US student visa: యూఎస్ స్టూడెంట్ వీసా ప్రాసెసింగ్..US courses

study in usa

US student visa process: అమెరికా వీసా తీసుకుని యూఎస్‌లో చదువుకోవాలనుకుని చాలా మందికి ఉంటుంది. అమెరికా వెళ్లి చదువుకోవటం ఒకప్పుడు ధనవంతులకు మాత్రమే సాకారమయ్యే కల. కానీ ఇప్పుడు ప్రపంచం ఒక గ్లోబల్ విలేజ్‌గా మారిపోవటం, శాస్త్ర, సాంకేతిక, వైద్య, పరిశోధనా రంగాల విస్తృతితో పాటు.. బ్యాంకు రుణాలు, స్కాలర్‌షిప్‌లు అందుబాటులోకి రావటంతో మధ్యతరగతి ప్రజలూ ఈ కలను సాకారం చేసుకోగలుగుతున్నారు. us student visa process వివరాలన్నీ తెలుసుకుని అమెరికాలో డిగ్రీ, పీజీ, పీహెచ్‌డీ కోర్సుల వివరాలు, అడ్మిషన్ల ప్రక్రియ, ఫీజులు, స్కాలర్‌షిప్‌లు, బ్యాంకు రుణాల వివరాలు స్థూలంగా డియర్ అర్బన్ మీ కోసం అందిస్తోంది.

Degree Courses in USA: ఇంటర్ తర్వాత అమెరికాలో డిగ్రీ కోర్సులు

ఇంటర్మీడియట్ లేదా ప్లస్ టు తర్వాత అమెరికాలో అండర్ గ్రాడ్యుయేట్ కోర్సుల్లో చేరవచ్చు. మనం బాచిలర్స్ డిగ్రీ అంటాం. అమెరికాలో అండర్ గ్రాడ్యుయేట్ డిగ్రీ కోర్సుల్లో భారత విద్యార్థులు అధికంగా ఇంజనీరింగ్ కోర్సులకు ప్రాధాన్యం ఇస్తారు.

భారతదేశంలో బీటెక్‌ అని వ్యవహరించే కోర్సులను అమెరికాలో బీఎస్‌ (బ్యాచిలర్ ఆఫ్  సైన్స్) కోర్సులుగా వ్యవహరిస్తారు.
విదేశీ విద్యార్థులు బీఏ, బీఎఫ్ఏ తదితర డిగ్రీ కోర్సుల్లోనూ చేరవచ్చు. ఇవన్నీ నాలుగేళ్ల డిగ్రీ కోర్సులు.

ఇంటర్ తర్వాత అమెరికాలో రెండేళ్ల అసోసియేట్ డిగ్రీ కోర్సులు కూడా ఉంటాయి. ఇవి ప్రధానంగా ఒకేషనల్ కోర్సులు. కమ్యూనిటీ కాలేజీలు ఈ కోర్సులు అందిస్తాయి. ఈ కోర్సులు పూర్తిచేసిన తర్వాత నాలుగేళ్ల డిగ్రీ కోర్సుల్లో చేరవచ్చు.

ప్రధానమైన నాలుగేళ్ల డిగ్రీ కోర్సులు ఇవీ:

  • Bachelor of Science (B.Sc.)
  • Bachelor of Arts (B.A.)
  • Bachelor of Fine Arts (B.F.A.)
  • Bachelor of Social Work (B.S.W.)
  • Bachelor of Engineering (B.Eng.)
  • Bachelor of Science in Public Affairs (B.S.P.A)
  • Bachelor of Science in Nursing (B.S.N.)
  • Bachelor of Philosophy (B.Phil.)
  • Bachelor of Architecture Degree (B.Arch.)
  • Bachelor of Design (B.Des.)

PG Courses in USA: డిగ్రీ తర్వాత అమెరికాలో పీజీ కోర్సులు

అండర్ గ్రాడ్యుయేట్ డిగ్రీ పూర్తయ్యాక గ్రాడ్యుయేట్ కోర్సుల్లో చేరవచ్చు. అంటే మనం పోస్ట్ గ్రాడ్యుయేట్ కోర్సులుగా వ్యవహరిస్తాం. అంటే మాస్టర్స్ డిగ్రీ కోర్సులు అన్నమాట.
USA లో మాస్టర్స్ కోర్సుల్లో చేరడానికి ఒక విద్యార్థి అండర్ గ్రాడ్యుయేట్ కోర్సు వరకూ 16 సంవత్సరాల పాటు చదివి ఉండాలి.

