The Coalition Years 1996-2012 : ప్రణబ్ ముఖర్జీ అక్షరీకరణ

Pranab Mukherjee
The President Dr. A.P. J. Abdul Kalam administering the oath as Cabinet Minister to Shri Pranab Mukherjee at a Swearing-in Ceremony in New Delhi on May 22, 2004

‘సంకీర్ణ సంవత్స‌రాలు 1996-2012 (The Coalition Years 1996-2012)’ పుస్త‌కం మాజీ రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ సంకీర్ణ ప్రభుత్వాలపై అక్షరీకరించిన పుస్తకం. సంకీర్ణ ప్ర‌భుత్వం న‌డ‌ప‌టంలో ఉన్న క‌ష్ట‌, నష్టాలు.. స‌మ‌స్య‌లు, స‌వాళ్లను సౌష్టవంగా ఆవిష్క‌రించారు ప్రణబ్ ముఖర్జీ. ఆయన రాసిన 8 పుస్తకాల్లో చివరి పుస్తకం ఇది. 2017లో ప్రచురితమైంది.

భారత రాజ‌కీయ య‌వ‌నిక‌పై వృద్ధ పార్టీగా పేరుగాంచిన‌ కాంగ్రెస్‌లో 1964 నుంచి ఆయ‌న కొన‌సాగారు. ఇటు పార్టీలో.. అటు పార్ల‌మెంట్‌లో త‌న‌కంటూ ఒక ప్ర‌త్యేక స్థానాన్నిఅతి త‌క్కువ స‌మ‌యంలోనే సంపాదించారు ప్ర‌ణ‌బ్‌.

బంగ్లాదేశ్ స‌రిహ‌ద్దు క‌లిగిన రాష్ట్ర‌మైన ప‌శ్చిమ బెంగాల్‌లో చిన్న మారుమూల గ్రామంలోని ఒక పెంకుటిల్లులో మొద‌లైన త‌న జీవితం భార‌త‌దేశంలోనే అత్యున్నత స్థాయి అధికారిక నివాసం (రాష్ట్ర‌ప‌తి భ‌వ‌న్‌)లో గ‌డిపే స్థాయికి ఎదిగిన తీరుతెన్నులు వివ‌రించారు.

చివ‌రి వ‌ర‌కు ప్ర‌ధాని ప‌ద‌వికి ఆశ‌ప‌డి అవ‌కాశం కోల్పోయాన‌న్న నిరాశ త‌ప్ప త‌న‌కంటూ జీవితంలో పెద్ద‌గా అసంతృప్తి ఏమి లేద‌ని ప‌రోక్షంగా చెప్పుకొచ్చారు. మొత్తానికి త‌న జీవితాన్ని రాష్ట్ర‌ప‌తి అనే రాజ్యాంగ ప‌దవితో సంతృప్తి ప‌రుచుకున్నాన‌ని పేర్కొన్నారు.

భార‌త పార్ల‌మెంట్‌ను ఆయ‌న ఎప్పుడూ గంగోత్రితో పోలుస్తారు. సుమారు 135 కోట్ల ప్ర‌జల ఆకాంక్షలను నెరవేర్చే ప‌విత్ర వేదిక‌గా శాస‌న ‌వ్య‌వ‌స్థను ప్ర‌ణ‌బ్ అభివ‌ర్ణించారు. అయితే, ఇది ఎప్పుడైతే అప‌విత్ర‌మైవుతుందో.. అప్పుడు దాని విభాగాలు ప‌విత్రంగా ఉంటాయ‌ని మ‌నం ఎంత‌మాత్రం ఆశించ‌లేమ‌ని అంటారు.

తాను రాజ్య‌స‌భ స‌భ్యుడిగా ఎన్నికైన తొలినాళ్ళ‌లో ఒక అంశంపై సీపీఐ సీనియ‌ర్ ఎంపీ భూపేష్ గుప్తాకు కోపంగా స‌మాధానం ఇవ్వ‌డంతో అప్ప‌టి ప్రధాని ఇందిరా గాంధీ త‌నకు పెద్ద క్లాస్ ఇచ్చార‌ని వాపోయారు. అంత సీనియ‌ర్ స‌భ్యుడితో అలా అమ‌ర్యాద‌గా మాట్లాడ‌టం స‌రికాద‌ని ఆమె అన్నారట.

