కోవర్కింగ్ స్పేస్ గురించి మీకు తెలుసా? మీరు ఏదైనా స్టార్టప్ ప్లాన్ చేస్తున్నారా.. లేదా మీరు ఓ ఫ్రీలాన్స్ వర్కరా.. లేక సొంతంగా చిన్న బిజినెస్ స్టార్ట్ చేయడానికి ఆఫీస్ స్పేస్ గురించి వెతుకుతున్నారా.. అయితే మీరు కచ్చితంగా దీని గురించి తెలుసుకోవాల్సిందే.
పేరులోనే ఉన్నట్లు కోవర్కింగ్ స్పేస్ అంటే ఒకే ఆవరణలో వివిధ రంగాలకు చెందిన వ్యక్తులు కలిసి పని చేసుకోవడం. ఎవరి పని వాళ్లదే. కానీ పని చేసే చోటు మాత్రం ఒకటే. ఏదో చిన్నగా ఓ స్టార్టప్ ప్రారంభించాలని అనుకుంటున్నారు. అందుకు తగిన కమర్షియల్ ఆఫీస్ స్పేస్ కావాలంటే చాలా ఖర్చుతో కూడుకున్న పని. అదే కోవర్కింగ్ స్పేస్‌లో తక్కువ ఖర్చుతో మీకు కావాల్సిన ఆఫీస్ స్పేస్ లభిస్తుంది.
ఇతర ఆఫీస్‌లలో ఉండే అన్ని సదుపాయాలు ఇక్కడ కూడా ఉంటాయి. కాకపోతే వాటిని మీతోపాటు అక్కడున్న మిగతా అందరూ షేర్ చేసుకుంటారు. మీరో ఫ్రీలాన్స్ వర్కర్ అనుకోండి.. ఇంటి నుంచి పని చేసి చేసి బోర్ కొడుతోంది.. ఓ ఆఫీస్ ఎన్విరాన్‌మెంట్ అయితే బాగుంటుంది అనుకుంటారు. కానీ సొంతంగా మీరో ఆఫీస్ సమకూర్చుకోవడం కుదరదు కదా. అలాంటప్పుడు ఈ కోవర్కింగ్ స్పేస్ బెస్ట్ ఆప్షన్.
మీకు కావాల్సింది ఓ కుర్చీ, చిన్న టేబుల్, కాస్త స్థలం మాత్రమే. అవి వాళ్లు సమకూరుస్తారు. మీతోపాటు చుట్టూ ఎవరెవరో వాళ్ల పని వాళ్లు చేసుకుంటూ ఉంటారు. మొత్తంగా మీరు కోరుకున్న ఆఫీస్ ఎన్విరాన్‌మెంట్ అక్కడ కనిపిస్తుంది. ఇదే కోవర్కింగ్ స్పేస్ అంటే.
దీని గురించి మరింత వివరంగా తెలుసుకోవడంతోపాటు కోవర్కింగ్ స్పేస్ వల్ల కలిగే లాభాలు.. హైదరాబాద్‌లో ఇవి ఎక్కడ ఉన్నాయన్న సమగ్ర సమాచారంతో డియర్ అర్బన్.కామ్ అందిస్తున్న స్టోరీ ఇది.
కోవర్కింగ్ స్పేస్ ఎలా ఉంటుంది?
ఓ కంపెనీ.. దానికో ఆఫీస్.. అక్కడి ఉద్యోగులంతా ఆ కంపెనీకి సంబంధించి వివిధ పనులు చేస్తూ కనిపిస్తారు. కానీ కోవర్కింగ్ స్పేస్ వేరు. ఇక్కడ ఎవరి పని వాళ్లదే. ఎవరి సంపాదన వాళ్లదే. ఒకరి పనితో మరొకరికి ఎలాంటి సంబంధం ఉండదు. కానీ అందరూ పక్కపక్కనే ఉంటారు. ఓ పని చేసే ప్రాంతాన్ని అందరూ పంచుకుంటారు.