అయితే.. ఇండియాలో B.A., B.Com., B.Sc. లాంటి మూడేళ్ల బాచిలర్స్ కోర్సులు చేసినవారికి స్కూల్, ఇంటర్, డిగ్రీ కలిపి మొత్తం 15 సంవత్సరాల చదువు మాత్రమే ఉంటుంది. B.Tech, B.E., MBBS తదితర నాలుగేళ్ల బ్యాచిలర్ కోర్సులు చదివిన వారికైతే 16 సంవత్సరాల విద్యాభ్యాసం పూర్తవుతుంది.

నాలుగేళ్ల డిగ్రీ చేసిన వారు అమెరికాలో పీజీ చేరటానికి పెద్ద ఆటంకాలు ఉండవు. మూడేళ్ల డిగ్రీ చేసిన వారు USA లో Masters Degree లో అడ్మిషన్‌ పొందటానికి ఇంకొక సంవత్సరం ఏదైనా కోర్సు చేస్తుంటారు. అలాకాకుండా అమెరికాలోనే ఒక సంవత్సరం ప్రిపరేటరీ కోర్సు చేసి, ఆ తర్వాత మాస్టర్స్ డిగ్రీలో చేరటానికీ వీలు ఉంటుంది.

అమెరికాలో గ్రాడ్యుయేట్ కోర్సులు – అంటే ఎంఎస్, ఎంఏ, ఎంబీఏ వంటి పీజీ కోర్సులు సాధారణంగా రెండు సంవత్సరాల నిడివి గల కోర్సులు. జర్నలిజం వంటి విభాగాల్లో ఒక సంవత్సరం పీజీ కోర్సులు కూడా కొన్ని యూనివర్సిటీలు అందిస్తున్నాయి.

ప్రధానమైన పీజీ కోర్సులు ఇవీ:

  • Master of Arts (M.A.)
  • Master of Science (M.S.)
  • Master of Business Administration (M.B.A.),
  • Master of Law (LL.M.)
  • Master of Fine arts (M.F.A.)
  • Master of Social Work (M.S.W.)
  • Specialist in Education (Ed. S)

PhD courses in USA – పీజీ పూర్తయ్యాక అమెరికాలో పీహెచ్‌డీ

మాస్టర్స్ డిగ్రీ పూర్తయిన వారు డాక్టొరల్ కోర్సుల్లో చేరవచ్చు. వీటినే మనం పీహెచ్‌డీ కోర్సులుగా వ్యవహరిస్తాం. అయితే.. డిగ్రీ (అండర్ గ్రాడ్యుయేషన్) తర్వాత కూడా అమెరికాలో కొన్ని డాక్టొరల్ కోర్సుల్లో చేరేందుకు అవకాశం ఉంది. ఇందులో పీజీ, డాక్టొరల్ కోర్సులు కలిపి ఉంటాయి.

అమెరికాలో పీహెచ్‌డీ కోర్సులు పూర్తిచేయటానికి మూడేళ్లు అంతకన్నా ఎక్కువ పట్టొచ్చు. కొన్ని కోర్సులు ఐదు, ఆరు సంవత్సరాల వరకూ కొనసాగుతాయి.

IELTS, GRE, SAT – ఇతర అర్హత పరీక్షలు

అమెరికాలో డిగ్రీ, పీజీ, పీహెచ్‌డీ కోర్సుల్లో ప్రవేశం కోసం.. ఇంగ్లిష్ భాషలో నైపుణ్యాన్ని నిరూపించుకునే IELTS లేదా TOEFL వంటి టెస్టుల్లో నిర్ణీత స్కోరు సాధించటంతో పాటు ఆయా కోర్సుకు సంబంధించిన అర్హత పరీక్షల్లోనూ గట్టెక్కాల్సి ఉంటుంది.