త‌ర్వాత భూపేశ్ గుప్తా చెంత‌కి క్ష‌మాప‌ణ‌కి వెళితే… లైట్ తీసుకో ప్ర‌ణ‌బ్ అనడంతో మ‌న‌సు తేలికైందని చెప్పి తాను ఎంత సున్నిత మ‌న‌స్కుడో వివ‌రించే ప్ర‌య‌త్నం చేశారు.

పార్టీలో పీవీ త‌ర్వాత అధ్య‌క్షుడిగా నియ‌మితులైన సీతారాం కేస‌రి గురించి ప్ర‌త్యేకంగా కొన్ని విష‌యాలు చెప్పుకొచ్చారు. పార్టీ అధినేత ప‌ద‌వి చేప‌ట్ట‌డం కంటే ముందు ఆయ‌న కేవ‌లం జాతీయ కాంగ్రెస్ కోశాధికారిగా ఉన్నార‌ని, ఎలాంటి చ‌రిష్మాటిక్ లీడ‌ర్ కాద‌ని అన్నారు. పీవీ ఆశీస్సుల‌తోనే ఆయ‌న‌కు అధినేతగా అవ‌కాశం దక్కినట్టు చెప్పారు.

కేస‌రిని ఆ ప‌ద‌వి నుంచి త‌ప్పించి సోనియాను పార్టీలోకి తీసుకురావ‌డంతో సీడ‌బ్ల్యూసీ(కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ)లో త‌న పాత్ర ఏమిట‌న్న‌ది వివ‌రించారు. అయితే, ఈ అంశంపై కేస‌రి త‌నను కుట్ర‌దారుడిగా ఆరోపించార‌ని కూడా ప్ర‌స్తావించారు.

సోనియా పార్టీలోకి వ‌చ్చిన త‌ర్వాత ఆమె మాట‌ల‌కి తిరుగులేద‌ని, ఆమె సార‌థ్యంలో 1998, 99 ఎన్నిక‌ల్లో పార్టీ ప‌రాజ‌యమైన‌ప్ప‌టికీ రాజ‌కీయ ఉనికిని కాపాడ‌టంలో సోనియా ఉప‌యోగ‌ప‌డ్డార‌ని అభిప్రాయం వ్య‌క్తం చేశారు. ఇక 2004 లోక్‌స‌భ ఎన్నికలు కాంగ్రెస్ పార్టీ, త‌న‌కి వ్య‌క్తిగతంగా ఎంతో ప్రాముఖ్య‌త క‌లిగినవని చెప్పుకొచ్చారు.

ఈ ఎన్నికల్లో పార్టీ అధికారంలోకి రావ‌డ‌మే కాక‌, తాను కూడా మొద‌టిసారి ప‌శ్చిమ బెంగాల్‌లోని జంగీపూర్ నుంచి లోక్‌స‌భ స‌భ్యుడు అయిన‌ట్టు చెప్పారు.

ప్రధాన మంత్రి పదవిపై ఉత్కంఠ

2004లో పార్టీ గెలిచిన త‌ర్వాత ప్ర‌ధాని సోనియా అవుతార‌ని అంద‌రూ ఊహిస్తే, ఆమె త‌న అంత‌ర్‌వాహిన చెప్పిన ప్ర‌కారం పద‌వి స్వీక‌రించ‌న‌ని చెప్ప‌డంతో మ‌ళ్ళీ ప్ర‌ధాని ఎవ‌రు అవుతార‌ని ఎదురు చూశారు. త‌న పేరు తెర‌పైకి వ‌స్తుందంటే… త‌న పేర‌ని ఆ రెండు, మూడు రోజులు అందరు కాంగ్రెస్ సీనియ‌ర్లు ఎప్పుడూ పార్టీ అధినేత్రి నుంచి పిలుపు వ‌స్తుందో అని ఎదురు చూసిన సంద‌ర్భాన్ని ఆయ‌న అద్భుతంగా వ‌ర్ణించారు.

