Parenting Mistakes: పిల్లల మనసు వెన్నలాంటిది. పిల్లలను తల్లిదండ్రులు చాలా ముద్దుగా, గారాబంగా చూసుకుంటూ ఉంటారు. వాళ్లు ఎంతో ఉన్నతంగా ఎదగాలని, గొప్ప స్థాయికి రావాలని ఆశపడతారు. అయితే కొందరు తల్లిదండ్రులు పిల్లలను అతి గారాబం చేస్తారు, లేదా అతిగా కఠినత్వం చూపిస్తారు. ఈ రెండు కూడా పిల్లలను మంచి నడవడిక, క్రమశిక్షణకు దూరం చేస్తాయి. పిల్లల విషయంలో తల్లిదండ్రులు సాధారణంగా వాళ్లకు నచ్చిన్నట్టు ఉండాలని పిల్లలకు ఎన్నో ఆంక్షలు విధిస్తూ ఉంటారు. అలా చేయడం వల్ల పిల్లలు చాలా ఒత్తిడికి గురవుతారు. పిల్లలు చదువుతో పాటు అన్ని విషయాల్లో మంచి క్రమశిక్షణతో ఉండాలంటే ముందు తల్లిదండ్రులు మారాల్సిందే అంటున్నారు నిపుణులు.
పిల్లలు మనం చెప్పాల్సిన రీతిలో చెబితే చక్కగా వింటారంటున్నారు నిపుణులు. అయితే దానికి కొన్ని పద్దతులను తల్లిదండ్రులు పాటించాలని కూడా చెబుతున్నారు. ఆ పద్దతుల్లో చెబితే పిల్లలు ఎంచక్కా అమ్మానాన్న చెప్పిన మాటను ఇట్టే వినేస్తారట. పిల్లలు పసిమొగ్గలు, చిరునవ్వులను చిందించే చిన్నారులు.. అలాంటి పసివారిపై కొందరు తల్లిదండ్రులు అరిచేస్తారు. మరికొందరైతే వాళ్లను విపరీతంగా కొడతారు.
అసలు సమస్య ఎక్కడుందంటే తల్లిదండ్రుల్లోనే ఉంది అంటున్నారు నిపుణులు. పిల్లలు అల్లరి చేస్తే కేకలెయ్యమా? వస్లువులు నాశనం చేస్తే నాలుగు వాయించమా? అని తల్లిదండ్రులు వాళ్లతో కఠినంగా ప్రవర్తించి వాళ్లను మరింత పెంకిగా తయారు చేస్తున్నారు. కానీ అవసరమైతే పిల్లల కోసం తల్లిదండ్రులే మారాలని గట్టిగా చెబుతున్నారు నిపుణులు. అలా మారడానికి కొన్ని సూచనలు కూడా చేస్తున్నారు. అవి ఏంటో ఇప్పుడు చూద్దాం.
పిల్లలకు పదే పదే చెప్పకండి
చాలామంది తల్లిదండ్రులు చేసే తప్పే ఇది. పిల్లలకు చదవమని ఒకసారి చెప్పి ఊరుకోరు. చెప్పీ చెప్పగానే ఠక్కున పిల్లలు పుస్తకాలు తీసి గడగడా చదివేయాలి అనుకుంటారు. వాళ్లు మానసికంగా సిద్దంగా ఉన్నారా? లేదా? అనేది గమనించాలి. ఏదైనా పదే పదే చెప్పొద్దు. ఒక పని తర్వాత ఒకటి వెంట వెంటనే చెప్పడం వల్ల చేయాల్సిన పని కూడా చేయకుండా ఉంటారు. అలాకాకుండా ఒక పని చెప్పాక అది పూర్తయ్యాక మరొకటి చెప్పండి. అలాగే పిల్లలని ఒక పని చేయగానే అభినందించండి. అలా చేస్తే వాళ్లు మరొక పనిని చేసేటప్పుడు చాలా ఇష్టంగా, శ్రద్దతో చేస్తారు.