డిగ్రీ కోర్సులకు SAT, ఇంజనీరింగ్, సైన్స్ కోర్సులకు GRE, ఎంబీఏ వంటి బిజినెస్ కోర్సులకు GMAT, న్యాయ విద్య కోసం LSAT, వైద్య విద్య కోసం MCAT పరీక్షలు రాసి అందులో కనీస అర్హత మార్కులు సాధించాల్సి ఉంటుంది. కొన్ని కోర్సులు, కాలేజీల్లో.. ఇతర టెస్టులు అవసరం లేకుండా కేవలం ఇంగ్లిష్ భాషలో ప్రావీణ్యత టెస్టుతోనే అడ్మిషన్లు ఇస్తారు.

US Universities and Fees – అమెరికా యూనివర్సిటీలు, ఫీజులు

అమెరికా యూనివర్సిటీల్లో ప్రధానంగా రెండు రకాలు ఉంటాయి. ఒకటి ప్రభుత్వ నిధులతో నడిచే యూనివర్సిటీలు, రెండోది ప్రైవేటు యూనివర్సిటీలు.
ప్రైవేటు యూనివర్సిటీలతో పోలిస్తే ప్రభుత్వ యూనివర్సిటీల్లో ఫీజులు తక్కువగా ఉంటాయి.

డిగ్రీ (అండర్ గ్రాడ్యుయేట్) కోర్సులకు.. ఎంచుకున్న కోర్సు, యూనివర్సిటీని బట్టి సంవత్సరానికి ఫీజులు 15,000 డాలర్ల నుంచి 40,000 డాలర్ల వరకూ ఉంటాయి.

పీజీ (గ్రాడ్యుయేట్) కోర్సులకు.. సంవత్సరానికి ఫీజులు 20,000 డాలర్ల నుంచి 40,000 డాలర్ల వరకూ ఉంటాయి.
పీహెచ్‌డీ (డాక్టొరల్) కోర్సులకు.. సంవత్సరానికి 25,000 డాలర్ల నుంచి 45,000 డాలర్ల వరకూ ఫీజులు ఉంటాయి.

Spring, Summer, Fall – ఏటా మూడు సార్లు అడ్మిషన్లు

అమెరికా యూనివర్సిటీలు, కాలేజీల్లో ప్రతి ఏటా మూడు సార్లుగా – స్ప్రింగ్ (జనవరి/ఫిబ్రవరి), సమ్మర్ (మే/జూన్), ఫాల్ (ఆగస్టు/సెప్టెంబర్) – అడ్మిషన్లు జరుగుతాయి. విద్యార్థులు వీటిలో దేనినైనా ఎంచుకోవచ్చు.

అయితే.. అమెరికా విద్యా సంవత్సరం ఆగస్టు లేదా సెప్టెంబర్‌లో మొదలవుతుంది. మే లేదా జూన్ వరకూ కొనసాగుతుంది. కాబట్టి ఎక్కువ మంది విద్యార్థులు ఫాల్ ఇన్‌టేక్‌లో చేరుతుంటారు.

సాధారణంగా ప్రపంచ వ్యాప్తంగా కూడా విద్యా సంవత్సరాలు ఏప్రిల్, మే నెలల్లో ముగుస్తుంటాయి. దీంతో అమెరికాలో ఫాల్‌ అడ్మిషన్లకు డిమాండ్ ఎక్కువగా ఉంటుంది. ఈ అడ్మిషన్లలోనే అధిక యూనివర్సిటీలు ఎక్కువ కోర్సులు ఆఫర్ చేస్తాయి.

అమెరికాలో కాలేజీల్లో తరగతులు మొదలవటానికి ఆరు నెలల ముందు అడ్మిషన్ల ప్రక్రియ మొదలవుతుంది. తరగతులు మొదలు కావటానికి మూడు నెలల ముందు ఈ ప్రక్రియ ముగుస్తుంది.

ఫాల్: ఆగస్టులో మొదలయ్యే కోర్సులకు జనవరి – ఏప్రిల్ మధ్య దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది.

స్ప్రింగ్: డిసెంబర్‌లో మొదలయ్యే కోర్సులకు జూన్ – సెప్టెంబర్ మధ్య దరఖాస్తు చేసుకోవాలి.

