Manila Tamarind: సీమ‌చింత‌కాయతో ఈ వేస‌వి కాలంలో ఆరోగ్యానికి ఎన్నో ఆరోగ్య ప్ర‌యోజ‌నాలు

manila tamarind
సీమ చింతకాయ Susan Slater, CC BY-SA 4.0 , via Wikimedia Commons

ఎండాకాలంలో ల‌భించే పండ్లన్నీ ఆరోగ్యానికి ఎంతో మేలు చేసేవే.. అందులో సీమ చింత‌కాయ‌లు మ‌రింత ఆరోగ్య‌క‌రం. వేస‌విలో ఆరోగ్యాన్ని కాపాడుకోవాలంటే ఆ సీజ‌న్‌లో ల‌భించే పండ్ల‌న్నీ వీలైనంత‌వ‌ర‌కూ తిన‌డం శ్రేయ‌స్క‌రం. అంతేకాదు వీటిని కూర‌లలో వేసి కూడా వండుతుంటారు. సీమ చింత కాయలు అంటే సిటీలో ఉండే వారి కంటే.. పల్లెటూరులో ఉండే వారికి బాగా తెలుస్తుంది. వీటినే గుబ్బ కాయలు అని కూడా పిలుస్తారు. 

సీమ చింతకాయలు చాలా రుచిగా కూడా ఉంటాయి. ఇందులో శరీరానికి కావాల్సిన అనేక పోషకాలు లభిస్తాయి. వీటి ఆకారం చిక్కుడు కాయ‌ల మాదిరిగా.. కాకపోతే గింజలు పెద్దగా ఉంటాయి. తమిళనాడు, కేరళ, మహారాష్ట్ర, పశ్చిమ బెంగాల్ రాష్ట్రాల్లో ఇవి ఎక్కువగా పెరుగుతాయి. వీటిని ఎండాకాలంలో ఎక్కువ‌గా చూస్తూంటాం. మ‌రి వేస‌విలో ల‌భించే సీమ చింత‌కాయ‌ల్లో ఎంత‌టి ప్ర‌యోజ‌నాలు దాగి ఉన్నాయో ఇప్పుడు చూద్దాం.

సీమ చింత యొక్క ఆరోగ్య ప్ర‌యోజ‌నాలు:

  1. సీమ చింత‌కాయ‌లు తిన‌డం వ‌ల్ల మ‌న శ‌రీరంలో ఐరన్, మెగ్నీషియం, ఫైబర్, యాంటీ ఆక్సిడెంట్లు,  ఎ, బి, సి వంటి విట‌మిన్లు  పుష్కలంగా అందుతాయి. వీటిని తింటే బ‌రువు కూడా తగ్గుతారు అంటున్నారు నిపుణులు. అంతేకాదు రోగ‌నిరోధ‌క శ‌క్తికి ఢోకా ఉండ‌దు. షుగర్, బీపీ ఉన్నవారు కూడా  వీటిని నేరుగా తిన‌వ‌చ్చు.
  1. ఇవి రక్త‌శుద్దికి దోహదం చేస్తాయి. హార్మోన్ల వ‌ల్ల వ‌చ్చే చిన్ని చిన్న స‌మ‌స్య‌ల‌ను దూరం చేస్తాయి. అదేవిధంగా కీళ్ల నొప్పులు, సీజనల్ వ్యాధులు, మల బద్ధకం, జీర్ణ సమస్యలు రాకుండా కాపాడ‌తాయి. దీనిలో యాంటీ వైరల్ గుణాలు కూడా ఉన్నాయి.
  1. ఈ సీమ చింతలో ఫైబ‌ర్ ఎక్కువ‌గా ఉంటుంది. జీర్ణ క్రియకు సహాయకారిగా పనిచేస్తుంది.
  1. సీమ చింతలో జ్ఞాప‌కశ‌క్తి పెంచే గుణాలు ఉన్నాయి. పచ్చివిగా ఉన్నప్పుడు కూడా తిన‌వ‌చ్చు. అయితే కొంచెం ప‌క్వానికి వ‌చ్చిన త‌ర్వాత తింటే చాలా రుచిగా ఉంటాయి. చాలా మంది వీటిని పచ్చళ్ల రూపంలో కూడా తీసుకుంటారు.
  1. డ‌యాబెటిస్ ఉన్నవారు తీసుకుంటే రక్తంలో చ‌క్కెర స్థాయిల‌ను అదుపులో ఉంచుతాయి. 
  1. ఈ సీమ‌చింత‌కాయ‌లను మ‌రిగించి ఆ నీటిని తాగితే డయేరియా వంటి వ్యాధుల‌ను అరిక‌ట్ట‌వ‌చ్చు.
  1. సీమ‌చింత‌లో ఉండే విట‌మిన్ ఎ కంటికి సంబంధించిన స‌మ‌స్య‌ల‌ను తగ్గిస్తుంది. కాక‌పోతే వీటిని గ‌ర్భిణులు, బాలింత‌లు తిన‌కుండా ఉంటే మంచిద‌ని నిపుణులు చెబుతున్నారు.

– లక్ష్మీ నెక్కల, ఫ్రీలాన్స్ జర్నలిస్ట్

Previous articleWeight Loss Tea: టీ తాగుతూ కూడా బ‌రువు త‌గ్గొచ్చనే విష‌యం మీకు తెలుసా!
Next articleNatu Kodi Pulao Recipe: నాటుకోడి పులావ్.. సింపుల్ రెసిపీ, స్పైసీ రుచి