పుట్టగొడుగుల్లోని పోషకాల వల్ల కలిగే ఆరోగ్య ప్రయోజనాలు అన్నీ ఇన్నీ కావు. వీటిలో శరీరానికి కావల్సిన పోషక విలువలన్నీ పుష్కలంగా లభిస్తాయి. అంతేకాదు దీనిలో పీచు పదార్థం ఉంటుంది. ఏం తిన్నామన్నది కాదు శరీరానికి పోషకాలు పుష్కలంగా అందాయా.. అనేదే కీలకం. అప్పుడే కదా మనిషి ఆరోగ్యంగా ఉండేది. అలాంటి మంచి ఆహారాల్లో ప్రధానంగా చెప్పుకోదగ్గది పుట్టగొడుగు. మరి దీన్ని తినడం వల్ల శరీరానికి ఏ రకంగా లాభం చేకూరుతుందో తెలుసుకోండి.
పుట్టగొడుగు గొడుగు ఆకారంలో ఎంతో అందంగా కనిపించే ఒక అద్భుత ఔషధం అని చెప్పవచ్చు. వీటిలో ఖనిజ లవణాలు, విటమిన్ బి1, బి2, బి9, బి12, విటమిన్ సి, విటమిన్ డి2, లభిస్తాయి. అంతేకాక యాంటీ ఆక్సిడెంట్లు, యాంటీ ఇన్ఫ్లమేటరీ గుణాలు అధికంగా ఉంటాయి. రోగనిరోధక శక్తిని పెంచుతాయి. క్యాన్సర్ వంటి సమస్యలు దరిచేరకుండా కాపాడతాయి. పుట్టగొడుగులు అధిక రక్తపోటును తగ్గించేందుకు సహాయపడతాయి.
అంతేకాదు వీటిలో తెలుపు, నలుపు, గోధుమ రంగులో రకరకాలుగా ఉంటాయి. వీటిలో తెలుపు రంగు పుట్టగొడుగులను తినడం ఆరోగ్యానికి శ్రేయస్కరమని ఆరోగ్య నిపుణులు సూచిస్తున్నారు. వారానికి ఒక్కసారైన పుట్టగొడుగులను ఆహారంలో భాగం చేసుకోడం మంచిది. ముఖ్యంగా ఇది వర్షాకాలంలో ఎక్కువగా లభిస్తుంది. ఇది మాంసాహారంతో సమానం. ఈ పుట్టగొడుగుల్లో 90% నీరు ఉంటుంది.
పుట్టగొడుగుల ఆరోగ్య ప్రయోజనాలు
రక్తహీనతను దూరం చేస్తుంది:
శరీరంలో రక్తహీనతను తగ్గించడానికి ముఖ్యంగా పుట్టగొడుగులు చాలా బాగా పనిచేస్తాయి. శరీరం ఇనుము సరిగ్గా గ్రహించడానికి ఇది చాలా అవసరం. కొన్ని రకాల పుట్టగొడుగుల్లో రాగి అధికంగా ఉంటుంది. కనుక పుట్టగొడుగులు తరుచూ ఆహారంలో భాగంగా చేర్చుకోవాలి.
క్యాన్సర్ సమస్యలు దరి చేరకుండా
ప్రపంచ మరణాలలో క్యాన్సర్ ప్రథమంగా ఉంది. పుట్టగొడుగులలో అనేక రకాల క్యాన్సర్ నిరోధక లక్షణాలు ఎక్కువగా ఉంటాయి. ఆల్కలాయిడ్స్, ప్లేవనాయిడ్లు, కెరోటినాయిడ్లు వంటి జీవసంబంధ సమ్మళనాలు క్యాన్సర్‌ను నిరోధించడానికి ఎంతగానో ఉపయోగపడతాయని పరిశోధనలు తెలుపుతున్నాయి. అంతేకాక వీటితోపాటు పెద్దపేగు క్యాన్సర్ రాకుండా ప్లూరోటస్ జాతికి చెందిన పుట్టగొడుగు ప్రభావవంతంగా పనిచేస్తుంది. రొమ్ముక్యాన్సర్ సమస్యను అధిగమించడానికి అగారికస్ అనే పుట్టగొడుగు క్యాన్సర్ కణాలతో పోరాడుతుంది.
రోగనిరోధక శక్తిని పెంచుతాయి:
పుట్టగొడుగులు రోగాన్ని నిరోధించడంలో ప్రముఖ పాత్ర పోషిస్తాయి. శరీరాన్ని వివిధ రకాల వ్యాధుల నుండి కాపాడడానికి, అంటువ్యాధుల బారిన పడకుండా రక్షించడానికి సహాయపడతాయి. పుట్టగొడుగులో బీటాగ్లూకాన్ అనే ఒక రకమైన పాలిసాకరైడ్లు ఉంటాయి. రోగనిరోధక శక్తిని పెంచడంలో అధిక సామర్థ్యాన్ని కలిగి ఉంటాయి. హానికరమైన క్రిములను తరిమి కొట్టడానికి ప్రతిరోధకాలను మెరుగుపరచడానికి పనిచేస్తాయి.
డయాబెటిస్‌ను నియంత్రిస్తుంది:
చక్కెరవ్యాధి రావడానికి శరీరం తగినంత ఇన్సులిన్ ఉత్పత్తి చేయకపోవడం కారణం. రక్తంలో అధికంగా గ్లూకోజ్ స్థాయి చేరడం వల్ల డయాబెటిస్ సంభవిస్తుంది. అయితే రక్తంలోని చక్కెర స్థాయిని అదుపులో ఉంచగలిగే వివిధ రకాల ఆహారపదార్థాలలొ పుట్టగొడుగులు ఒకటి. సుమారు 10 రకాల పుట్టగొడుగులు తినదగిన వాటిపై చేసిన పరిశోధనలలో కొన్ని సమ్మళనాలు హైపోగ్లైసమిక్ ప్రభావాన్ని కలిగి ఉన్నాయని తెలిసింది. కనుక చక్కెర వ్యాధి సమస్య ఉన్నవారు పుట్టగొడుగులను తినడం మంచిది.
కొవ్వును తగ్గస్తుంది:
శరీరంలో చెడు కొవ్వులు, మంచి కొవ్వులు అనే రెండు రకాలు ఉంటాయి. పుట్టగొడుగుల్లో కొవ్వు చాలా తక్కువగా ఉంటుంది. మన శరీరానికి కొవ్వు కొంతవరకూ అవసరం. చెడు కొలెస్ట్రాల్ పెరిగినప్పుడు గుండె జబ్బులకు దారితీస్తుంది. కొవ్వును తగ్గించడంలో పుట్టగొడుగులు చాలా వరకూ సహాయపడతాయి.
బరువు తగ్గడానికి:
శరీరంలో ఊబకాయం పెరిగితే అనేక వ్యాధులు రావడానికి అవకాశం ఉంది. కొవ్వు అధికంగా ఉన్నప్పుడే ఊబకాయం పెరుగుతుంది. దీని వల్ల గుండెజబ్బులు, రక్తపోటు సంభవిస్తాయి. ఎక్కువగా తినడం, శారీరక శ్రమ లేకపోవడం, అధిక ఒత్తిడి కారణంగా బరువు పెరుగుతారు. అయితే పుట్టగొడుగులు బరువును అదుపులో ఉంచడానికి సాయపడతాయి.
– లక్ష్మీ నెక్కల, ఫ్రీలాన్స్ జర్నలిస్ట్