సమ్మర్: ఏప్రిల్‌లో మొదలయ్యే కోర్సులకు ముందు సంవత్సరం అక్టోబర్ నుంచి జనవరి వరకూ అడ్మిషన్ల ప్రక్రియ జరుగుతుంది.

ఏడాదిన్నర ముందు నుంచీ సన్నాహాలు us student visa process

అమెరికాలో చదువుకోవాలంటే us student visa అవసరం. అడ్మిషన్ల ప్రక్రియ పూర్తయ్యే సమయానికి ఒకటి, ఒకటిన్నర సంవత్సరాల ముందు నుంచే సన్నాహాలు చేసుకోవటం ఉత్తమం.
అంటే.. అమెరికాలో డిగ్రీ చేరాలనుకుంటే ఇంటర్ మొదటి సంవత్సరంలో / పదకొండో తరగతిలో ఉండగానే అందుకు సంబంధించిన కసరత్తు ప్రారంభించాలి. అదే మాస్టర్స్ కోర్సుల్లో చేరాలనుకుంటే డిగ్రీ రెండో సంవత్సరం లేదా మూడో సంవత్సరం నుంచే ఈ పనులు మొదలు పెట్టాలి.

అమెరికాలో చేరాలనుకున్న కోర్సులు, అవి అందిస్తున్న యూనివర్సిటీల జాబితాను తయారు చేసుకోవటం, అడ్మిషన్ అర్హతలను, ఫీజు వివరాలు, అందుబాటులో గల స్కాలర్షిప్‌లు, పూర్తి చేయాల్సిన టెస్టులను తెలుసుకుని సన్నద్ధం కావటం ముఖ్యం.

ఏవైనా సందేహాలు ఉన్నట్లయితే సదరు యూనివర్సిటీలను నేరుగా సంప్రదించి నివృత్తి చేసుకోవచ్చు కూడా. అందుకోసం దాదాపు ప్రతి యూనివర్సిటీలోనూ స్టూడెంట్ రిలేషన్స్ విభాగం ఉంటుంది.

అమెరికా విద్య – స్కాలర్‌షిప్‌లు US Education – scholarships

అమెరికా వర్సిటీల్లో అండర్ గ్రాడ్యుయేట్ కోర్సుల్లో ప్రవేశం పొందిన విద్యార్థులకు ఆయా ఇన్‌స్టిట్యూట్‌లు, ఎడ్యుకేషన్ ట్రస్ట్‌లు పలు స్కాలర్‌షిప్ సదుపాయాలను కల్పిస్తున్నాయి.
అమెరికాలో చదువుకునే భారతీయ విద్యార్థులకు ఆర్థికంగా సాయం అందించే పలు స్కాలర్‌షిప్‌లు ఉన్నాయి. ఈ స్కాలర్‌షిప్‌లు రెండు రకాలుగా ఉంటాయి.

పూర్తి స్కాలర్‌షిప్ full scholarship: విద్యార్థి కాలేజీ ఫీజు, అమెరికాలో నివాస, భోజన ఖర్చులు, పుస్తకాల ఖర్చులు పూర్తిగా అందించే స్కాలర్‌షిప్‌లు.

పాక్షిక స్కాలర్‌షిప్: కేవలం కాలేజీ ఫీజు మాత్రమే చెల్లించటం, లేదంటే ఫీజులో కొంత భాగం అందించే స్కాలర్‌షిప్‌లు. మిగతా భాగాన్ని విద్యార్థి చెల్లించాల్సి ఉంటుంది.

అండర్ గ్రాడ్యుయేట్ (డిగ్రీ) విద్యార్థుల కోసం స్కాలర్‌షిప్‌లు:

InlaksShivdasani Foundation Scholarships:

ఉత్తర అమెరికా అంటే యూఎస్ఏ, కెనడాలతో పాటు యూరప్ దేశాల్లో చదువుకోవటానికి అద్భుత ప్రతిభ గల భారత విద్యార్థులకు ఈ స్కాలర్‌షిప్ అందిస్తారు.