కాంగ్రెస్ పార్టీలో, ప్ర‌భుత్వంలో ఆ త‌రుణంలో సోనియా, ఇత‌ర నాయ‌కుల కంటే కంటే కూడా అత్య‌ధిక అనుభవం ఉన్న వ్య‌క్తి ప్ర‌ణ‌బ్ ముఖ‌ర్జీయే. ఆయ‌నే త‌దుప‌రి ప్ర‌ధాని అని ఇటు మీడియాలో అటు రాజ‌కీయ‌వ‌ర్గాల్లో చ‌ర్చ జ‌ర‌గ‌గా, ఆమె మాత్రం మాజీ బ్యూరోక్రాట్‌, పూర్వ ఆర్థిక మంత్రి మ‌న్మోహ‌న్ సింగ్‌ను ఎంపిక చేయ‌డం ప్ర‌ణ‌బ్‌ ముఖర్జీకి అవ‌మానంగా అనిపించింద‌ట‌. తాను ఆర్థిక మంత్రిగా ఉండ‌గా ఆర్బీఐ గ‌వ‌ర్న‌ర్‌గా ఉన్న వ్య‌క్తి కింద తాను మ‌ళ్ళీ మంత్రిగా ఉండ‌టం ఏంట‌న్న ఆలోచన ఆయ‌నను ఇబ్బందికి గురయ్యేలా చేసిందట.

ఇదే విష‌యాన్ని ఆయ‌న సోనియా గాంధీకి చెప్పి తాను ఏ శాఖ  మంత్రిగా ప్ర‌భుత్వంలో చేర‌న‌ని నిట్టూర్చారు. అయితే, ఆయ‌నను శాంత‌ప‌రిచేందుకు సోనియా గాంధీ ఎంత క‌ష్టపడ్డారో.. ప్ర‌ణ‌బ్‌జీ మీరే ఈ ప్ర‌భుత్వంలో నెంబ‌ర్ 2 గా ఉంటార‌ని, మ‌న్మోహ‌న్ ప్ర‌ధాని అయిన‌ప్ప‌టికీ ప్ర‌తి విష‌యాన్ని మిమ్మ‌ల్ని సంప్ర‌దిస్తార‌ని చెప్ప‌డంతో ప్ర‌భుత్వంలో చేరేందుకు ఒప్పుకున్నార‌ట‌.

అయితే, మ‌న్మోహ‌న్ కింద తాను ఆర్థిక మంత్రిగా ప‌ని చేయ‌న‌న్న‌ ఒక ష‌ర‌తు మాత్రం పెట్టార‌ట. అందుకు ఆమె కూడా స‌రేన‌ని, ర‌క్ష‌ణ శాఖ మంత్రిగా చేరార‌ట‌. ఇక యూపీఏ భాగ‌స్వామ్య‌ప‌క్షాల‌తో మాట్లాడాల్సిన‌ ప‌ని త‌న‌పైనే అధినేత్రి పెట్టార‌న్నారు.

క‌నీసం ఐదు ఎంపీలు క‌లిగిన పార్టీలకు కేంద్ర‌మంత్రి వ‌ర్గంలో చోటు ఇద్దామ‌ని నిర్ణ‌యించగా, కొంత‌మంది కీల‌క భాగ‌స్వాములకు ఐదుగురు ఎంపీలు లేన‌ప్ప‌టికీ మంత్రులుగా అవ‌కాశం ఇవ్వాల్సి వ‌చ్చింద‌న్నారు.

కేసీఆర్ గురించి ప్రణబ్ ఏం చెప్పారు..

ముఖ్యంగా ప్ర‌స్తుత తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ గురించి ప్ర‌ణ‌బ్ ప్ర‌త్యేకంగా రాసుకున్నారు. యూపీఏ భాగ‌స్వాములైన ఇతర పార్టీల నేత‌లంతా త‌మకు ఈ మంత్రి ప‌ద‌వి కావాలని… తమ రాష్ట్రానికి ఇన్ని నిధులు ఇవ్వాలని గ‌ట్టిగా డిమాండ్ చేస్తుండ‌గా… టీఆర్ఎస్ నేత చంద్ర‌శేఖ‌ర్‌రావు మాత్రం త‌న‌కు ఏ మంత్రి ప‌ద‌వి ఇచ్చినా ప‌ర్వాలేద‌ని.. త‌న డిమాండుపై మాత్రం సానుకూలంగా స్పందించి ప్ర‌త్యేక రాష్ట్రం ఇవ్వాల‌ని చెప్పార‌ట‌.