రెండు టేబుళ్లు, నాలుగు కుర్చీలు ఉంటే చాలు అనుకున్న స్టార్టప్‌కు పెద్ద ఆఫీస్ స్పేస్ అవసరం లేదు కదా. అలాంటప్పుడు ఈ కోవర్కింగ్ స్పేస్‌ను ఎంచుకుంటే సరిపోతుంది. ఖర్చు కూడా చాలా తక్కువ. కావాలంటే ఒక రోజుకు లేదా వారానికి లేదా నెల రోజులకు కూడా ఈ కోవర్కింగ్ స్పేస్‌ను వాడుకోవచ్చు.
పైగా అక్కడ ఉండే ఓ డెస్క్‌ను పూర్తిగా మీరే వాడుకోవచ్చు లేదంటే ఎవరితో అయినా పంచుకునే అవకాశం కూడా ఉంటుంది. సాధ్యమైనంత తక్కువ ఖర్చులో మీకు ఓ ఆఫీస్ వాతావరణం ఈ కోవర్కింగ్ స్పేస్ వల్ల లభిస్తుంది.
ఓ రైటర్, ఓ సాఫ్ట్‌వేర్ డెవలపర్, ఓ బిజినెస్ అనలిస్ట్, ఓ చార్టెర్డ్ అకౌంటెంట్.. ఇలా వివిధ రంగాలకు చెందిన వ్యక్తులు ఒకే చోట కలిసి పని చేయడమన్న కాన్సెప్టే చాలా కొత్తగా అనిపిస్తుంది.
కోవర్కింగ్ స్పేస్‌లో ఏముంటాయి?
సాధారణంగా ఈ కోవర్కింగ్ స్పేస్ ఏర్పాటు చేసే ఓనర్లు ఆఫీస్‌కు తగిన అన్ని వసతులను సమకూరుస్తారు. మొత్తంగా అక్కడున్న వాళ్లెవరికీ ఎలాంటి ఇబ్బంది కలగకుండా ఓ పని వాతావరణం కల్పించడమే ఈ కోవర్కింగ్ స్పేస్ ఉద్దేశం.
– అందరూ షేర్ చేసుకునే ఓ ఆవరణ
– 24 గంటల పాటూ అందుబాటులో ఉండడం
– అందుబాటులో కాన్ఫరెన్స్ లేదా బోర్డు రూమ్స్. వీటిని రిజర్వ్ చేసుకోవచ్చు. లేదా అద్దెకు తీసుకోవచ్చు.
– వైఫై
– అందరూ వాడుకునేలా ప్రింటర్, జిరాక్స్ మెషీన్, ఫ్యాక్స్‌లాంటివి ఉంటాయి.
– కిచెన్, బాత్‌రూమ్స్, లాంజ్
కోవర్కింగ్ స్పేస్.. ఎవరికి?
ఎవరైనా వాడుకోవచ్చు. ఇంతకుముందు చెప్పినట్లు ఇంట్లో ఒక్కరే కూర్చొని ఫ్రీలాన్సింగ్ వర్క్ చేసుకునే వాళ్లకైతే ఇది మంచి ఆప్షన్. టైమ్ ఎలాగూ మీ చేతుల్లోనే ఉంటుంది. ఇక్కడ మీకంటూ కొంత స్పేస్ తీసుకున్నారంటే ప్రతి రోజూ ఆఫీస్‌కు వెళ్లి వచ్చిన ఫీలింగ్ కలుగుతుంది. పది మందితో పరిచయాలూ ఏర్పడతాయి.
– స్టార్టప్స్ అయినా అంతే. ఓ నలుగురైదుగురు కలిసి స్టార్టప్ ప్లాన్ చేస్తే.. ఈ కోవర్కింగ్ స్పేస్‌లో మీకంటూ ప్రత్యేకంగా ఓ డెస్క్ బుక్ చేసుకుంటే సరిపోతుంది. మీరే ప్రత్యేకంగా బయట ఓ ఆఫీస్‌ను అద్దెకు తీసుకోవడం కంటే ఇలా చేయడం వల్ల తక్కువ ఖర్చులో పని అయిపోతుంది. పైగా మీతోపాటు పక్కనే వేరే టీమ్స్ కూడా ఉంటాయి. వాళ్లతో ఐడియాలు షేర్ చేసుకునే వీలుంటుంది.