విద్యార్థులు గరిష్టంగా 1,00,000 డాలర్ల వరకూ స్కాలర్‌షిప్ పొందటానికి అవకాశం ఉంది. అయితే.. ఇంజనీరింగ్, కంప్యూటర్ సైన్స్, బిజినెస్ స్టడీస్, మెడిసిన్, పబ్లిక్ హెల్త్, ఫ్యాషన్ డిజైన్, మ్యూజిక్, ఫిల్మ్ యానిమేషన్ కోర్సులకు ఈ స్కాలర్‌షిప్ లభించదు. వివరాలకు ఈ వెబ్ సైట్ సందర్శించవచ్చు.

Fulbright-Nehru Research Fellowship: 

అమెరికాలో గుర్తింపు పొందిన కాలేజీలు, యూనివర్సిటీల్లో మాస్టర్స్ డిగ్రీ చదవటానికి అద్భుత ప్రతిభ గల విద్యార్థులకు ఈ ఫెలోషిప్ అందిస్తారు.

ఆర్ట్స్, కల్చర్ మేనేజ్‌మెంట్, ఎన్విరాన్‌మెంటల్ సైన్స్, ఇంటర్నేషనల్ లీగల్ స్టడీస్, పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్, పబ్లిక్ హెల్త్, అర్బన్ అండ్ రీజనల్ ప్లానింగ్, వుమన్స్ స్టడీస్/జండర్ స్టడీస్ కోర్సులకు కూడా ఈ ఫెలోషిప్ లభిస్తుంది.

అయితే.. ఈ ఫెలోషిప్ కోసం దరఖాస్తు చేసుకునే అభ్యర్థులకు కనీసం మూడు సంవత్సరాల ప్రొఫెషనల్ వర్క్ ఎక్స్‌పీరియన్స్ ఉండాలి. కోర్సు పూర్తయిన తర్వాత స్వదేశానికి తిరిగివచ్చి తమ సమాజానికి సేవలు అందించటానికి నిబద్ధులై ఉండాలి.

కోర్సు ఫీజులతో పాటు, ప్రయాణ, నివాస, ఆహార, ఆరోగ్య ఖర్చులను ఈ ఫెలోషిప్ కింద అందిస్తారు. వివరాల కోసం ఈ వెబ్ సైట్ సందర్శించండి.

The Hubert H. Humphrey Fellowship Programme

అభివృద్ధి చెందుతున్న దేశాలకు చెందిన కెరీర్‌లో యువ, మధ్య స్థాయి ప్రొఫెషనల్స్.. అమెరికాలో డిగ్రీయేతర గ్రాడ్యుయేట్ చదువు కోసం ఈ ఫెలోషిప్ అందిస్తారు. ఇది పది నెలల పాటు ఉంటుంది.

అగ్రికల్చరల్ అండ్ రూరల్ డెవలప్‌మెంట్, కమ్యూనికేషన్స్/జర్నలిజం, ఎకానమిక్ డెవలప్‌మెంట్, ప్లానింగ్ అండ్ పాలసీ, ఫైనాన్స్ అండ్ బ్యాంకింగ్, హ్యూమన్ రిసోర్స్ మేనేజ్‌మెంట్, లా అండ్ హ్యూమన్ రైట్స్, ఎన్విరాన్‌మెంటల్ పాలసీ, క్లైమేట్ చేంజ్, ఇంగ్లిష్ టీచింగ్ తదితర పలు రంగాల్లో విద్యకు ఈ ఫెలోషిప్‌లు అందిస్తారు. సంబంధిత వివరాల కోసం ఈ వెబ్ సైట్ సందర్శించండి.

Stanford Reliance Dhirubhai Fellowships for Indian Students

రిలయన్స్ ఇండస్ట్రీస్ సంస్థ స్టాన్ఫర్డ్ జీసీబీతో కలిసి ఈ ఫెలోషిప్‌ను స్థాపించింది. అర్హులైన భారత విద్యార్థులు స్టాన్ఫర్డ్ గ్రాడ్యుయేట్ బిజినెస్ స్కూల్‌లో చదువుకోవటానికి దీనిని అందిస్తారు.
ఏటా ఐదు ఫెలోషిప్‌ల వరకూ అందిస్తారు. రెండేళ్ల ఎంబీఏ కోర్సు ట్యూషన్ ఫీజు, అనుబంధ ఫీజులు చెల్లిస్తారు. కోర్సు పూర్తయిన తర్వాత విద్యార్థులు భారతదేశం తిరిగివచ్చి ఏదైనా భారతీయ సంస్థలో పని చేయాల్సి ఉంటుంది. సంబంధిత వెబ్ సైట్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

