పెద్ద ఉడతలు ప్రత్యేక ఆకర్షణ. అసలు ఆ కొండలపై పచ్చదనానికి, జలపాతాలకే మనసు పులకించిపోతుంది. అహుపే వాటర్ ఫాల్స్ తప్పకుండా చూడాలి.
కోవిడ్ మహమ్మారి నేపథ్యంలో భీమ్ శంకర్ జ్యోతిర్లింగం దర్శనానికి గల ఆంక్షలు ముందుగా తెలుసుకుని యాత్రకు ప్లాన్ చేసుకోవడం మంచిది. పూర్తి వివరాలను ఆలయ అధికారిక వెబ్ సైట్ లో తెలుసుకోవచ్చు. టెంపుల్ కార్యాలయ మేనేజర్‌ను 09130306565 నెంబర్ లో సంప్రదించవచ్చు.
– మానస్, ఫ్రీలాన్స్ జర్నలిస్ట్