– ఒక్కోసారి పెద్ద పెద్ద కంపెనీలు కూడా కోవర్కింగ్ స్పేస్‌లో తమ ఉద్యోగుల కోసం కాస్త స్థలం తీసుకుంటాయి. ఒకేసారి ఎక్కువ మంది ఉద్యోగులు పని చేయాల్సి వచ్చినప్పుడు తమ సొంత ఆఫీస్‌లో స్థలం సరిపోదు. అలాంటి సమయంలో కొంతమందిని ఇక్కడికి పంపిస్తుంటారు.
లాభాలు ఏంటి?
కోవర్కింగ్ స్పేసెస్ అద్భుతాలు సృష్టిస్తున్నాయి. తాజాగా కొంతమంది రీసెర్చర్లు వీటిపై అధ్యయనం కూడా నిర్వహించారు. వాటి ఫలితాలను హార్వర్డ్ బిజినెస్ రీవ్యూలో ప్రచురించారు.
– సాధారణ ఆఫీస్‌లలో కంటే ఇక్కడ పని చేసే ఉద్యోగుల్లో సంబంధాలు మరింత బలంగా ఉన్నట్లు అధ్యయనంలో గుర్తించారు. దీనివల్ల వాళ్ల పనితీరు మరింత మెరుగవుతోంది.
– వివిధ రంగాలకు చెందిన వ్యక్తులు ఒకే దగ్గర పని చేయడం వల్ల.. కొత్త ఆవిష్కరణలు పుట్టుకొస్తున్నాయి. అక్కడి ఉద్యోగుల్లో నైపుణ్యాలు మెరుగవుతున్నాయి.
– రెగ్యులర్ ఆఫీస్‌కు వెళ్లాలంటే ఒక్కోసారి మీకు బోర్ కొడుతుంది. కానీ కోవర్కింగ్ స్పేస్‌లో అలా కాదు. ఇక్కడ పని చేయడాన్ని చాలా మంది ఇష్టపడుతున్నారు. ఆ పని వాతావరణాన్ని ఎంజాయ్ చేస్తున్నట్లు గుర్తించారు. పైగా కొన్ని కోవర్కింగ్ స్పేసెస్.. పని ఒత్తిడి నుంచి ఉద్యోగులను దూరం చేయడానికి వివిధ రకాల గేమ్స్‌లాంటివి కూడా ఏర్పాటు చేస్తున్నాయి. అసలు ఆ ఆఫీస్‌ను చూడగానే పని చేసే ఆసక్తి కలిగేలా తమ వర్కింగ్ స్పేస్‌ను రూపొందిస్తున్నాయి.
– అసలు కోవర్కింగ్ స్పేసెస్‌లో మంచి పనితీరు నమోదవుతోందన్న కారణంగానే కొన్ని పెద్ద పెద్ద కంపెనీలు ప్రత్యేకంగా వీటిని తీసుకుంటున్నట్లూ అధ్యయనంలో తేలింది.
ఆ ఆఫీస్‌లూ కాపీ కొడుతున్నాయ్
అసలు పెద్ద పెద్ద కంపెనీలు ప్రత్యేకంగా కోవర్కింగ్ స్పేస్‌ను తీసుకోవడం కాదు.. ఆ కోవర్కింగ్ స్పేస్ వాతావరణాన్నే కాపీ కొట్టే ప్రయత్నం కూడా చేస్తున్నాయి. కోవర్కింగ్ స్పేస్‌లోని ఎన్విరాన్‌మెంట్ ప్రోడక్టవిటీని పెంచుతోంది.
స్వేచ్ఛగా నిర్ణయాలు తీసుకునే, వాటిని పది మందితో పంచుకునే వాతావరణం అక్కడ ఉంటుంది. అక్కడ ఉండే ఒక్కో వ్యక్తికి ఓ యూనిక్ టాలెంట్, స్కిల్ ఉంటుంది. అలాంటి వాళ్లంతా ఒక చోట కలిసి పని చేస్తే వచ్చే ఔట్‌పుట్ ఎలా ఉంటుందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు.