అందుబాటులో ఉన్న మరికొన్ని స్కాలర్‌షిప్‌లు, ఫెలోషిప్‌లు…

  • AEF Scholarship
  • American University Emerging Global Leader Scholarship
  • Asian Women in Business Scholarship Fund
  • Chicago Booth School of Business
  • Cornell University Tata Scholarship
  • Gunvant and Bharati Parekh College Scholarship Award
  • LSEF – UMass Scholarship
  • Matt Fong Asian Americans in Public Finance Scholarship
  • Rotary Foundation Ambassadorial Scholarship
  • N. Bose Scholars Student Exchange Program for Indian Students
  • SEED Foundation Scholarship
  • Upakar Indian Scholarship Foundation

టీచింగ్ అసిస్టెంట్‌షిప్…

భారత విద్యార్థులు ఇంటలిజెంట్ అని కష్టపడతారని, ఇంగ్లిష్ మీద మంచి పట్టు ఉంటుందని అమెరికా యూనివర్సిటీలు భావిస్తాయి. కాబట్టి భారత విద్యార్థులు.. అమెరికా వర్సిటీల్లో టీచింగ్ అసిస్టెంట్‌షిప్ పొందే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. అంటే.. టీచింగ్ అసిస్టెంట్‌ (టీఏ)గా ఎంపికైన విద్యార్థులు తమ ప్రొఫెసర్లకు విద్యకు సంబంధించిన విషయాల్లో సాయం చేస్తారు. ఇది సంవత్సర కాలం ఉంటుంది.

F-1 వీసా -పార్ట్-టైమ్ వర్క్ పర్మిట్ us student visa process

us student visa process: అమెరికా యూనివర్సిటీల్లో చేరిన విదేశీ విద్యార్థులకు F-1 స్టూడెంట్ వీసా us student visa జారీ చేస్తారు. వీరు అమెరికాలో పార్ట్ టైమ్ పని చేసుకోవటానికి అనుమతి ఉంటుంది. చాలా మంది విదేశీ విద్యార్థులు తమ ఖర్చులకు అవసరమైన మొత్తాన్ని సంపాదించుకోవటానికి ఈ అవకాశాన్ని ఉపయోగించుకుంటారు. అయితే ఇందుకు కొన్ని నిబంధనలు, పరిమితులు ఉన్నాయి.

విద్యార్థిగా ఉన్నవారికి వర్క్ పర్మిట్ కావాలంటే కనీసం 18 ఏళ్ల వయసు నిండాలి. విదేశీ విద్యార్థులు.. కోర్సులు కొనసాగే కాలంలో వారానికి గరిష్టంగా 20 గంటల పాటు క్యాంపస్‌లో పనిచేసేందుకు అనుమతి ఇస్తారు. వేసవి సెలవుల వంటి ఖాళీ సమయాల్లో పూర్తి కాలం పని చేసుకోవటానికి అనుమతి ఉంటుంది. క్యాంపస్ వెలుపల పనిచేయటానికి పర్మిట్ కావాలంటే.. ఏడాది కాలం పూర్తయిన తర్వాత ప్రత్యేక అనుమతులు పొందాల్సి ఉంటుంది.

F-1 వీసాను అమెరికా రాయబార కార్యాలయాలు, కాన్సులేట్ కార్యాలయాలు జారీ చేస్తాయి. ఈ వీసా పొందాలంటే us student visa requirements ముందుగా అమెరికా యూనివర్సిటీలో అడ్మిషన్ సంపాదించుకోవాలి. ఆ యూనివర్సిటీ అడ్మిషన్ ఇచ్చిన విద్యార్థికి సెవిస్ (SEVIS – స్టూడెంట్ అండ్ ఎక్సేంజ్ విజిటర్ ఇన్ఫర్మేషన్ సిస్టమ్) నంబరు కేటాయిస్తుంది.