పిల్లలకు దగ్గరగా ఉండి చెప్పండి
పిల్లలకు వంట చేసుకుంటూనో లేదా పేపరు చదువుకుంటూనో పనులు పురమాయించకండి. పిల్లలకు దగ్గరగా ఉండి చెప్పాలి. దూరం నుంచి మీరు ఎన్ని పనులు చెప్పినా వాళ్లు వినిపించుకోరు అంటున్నారు నిపుణులు. అదే దగ్గరగా ఉన్నప్పుడు వాళ్లకు ఆ పనిని చెబితే చకచకా చేసేస్తారట. అది హోం వర్క్ అయినా, లేక బ్రష్ చేయమనైనా సరే ఏదైనా దగ్గరగా ఉండి చెప్పాలి. దూరం నుంచి అరిచి చెప్పినా వినరు. వాళ్ల దగ్గరగా వెళ్లి వాళ్లను దగ్గరకు తీసుకుని చెప్పి చూడండి ఏ మాత్రం పేచీ పెట్టకుండా గబగబా చేసేస్తారు.
పిల్లలు చెప్పేది కూడా వినండి
పిల్లలకు కొందరు తల్లిదండ్రులు వరుసగా ఏమేం చెయ్యాలో చెప్పుకుంటూ పోతారు గానీ.. పిల్లలు ఏం చెబుతున్నారో కనీసంగా కూడా వినరు. వాళ్లు చెప్పే కారణాలు కూడా కాస్త ఓపికతో వినండి. వాళ్లు ఏం చెప్పినా వినేది లేదని భావించకండి. పిల్లలు ఒక్కోసారి వంకలు వెతుకుతుంటారని తల్లిదండ్రులు మొండిగా ప్రవర్తిస్తే వాళ్లు అంతకన్నా మొండిగా ఉంటారని చెబుతున్నారు నిపుణులు. అందుకే పిల్లలు చెప్పేవి కూడా వినాలి. వారు చెప్పే కారణాలు సహేతుకంగా ఉంటే అంగీకరించాలి. లేకపోతే వాళ్లు వేషాలేస్తున్నారనేది గమనించి నవ్వుతూనే వారిని పనిలోకి దించాలి.
పిల్లలకు కూడా ఛాయిస్ ఇద్దాం
కొందరు తల్లిదండ్రులు ఆజ్ఞలు జారీ చేస్తారు. బట్టలు వేసుకునే విషయంలో కూడా వాళ్లు ఏది వేసుకోవాలో వాళ్లే చెబుతారు. పిల్లలకు చిన్న చిన్న విషయాలలో ఛాయిస్ ఇస్తూ ఉండాలి. అలా చేస్తే వాళ్లకు కూడా ఒక ఛాయిస్ ఇచ్చారని సంబరపడతారు. ఒకటి రెండు కలర్స్ వాళ్ల దగ్గర పెట్టి అందులో తనకు నచ్చింది వేసుకోమని చెప్పండి. అంతేగాని కటువుగా చెప్పకూడదంటున్నారు మానసిక వైద్య నిపుణులు.
పిల్లల బుల్లి మెదళ్లకు ఒక్కసారి చెప్పగానే అర్థం కావు. అలాగే విన్నా విననట్టు నటిస్తున్నారంటే అది వాళ్లకి అంగీకారం కాదని అర్థం చేసుకోవాలి. ఏదేమైనా చిన్నారులకు కన్విన్సింగ్గా చెప్పాలి అనేది నిపుణుల మాట. వాళ్లు వినాలి అంటే తల్లిదండ్రులే కాస్తంత ఓర్పు, నేర్పు, సమయం కేటాయించాలి. అలాకాకుండా మన దారిన మనం చెప్పుకుంటూ పోతే వాళ్లు ససేమిరా అనడమే. అందుకే పిల్లల్ని సుతిమెత్తగా సుతారంగానే చెప్పి నేర్పుగా పనులు చేయించాలి. మరి అలా చేయడానికి తల్లిదండ్రులు మారాల్సిందే.. కాదంటారా?
– లక్ష్మీ నెక్కల, ఫ్రీలాన్స్ జర్నలిస్ట్