ఎవరి పని వాళ్లదే అయినా.. అక్కడి వాతావరణం వల్ల ఎవరి పనిని వాళ్లు మరింత సమర్థంగా పూర్తి చేసే అవకాశం కలుగుతుంది. దీంతో ఈ కోవర్కింగ్ స్పేసెస్ వాతావరణాన్నే రెగ్యులర్ ఆఫీస్‌లలో కల్పించే ప్రయత్నాలు పెద్ద కంపెనీలు చేస్తున్నాయి.
నిజానికి సాధారణ ఆఫీస్‌లలో కూడా ఎన్నో రకాల డిపార్ట్‌మెంట్స్ ఉంటాయి. కానీ ఎవరి పని వాళ్లదే. ఇలా కలిసి పని చేస్తూ.. ఆలోచనలు పంచుకునే సంస్కృతి అక్కడ ఉండదు. ఇక్కడే కోవర్కింగ్ స్పేసెస్ విజయవంతమవుతున్నాయి. ఆ స్వేచ్ఛ ఇక్కడి ఉద్యోగులకు ఉంటుంది. అందువల్ల ఇక్కడి వాతావరణాన్ని, పని సంస్కృతిని సమర్థంగా తమ దగ్గర కూడా అమలు చేయడం పెద్ద కంపెనీలకు సవాలే.
ఈ స్పేస్‌కు ఫుల్ డిమాండ్
కోవర్కింగ్‌కు రాను రాను డిమాండ్ పెరుగుతోంది. ఎప్పుడూ కొత్తదనాన్ని కోరుకునే యువత ఈ కోవర్కింగ్ స్పేసెస్ వైపు చూస్తోంది. పైగా ఏదో కంపెనీలో ఉద్యోగం కంటే స్వేచ్ఛగా చేసుకునే వీలున్న ఫ్రీలాన్స్ వర్క్‌పైనా ఆసక్తి పెరుగుతోంది. అందుకే రోజురోజుకూ ఫ్రీలాన్స్ వర్కర్ల సంఖ్య పెరుగుతోంది. కంపెనీలు కూడా వీటిని ప్రోత్సహిస్తున్నాయి.
ఈ ఫ్రీలాన్సర్లతో కోవర్కింగ్ స్పేసెస్ సంస్థలు కూడా లాభపడుతున్నాయి. ఎప్పుడో 1995లోనే తొలిసారి ఈ పదం వాడుకలోకి వచ్చినా.. గత రెండేళ్లుగా మెట్రో పాలిటన్ నగరాల్లో వీటి సంఖ్య విపరీతంగా పెరిగిపోతోంది. మన హైదరాబాద్‌లోనూ ఇలాంటి కోవర్కింగ్ స్పేసెస్ చాలానే ఉన్నాయి. అవేంటో ఇప్పుడు చూద్దాం.
91స్ప్రింగ్ బోర్డ్ (91springboard)
హైదరాబాద్‌లోని ప్రముఖ కోవర్కింగ్ స్పేసెస్‌లో ఈ 91స్ప్రింగ్ బోర్డ్ ముందుంటుంది. మనం ముందుగా చెప్పుకున్నట్లు వివిధ రకాల స్టార్టప్ కంపెనీలు, ఫ్రీలాన్సర్లు, పలువురు వ్యాపారవేత్తలు కలిసి ఈ వర్క్ స్పేస్‌ను పంచుకుంటున్నారు.
హైదరాబాద్‌తోపాటు ఇండియాలోని అన్ని ప్రముఖ నగరాల్లో ఈ 91స్ప్రింగ్ బోర్డ్ స్పేసెస్ ఉన్నాయి. వాటిలో సుమారు 1300 మంది ప్రొఫెషనల్స్ పని చేస్తున్నారు. 24 గంటలకూ ఇక్కడి వర్కింగ్ స్పేస్ అందుబాటులో ఉంటుంది. ఇక్కడ మీ అవసరాన్ని బట్టి వివిధ ధరల్లో మీకు కావాల్సిన స్పేస్ ఇస్తారు. ప్రైవేట్, ఓపెన్, డెడికేటెడ్, హాట్ డెస్క్, పార్ట్‌టైమ్, నైట్ టైమ్, వీకెండ్స్, డే పాస్, రిజిస్టర్డ్ ఆఫీస్.. ఇలా వివిధ రకాల స్పేసెస్ ఉంటాయి.