ఆ వివరాలతో అమెరికా డిపార్ట్‌మెంట్ ఆఫ్ హోంల్యాండ్ సెక్యూరిటీ విభాగానికి సెవిస్ ఫీజు చెల్లించాలి. ఆ మొత్తం వివరాలతో అమెరికా ఎంబసీ లేదా కాన్సులేట్‌లో F-1 వీసా కోసం దరఖాస్తు చేసుకోవాలి. ఈ దరఖాస్తుదారులను రాయబార కార్యాలయ అధికారులు ఇంటర్వ్యూకు (us student visa slot booking) పిలుస్తారు.

us student visa interview ఇంటర్వ్యూ సమయంలో విద్యార్థి పాస్‌పోర్టు, పదో తరగతి, ఇంటర్మీడియట్, డిగ్రీ చదువులకు సంబంధించిన మార్కుల సర్టిఫికెట్లు, ఉత్తీర్ణత సర్టిఫికెట్లు, అమెరికా కాలేజీలో అడ్మిషన్ పత్రాలు, GRE/GMAT/SAT స్కోర్ కార్డులు, IELTS/TOEFL/PTE స్కోర్‌ కార్డులు, లోన్ అప్రూవల్ పత్రాలు, బ్యాంకు సేవింగ్స్ అకౌంట్‌ స్టేట్‌మెంట్, వర్తించేట్లయితే వర్క్ ఎక్స్‌పీరియన్స్ సర్టిఫికెట్లు, సాలరీ స్లిప్‌లు కూడా చూపించాల్సి ఉంటుంది. అన్నీ సక్రమంగా ఉన్నాయని నిర్ధారించుకుని F-1 వీసా మంజూరు చేస్తారు. us student visa interview questions లో ముఖ్యంగా మీ అమెరికా సందర్శన ఉద్దేశం, మీ విద్యార్హతలు, మీరు చేరుకునేందుకు ఎంచుకున్న విధానం తదితర అంశాలపై పరోక్షంగా ప్రశ్నలు ఉంటాయి.

డిపెండెంట్ల కోసం F-2 వీసా us student visa process

అమెరికా యూనివర్సిటీల్లో చదువుకునే విద్యార్థులు.. తమపై ఆధారపడిన తమ జీవిత భాగస్వామిని, 21 ఏళ్ల లోపు వయసున్న అవివాహిత పిల్లలను F-2 వీసాతో తమతో పాటు అమెరికా తీసుకెళ్లటానికి వీలుంటుంది. విద్యార్థి F-1 వీసాతోను, అతడు లేదా ఆమె మీద డిపెండెంట్లు F-2 వీసాతోను అమెరికాకు ప్రయాణం చేయవచ్చు. కానీ F-1 వీసాదారుల కన్నా ముందుగా అతడి మీద డిపెండెంట్లు F-2 వీసాతో అమెరికాలో అడుగుపెట్టటానికి వీలుండదు.

F-2 వీసాతో వచ్చిన వారికి అమెరికాలో పని చేయటానికి కానీ, చదువుకోవటానికి కానీ అనుమతి ఉండదు. సోషల్ సెక్యూరిటీ నంబర్ కూడా లభించదు. అలా వచ్చిన వారు ఏదైనా కోర్సులో చేరాలంటే తమ వీసా హోదాను F-1 హోదాకు మార్చుకోవాల్సి ఉంటుంది.

అందుకోసం కాలేజీ అడ్మిషన్ పొంది స్వదేశానికి వెళ్లి అక్కడి అమెరికా ఎంబసీ, కాన్సులేట్ కార్యాలయంలో F-1 వీసా కోసం దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. ఎందుకంటే.. F-1 వీసా ఇచ్చే అధికారం విదేశాల్లోని అమెరికా ఎంబసీలు, కాన్సులేట్లకు మాత్రమే ఉంటుంది. అమెరికాలో మరే ప్రభుత్వ సంస్థా ఈ వీసాలు జారీ చేయటానికి అధికారం లేదు.

