Staff Selection Commission Recruitment: ఇంటర్మీడియట్ విద్యార్హత సాధించిన వారికి కేంద్ర ప్రభుత్వం వివిధ రకాల ఉద్యోగాల భర్తీ కొరకు నోటిఫికేషన్‌ను విడుదల చేసింది. ఈ మేరకు అర్హత, ఆసక్తి గల అభ్యర్థులు క్రింది తెలిపిన పోస్టుల వివరాల ప్రకారం దరఖాస్తు చేసుకోవచ్చు.
స్టాఫ్ సెలక్షన్ కమీషన్ (SSC) ప్రభుత్వ ఉద్యోగాలు సాధించాలనుకునే అభ్యర్థుల కొరకు, వాటి కోసం ఎప్పటినుంచో ప్రిపేర్ అవుతున్న వారికి కేంద్ర ప్రభుత్వం శుభవార్తను అందించింది. కేవలం ఇంటర్ పాసైన విద్యార్థులు కేంద్ర కొలువుకు సన్నద్దం అయ్యేలా అవకాశాలను కల్పించనుంది.
పలు విభాగాల్లో 3712 ఉద్యోగాలను భర్తీ చేసేందుకు నోటిఫికేషన్‌ను విడుదల చేసింది. దేశవ్యాప్తంగా ఉన్నటువంటి ప్రభుత్వ కార్యాలయాలు, వివిధ మంత్రిత్వ శాఖలు, కేంద్ర ప్రభుత్వ సంస్థలలో జూనియర్ సెక్రటేరియట్ అసిస్టెంట్, లోయర్ డివిజినల్ క్లర్క్, డేటా ఎంట్రీ ఆపరేటర్ పోస్టుల భర్తీకి ఈ నోటిఫికేషన్ విదుదల చేసింది.
దీనిని కంబైన్డ్ హయ్యర్ సెకండరీ లెవల్ ఎగ్జామినేషన్ 2024(CHSL) గా ప్రకటించింది. ఆన్‌లైన్ దరఖాస్తుకు చివరి తేదీ మే 7 వరకూ గడువు ఇచ్చింది. అర్హులైన అభ్యర్థులందరూ ఆన్‌లైన్‌లో అప్లయ్ చేసుకోవచ్చు. దీనికి టైర్ 1, టైర్ 2 అనే రెండు విధాలుగా పరీక్షను నిర్వహిస్తారు. టైర్ 1 పరీక్షను జూన్, జూలైలో నిర్వహించే అవకాశం ఉంది.
అర్హత, వయసు, జీతం, దరఖాస్తు రుసుం, ఎంపిక విధానం ఇలా
- అర్హత: ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకునే అభ్యర్థులు తప్పనిసరిగా ఇంటర్ విద్యార్హత లేదా తత్సమాన కోర్సులో ఉత్తీర్ణులై ఉండాలి. సాంస్కృతిక శాఖల్లో డేటా ఎంట్రీ ఆపరేటర్, పౌర సరఫరాల మంత్రిత్వ శాఖ, వినియోగదారుల వ్యవహారాలు పోస్టులకు మాత్రం ఇంటర్‌లో సైన్స్ గ్రూపుతో మ్యాథ్స్ ఒక సబ్జెక్టు అయి ఉండాలి. ఆగస్టు 1, 2024 నాటికి ఇంటర్ పాసైన అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవచ్చు.
- వయో పరిమితి: 2024 ఆగస్టు 1 నాటికి 18-27 ఏళ్ల మధ్య వయసు కలిగిన అభ్యర్థులు ఈ ఉద్యోగాలకు అప్లయ్ చేసుకోవచ్చు. OBC – మూడేళ్లు, SC,ST – ఐదేళ్లు, దివ్యాంగులకు 10-15 ఏళ్ల చొప్పున గరిష్ట వయోపరిమితిలో సడలింపు ఇచ్చారు.
- జీతం: జూనియర్ సెక్రటేరియట్ అసిస్టెంట్, లోయర్ డివిజినల్ క్లర్క్ పోస్టులకు పే లెవెల్ 2 కింద రూ. 19,900- రూ. 63,200 వరకూ చెల్లిస్తారు. డేటా ఎంట్రీ ఆపరేటర్‌కు పే లెవెల్ 4 ప్రకారం రూ . 25,500 – 81,100, పే లెవెల్ 5 ప్రకారం రూ. 29,200 – 92,300, డేటా ఎంట్రీ ఆపరేటర్ గ్రేడ్ ఎ పోస్టుకు పే లెవెల్ 4 కింద రూ. 25,500 – 81,100 వేతనం చెల్లిస్తారు.
- దరఖాస్తు రుసుం: జనరల్ కేటగిరీ అభ్యర్థులు రూ. 100 రుసుం చెల్లించాల్సి ఉంటుంది. మహిళలు, దివ్యాంగులు, ఎస్సీ, ఎస్టీ అభ్యర్థులు ఫీజు చెల్లించనవసరం లేదు.
- ఎంపిక విధానం: మొదటగా అభ్యర్ధులు టైర్ 1 పరీక్ష ఉత్తీర్ణులవ్వాలి. తర్వాత టైర్ 2 పరీక్షను నిర్వహిస్తారు. ఆ పరీక్షలో సాధించిన మార్కుల ఆధారంగా అభ్యర్థుల ఎంపిక ఉంటుంది. ఆ తర్వాత అభ్యర్థులు ఏ పోస్టుకైతే దరఖాస్తు చేసుకుంటారో ఆ పోస్టును బట్టి మూడో దశ కింద కంప్యూటర్ టెస్ట్ లేదా టైపింగ్ టెస్ట్ నిర్వహిస్తారు. దీనిలో అర్హత సాధించిన వారికి ధృవపత్రాల పరీశీలన, వైద్య పరీక్షలు నిర్వహించి ఉద్యోగాలకు ఎంపిక చేస్తారు.
నోటిఫికేషన్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి
– లక్ష్మీ నెక్కల, ఫ్రీలాన్స్ జర్నలిస్ట్