ఉదాహరణకు డే పాస్ తీసుకుంటే.. ఒక రోజు 8 గంటల పాటు ఓ డెస్క్ కేటాయిస్తారు. దీనికి రూ.530 వసూలు చేస్తారు. కావూరీ హిల్స్ ఫేజ్ 1లో జూబ్లీ రిడ్జ్ హోటల్ వెనుక ఈ 91స్ప్రింగ్ బోర్డ్ ఉంటుంది. వీళ్ల అధికారిక వెబ్‌సైట్ https://www.91springboard.com.
యూనిస్పేస్ (Unispace)
ఇండియాలో హైదరాబాద్‌తోపాటు బెంగళూరు, భువనేశ్వర్‌లలో కోవర్కింగ్ స్పేస్ ఇస్తోందీ కంపెనీ. హైదరాబాద్‌లో మాదాపూర్, హైటెక్‌సిటీ, కొండాపూర్, గచ్చిబౌలిలలో యూనిస్పేస్ వర్క్‌స్టేషన్స్ ఉన్నాయి. స్టార్టప్స్, ఫ్రీలాన్సర్స్, చిన్న బిజినెస్‌లు ఏర్పాటు చేసుకునే వాళ్లందరికీ అవసరమైన సదుపాయాలు ఇక్కడ అందుబాటులో ఉంటాయి.
డిఫరెంట్ లుక్‌తో ఇన్నోవేటివ్‌గా ఉండే స్పేస్ కావాలంటే యూనిస్పేస్‌కు వెళ్లొచ్చు. కోవర్కింగ్ స్పేస్‌కు నెలకు కనీసం రూ. 5999 నుంచి వివిధ ప్యాకేజీలు ఉన్నాయి. మాదాపూర్ గఫూర్‌నగర్‌లో ఉన్న ఇమేజ్ హాస్పిటల్ రోడ్‌లో ఈ యూనిస్పేస్ ఆఫీస్ ఉంది. వీళ్ల అధికారిక వెబ్‌సైట్ https://www.unispacebc.com
కోవర్క్‌జోన్ (Coworkzone)
హైటెక్‌సిటీలోని 100 ఫీట్ రోడ్‌లో ఈ కోవర్క్‌జోన్ వర్క్ స్పేస్ ఉంది. మీ అవసరాన్ని బట్టి రెండు నుంచి ఎనిమిది సీట్ల ప్రైవేట్ క్యాబిన్స్ ఇక్కడ అందుబాటులో ఉన్నాయి. అంటే ముఖ్యంగా స్టార్టప్స్‌కు బాగా పనికొచ్చే స్పేస్ ఇది. తెలంగాణ ప్రభుత్వం ఏర్పాటు చేసిన టీహబ్‌తో ఈ కోవర్క్‌జోన్‌కు భాగస్వామ్యం ఉంది.
సోమవారం నుంచి శనివారం వరకు ఉదయం 9 గంటల నుంచి రాత్రి 9.30 గంటల వరకు ఈ వర్క్ స్పేస్ ఓపెన్ ఉంటుంది. ఇంటర్నెట్ సౌకర్యంతోపాటు కాన్ఫరెన్స్ రూమ్స్, కాఫీ మిషన్‌లాంటి సేవలన్నీ ఫ్రీగా ఇస్తున్నట్లు ఈ సంస్థ చెబుతోంది. http://www.coworkzone.in/ వెబ్‌సైట్‌లోకి వెళ్తే మరిన్ని వివరాలు తెలుసుకోవచ్చు.
రెంట్ ఎ డెస్క్ (Rent A Desk)
బంజారాహిల్స్ రోడ్ నంబర్ 3, రోడ్ నంబర్ 10తోపాటు జూబ్లీహిల్స్ రోడ్ నంబర్ 36లలో ఈ రెంట్ ఎ డెస్క్ కోవర్కింగ్ స్పేస్ అందుబాటులో ఉంది. త్వరలోనే హైటెక్‌సిటీలోనూ స్టార్ట్ చేస్తున్నట్లు ఈ సంస్థ చెబుతోంది.