అప్పుడే తెలంగాణ పట్ల కేసీఆర్ చిత్త‌శుధ్ధి ఏంటో త‌న‌కు అర్థం అయింద‌ని ప్ర‌ణ‌బ్ ప్ర‌త్యేకంగా రాసుకున్నారు. ఇదంతా ఇలా జ‌రుగుతుండ‌గానే ప్ర‌మాణ‌స్వీకారానికి క్ర‌మంగా ఎవ‌రిని కూర్చోబెట్టాల‌న్న‌దానిపై కూడా సంకీర్ణ ప‌క్షాల‌తో పెద్ద స‌మ‌స్య‌గా ఉంటుంద‌న్నారు. ప్ర‌ధాని మొద‌టి స్థానంలో ఉండ‌గా, రెండో స్థానం ఖచ్చితంగా హోంమంత్రి లేదా ర‌క్ష‌ణ శాఖ లేదా ఆర్థిక శాఖ లేదా విదేశాంగ శాఖ మంత్రి ఉంటారు.

కానీ, తాను రెండో స్థానం కాగా మూడో స్థానంలో హోంమంత్రికి ఇవ్వాల్సి ఉంటుంది. మూడో స్థానం మాత్రం త‌మ‌కే కావాల‌ని శ‌ర‌ద్ ప‌వార్‌, లాలూ ప‌ట్టుబ‌ట్టారు. ఈ విష‌యాన్ని తేల్చేందుకు కూడా కొన్ని రోజులు ప‌ట్టిందంటే అతిశ‌యోక్తి కాదు.

గ‌త‌ సాంప్ర‌దాయంలో భాగంగా అప్ప‌టి హోంమంత్రి శివ‌రాజ్ పాటిల్‌కు ఇవ్వ‌గా మూడో స్థానం మాత్రం శ‌ర‌ద్ ప‌వార్‌, నాలుగో స్థానం లాలూ ప్ర‌సాద్‌కు ఇచ్చి… ఇద్ద‌రు మాజీ సీఎంల‌ను ప‌క్క‌ప‌క్క‌నే కూర్చోబెడుతున్నాన‌ని చెప్ప‌డంతో వారంతా న‌వ్వుతూ ఆమోదించార‌న్నారు.

ప్ర‌భుత్వ పాల‌న ప్రారంభ‌మైన త‌ర్వాత ప్ర‌తి భాగ‌స్వామ్యప‌క్ష నేత‌లు వ‌చ్చి నిధులు కావాల‌ని… లేదంటే ప్ర‌భుత్వం నుంచి బ‌య‌ట‌కి వెళ‌తామ‌ని బెదిరించ‌డం ప్రారంభించిన‌ట్టు ఆవేద‌న వ్య‌క్తం చేశారు. వాటిని ప‌రిష్క‌రించేందుకు చేసిన ప‌నులను ఆయ‌న స‌వివ‌రంగా చెప్ప‌డంలో సంకీర్ణంలో ఉన్న స‌మ‌స్య‌లు అర్థం అవుతాయి.

ఇక అమెరికాతో న్యూక్లియ‌ర్ డీల్ విష‌యంలో వామ‌ప‌క్ష పార్టీతో ఏర్ప‌డిన ఇబ్బందుల‌ను కూడా ఆయ‌న వివ‌రించారు. ఈ విష‌యంలో అప్ప‌టి సీపీఐ(ఎం) ప్ర‌ధాన కార్య‌ద‌ర్శి ప్ర‌కాశ్ కార‌త్ త‌న కేర‌ళ పార్టీ నేత‌ల ప్ర‌భావంతో మొండిగా వ్య‌వ‌హ‌రించార‌ని వ్యాఖ్యానించారు.

ఆ ఒప్పందం వ‌ల్ల ఎదుర‌య్యే లాభాల‌ను ఆయ‌న క‌నీసం ప‌రిశీలించ‌కుండా మంకుప‌ట్టుతో ఉండ‌టం త‌న‌కి ఇబ్బంది అనిపించిందని ఉద్ఘాటించారు. సుమారు 11 సార్లు ఇదే అంశంపై లెఫ్ట్ నేత‌ల‌తో స‌మావేశం జ‌రిగిన‌ప్ప‌టికీ ఫ‌లితం శూన్యం అయింద‌ని ఆందోళ‌న వ్య‌క్తం చేశారు.