Education Loans – విదేశాల్లో చదువుకోవటానికి విద్యా రుణాలు

అమెరికా వంటి విదేశాల్లో ఉన్నత విద్యాభ్యాసం కోసం విద్యా రుణాలు కూడా అందుబాటులో ఉన్నాయి. హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్, స్టేట్‌ బ్యాంక్ ఆఫ్ ఇండియా, యాక్సిస్ బ్యాంక్, పంజాబ్ నేషనల్ బ్యాంక్, కెనరా బ్యాంక్, బ్యాంక్ ఆఫ్ బరోడా, ఐడీబీఐ బ్యాంకులు విదేశీ చదువుల కోసం గరిష్టంగా రూ. 20 లక్షల నుంచి రూ. 40 లక్షల వరకూ విద్యా రుణాలు అందిస్తున్నాయి.

విద్యార్థి భారతీయ పౌరుడై ఉండాలి. విద్యార్థి వయసు 18 సంవత్సరాల నిండితే ఆ విద్యార్థి పేరుతోనే రుణం మంజూరు అవుతుంది. లేదంటే విద్యార్థి తల్లిదండ్రులు రుణం తీసుకోవాల్సి ఉంటుంది.

పూర్తి కాలపు కోర్సులకు రుణాల కోసం తల్లిదండ్రులు కానీ, తోబుట్టువులు కానీ, ఇతర కుటుంబ సభ్యులు కానీ సహ-దరఖాస్తుదారులుగా ఉండాలి.

అలాగే 18 ఏళ్ల నుండి 35 ఏళ్ల వయసు వరకూ గల విద్యార్థులు విద్యా రుణాలు పొందవచ్చు. గుర్తింపు పొందిన కాలేజీ లేదా యూనివర్సిటీలో అడ్మిషన్ సంపాదించి ఉండాలి.

మేనేజ్‌మెంట్, ఇంజనీరింగ్, మెడిసిన్, ఆర్ట్స్, ఆర్కిటెక్చర్, సైన్స్, హోటల్ మేనేజ్‌మెంట్ తదితర కోర్సుల్లో అండర్ గ్రాడ్యుయేట్, పోస్ట్ గ్రాడ్యుయేట్ విద్యకు రుణాలు పొందవచ్చు. అయితే.. ఉద్యోగ అవకాశం అధికంగా ఉండే టెక్నికల్, ప్రొఫెషనల్ కోర్సులకు బ్యాంకులు ప్రాధాన్యం ఇస్తాయి.

కాలేజీ ఫీజులు, ఎగ్జామ్ ఫీజులు, ల్యాబ్, లైబ్రరీ ఫీజులు, ప్రయాణ ఖర్చులు, పుస్తకాలు, పరికరాలు, స్టడీ టూర్లకు అయ్యే ఖర్చులు మొత్తం ఈ విద్యా రుణాల్లో కవర్ అవుతాయి.

అయితే.. రుణ గ్రహీతలు మొత్తం ఫీజులో 5 శాతం నుంచి 15 శాతం వరకూ మార్జిన్ మనీగా సమకూర్చాల్సి ఉంటుంది. బ్యాంకులు సాధారణంగా మారటోరియం పీరియడ్‌తో కలిపి ఏడు సంవత్సరాల నిడివితో రుణాలు మంజూరు చేస్తాయి.

సాధారణంగా.. విద్యా రుణం రూ. 4 లక్షల లోపు ఉంటే ఎటువంటి గ్యారంటీ చూపాల్సిన అవరసం లేదు. అదే రూ. 4 లక్షల నుంచి రూ. 7.5 లక్షల వరకూ ఉంటే కొన్ని బ్యాంకులు థర్డ్ పార్టీ ష్యూరిటీ అడుగుతాయి. అంతకు మించిన రుణాలకు తగిన విలువ గల స్థిర, చరాస్తులు ఏవైనా తనఖా పెట్టాల్సి ఉంటుంది.

మరిన్ని వివరాల కోసం అమెరికా ప్రభుత్వం నడుపుతున్న ఎడ్యుకేషన్ యూఎస్ఏ వెబ్‌సైటును ఎప్పటికప్పుడు చూస్తుండవచ్చు.

Previous articleమేథావులుగా పుడతారా? తయారవుతారా?
Next articleనెట్‌ఫ్లిక్స్ స్పానిష్ మూవీ: సండేస్ ఇల్‌నెస్‌ : రామోన్ సాలజార్ అద్భుత సృష్టి