కనీసం రూ. 500 నుంచి డెస్క్‌లు ఇక్కడ అందుబాటులో ఉన్నాయి. ఇక్కడ కావాలంటే స్టార్టప్స్ ఒక రూమ్ మొత్తాన్ని అద్దెకు తీసుకోవచ్చు లేదంటే.. అప్పుడప్పుడూ కాన్ఫరెన్స్ రూమ్‌లో మీటింగ్స్ పెట్టుకోవచ్చు.
హైస్పీడ్ ఇంటర్నెట్, 24 గంటల పవర్ బ్యాకప్, లాకర్స్‌లాంటి సర్వీసెస్ ఉంటాయి. మరిన్ని వివరాలకు 9885421400 నంబర్‌కు కాల్ చేయొచ్చు. రెంట్ ఎ డెస్క్ అధికారిక వెబ్‌సైట్ www.rentadesk.in
హ్యాచ్‌స్టేషన్ (Hatchstation)
స్టార్టప్ ఫౌండర్స్, ఫ్రీలాన్సర్లకు ఈ హ్యాచ్‌స్టేషన్ కూడా మంచి ఆప్షన్. బేగంపేట ప్రాంతంలో దీని కార్యాలయం ఉంది.
స్టార్టప్స్‌కు స్పేస్ ఇవ్వడంతోపాటు వీకెండ్స్‌లో హ్యాకథాన్, సెమినార్స్, కాన్ఫరెన్సుల్లాంటివి నిర్వహిస్తుంది. ఉదయం 8 నుంచి రాత్రి 9 గంటల వరకు ఈ స్పేస్ వాడుకోవచ్చు.
వైఫై, ప్రింటర్, స్కానర్లు వాడుకోవచ్చు. మీటింగ్ రూమ్స్‌కు మాత్రం ప్రత్యేకంగా అనుమతి తీసుకోవాల్సి ఉంటుంది. డెడికేటెడ్ డెస్క్ అయితే నెలకు రూ. 5000 వసూలు చేస్తున్నారు. ప్రైవేట్ డెస్క్ అయితే రెండు, నాలుగు, ఆరు, ఎనిమిది సీట్ల సామర్థ్యంతో ఉన్నాయి. అధికారిక వెబ్‌సైట్ http://hatchstation.com/.
ఐకేవా (Ikeva)
మాదాపూర్, కేపీహెచ్‌బీ, హైటెక్ సిటీ, బంజారాహిల్స్‌లో ఈ ఐకేవా కోవర్కింగ్ స్పేసెస్ ఉన్నాయి. కనీసం రూ. 3 వేల నుంచి రూ. 9500 వరకు ధరల్లో ఇక్కడ స్పేస్ అందుబాటులో ఉంది. నైట్, మొబైల్, మొబైల్ ప్లస్, కొలాబరేటివ్, డెడికేటెడ్ పేర్లతో వివిధ రకాల స్పేసెస్ ప్రొవైడ్ చేస్తున్నారు.
మొబైల్, మొబైల్ ప్లస్ ప్లాన్స్‌లో నాలుగు లొకేషన్లలో ఎక్కడైనా 50 గంటల పాటు స్పేస్‌ను వాడుకునే వీలు కల్పిస్తున్నారు. బంజారాహిల్స్ రోడ్ నంబర్ 10లో ఉన్న ఎంబీ టవర్స్ లెవల్ 1లో ఈ ఐకేవా ప్రధాన కార్యాలయం ఉంది. అధికారిక వెబ్‌సైట్ https://www.ikeva.com/
ఇవే కాకుండా అవర్ హబ్ (our hub), ద వ్యాలీ (the vally), కొలాబ్‌హౌజ్ (collabhouse), జాక్ యువర్ స్టార్టప్ (jack your startup)లాంటి కోవర్కింగ్ స్పేసెస్ కూడా హైదరాబాద్‌లో అందుబాటులో ఉన్నాయి.
ఇవి కూడా చదవండి