దీనివ‌ల్ల లాభం లేద‌ని వామ‌ప‌క్షాలకు ఏదో ఒక తెగేసి చెప్పాల‌ని పార్టీ అధినేత్రికు చెప్పేయ‌గా, ఆమె మిగ‌తా కార్య‌క్ర‌మంపై దృష్టి పెట్టిన‌ట్టు వివరించారు.

పీఏ సంగ్మా గురించి..

2007లో రాష్ట్ర‌ప‌తి అభ్య‌ర్థిగా తాను వెళ్ళాల్సి వ‌చ్చిన‌ప్ప‌టికీ సోనియా గాంధీ, ప్ర‌భుత్వంలో నుంచి త‌న వంటి స‌మ‌ర్థుడు పోతే స‌ర్కారుకి పాల‌నావ్య‌హ‌రాల్లో ఇబ్బందులు ఏర్ప‌డుతాయ‌ని భావించ‌డంతో ప్ర‌తిభా దేవిసింగ్ రాష్ట్రపతి అయ్యారని చెప్పారు. 2012లో కూడా త‌నను వ‌దులుకోవ‌డం ఇష్టం లేద‌ని ఆమె త‌న‌తో చెప్పార‌ని అన్నారు.

అయితే, మ‌న్మోహ‌న్‌‌ను రాష్ట్ర‌ప‌తిగా పంపిస్తార‌ని చ‌ర్చ జ‌ర‌గ‌డంతో మేడ‌మ్ సోనియా త‌న‌ను ప్ర‌ధాని చేస్తారు కావొ‌చ్చ‌ని మ‌ళ్ళీ ఆశ‌ప‌డ్డ‌ట్టు అక్ష‌రీక‌రించారు. కానీ, ఇక్క‌డ ఒక విష‌యాన్ని ప్ర‌త్యేకంగా ప్ర‌స్తావించుకోవాలి. వేరే విష‌యాల్లో త‌న కంటే స‌మ‌ర్థ‌త క‌ల్గిన అంశాలున్న నాయకులు ఉన్న‌ప్ప‌టికీ త‌న‌కే అవ‌కాశం రావ‌డానికి త‌న క్ర‌మ‌శిక్ష‌ణ‌, తాను ఏర్ప‌చుకున్న న‌మ్మ‌కం మాత్రమే కార‌ణమంటారు ప్ర‌ణ‌బ్‌.

ఎందుకంటే, 2012 రాష్ట్ర‌ప‌తి ఎన్నిక‌ల్లో త‌న కంటే ముందు అప్ప‌టి ఉప‌రాష్ట్ర‌ప‌తి హ‌మీద్ అన్సారీ పేరును ఆమె ప‌రిశీలించారు. కానీ, దేశంలో అప్ప‌టికే కాంగ్రెస్‌పై అవినీతి ఆరోప‌ణ‌లు రావ‌డం, హిందూత్వ సంఘ‌టితం దిశ‌గా బీజేపీ దూసుకెళ్ళ‌డంతో అన్సారీని పోరులో పెడితే మైనార్టీ సంతుష్టీక‌ర‌ణ అన్న పేరు వ‌స్తుందోనన్న భ‌యంతో ఆయ‌నను ఆమె పోటీలో పెట్ట‌లేద‌న్నారు.

ఇక రాష్ట్రపతి ఎన్నికల్లో తన ప్రత్యర్థి పీఏ సంగ్మా కూడా త‌న‌కంటే అన్ని విధాలా రాష్ట్ర‌ప‌తి ప‌ద‌వికి అర్హుడేన‌ని, రాజ‌కీయంగానూ స‌మ‌ర్థుడ‌ని చెప్పుకొచ్చారు. వెన‌క‌బ‌డిన ప్రాంత‌మైన ఈశాన్య రాష్ట్రం నుంచి ఎమ్మెల్యేగా, లోక్‌స‌భ స‌భ్యుడిగా, ముఖ్య‌మంత్రిగా, లోక్‌స‌భ స్పీక‌ర్‌గా… అన్నింటికీ మించి గిరిజ‌నుడి నాయ‌కుడిగా అవ‌కాశం ఉన్న‌ప్ప‌టికీ ఆయ‌న రాష్ట్ర‌ప‌తి కాలేక‌పోవ‌డంపై ప్రత్యేకంగా చెప్పుకొచ్చారు.

1999లో సోనియా గాంధీ విదేశీ మూలాల‌ను బీజేపీ పెద్ద ఎత్తున ప్ర‌చారం చేసిన నేప‌థ్యంలో కాంగ్రెస్‌ పార్టీలో ఆమెను అధినేత స్థాయి నుంచి త‌గ్గించి కేవ‌లం ప్ర‌చారానికి వాడుకోవాల‌ని అప్ప‌టి సీనియ‌ర్ నేత‌లైన శ‌ర‌ద్ ప‌వార్‌, తా‌రీఖ్ అన్వర్ త‌దిత‌రులు ప్ర‌య‌త్నం చేయ‌గా అందులో వారికి పావుగా పీఏ సంగ్మా ఉప‌యోగ‌ప‌డ్డార‌ట‌.

ఆయ‌న నేరుగా సోనియా ద‌గ్గ‌ర‌కి వెళ్ళి ’మీరు విదేశీ అన్న విష‌యంపై దేశ‌మంతా వ్య‌తిరేక‌త వ‌స్తుంది. పార్టీకి అది రాజ‌కీయంగా న‌ష్ట‌దాయ‌క‌మైన విష‌యం. అస‌లు మీ విదేశీయ‌త గురించి, మీ త‌ల్లిదండ్రుల గురించి మాకు, పార్టీకి తెలియ‌దు. పార్టీలో ప‌క్క‌కు ఉంటే మంచింది..‘  అని ఆమెతో చాలా ప‌రుషంగా అన్నార‌ట‌.

దీంతో సోనియా ఎంతో మ‌నోవేధ‌న‌కు గుర‌య్యార‌ని, ఒక సంద‌ర్భంలో క‌న్నీటి ప‌ర్యంతం అయ్యారని ప్రణ‌బ్ రాసుకొచ్చారు. ఈ దేశం కోసం త‌న అత్త‌మ్మ‌ను, భ‌ర్తను కోల్పోయినప్ప‌టికీ తాను ఇంకా భార‌తీయురాలినని నిరూపించుకోవాల్సి రావ‌డం ఏంటీ దాదా అని ఆమె త‌న‌తో చెప్పిన‌ ఘటనపై రాసిన ప‌దాలు నిజంగా మ‌న‌లను ఉద్వేగానికి గురి చేస్తాయి.

ఇలా, కేవ‌లం ఆమెకు ఇబ్బందిక‌ర పదాలు మాట్లాడాడ‌న్న ఒకే ఒక్క కార‌ణంతో ఈ దేశం ఒక గిరిజ‌న వ్య‌క్తిని రాష్ట్ర‌ప‌తిగా చూడ‌లేక‌పోయింద‌న్న విష‌యాన్ని ప్రత్యేకంగా ప్రస్తావించారు. రాజకీయాల్లో హత్యలు ఉండవ‌ని… కేవ‌లం ఆత్మహత్యలే ఉంటాయ‌ని పీఏ సంగ్మా ఉదంతం నిరూపించింద‌ని దాదా వివ‌రించారు.

ఇక రాష్ట్ర‌ప‌తిగా వెళ్ళే ముందు త‌న చివ‌రి మాట‌లు సోనియాతో చెప్పేట‌ప్పుడు ఎంత ఉద్వేగానికి గుర‌య్యారో కూడా ఆయ‌న చెప్పిన తీరు ఆక‌ట్టుకుంటుంది.

ఇది కేవ‌లం పుస్త‌కం పై నా స‌మీక్ష మాత్రమే… సార‌మంతా తెలియాలంటే సాంతం చ‌ద‌వాల్సిందే!

పుస్తక సమీక్ష: – సాగ‌ర్ వ‌న‌ప‌ర్తి, 94940 41258.


Also Read: బుక్ రివ్యూ : దోసిట చినుకులు బై ప్రకాష్ రాజ్

బుక్ రివ్యూ: యమకూపం – ఆ వేశ్యల వెనక రాబందులు ఎవరు?

బుక్‌ రివ్యూ : ది బ్లూ అంబ్రెల్లా : బెస్ట్‌ బుక్‌ ఫర్‌ కిడ్స్‌


Previous articleఅమేజ్‌ఫిట్ బిప్ యూ ప్రొ స్మార్ట్ వాచ్ .. అలెక్సా ఇన్ బిల్ట్, ఆక్సిజన్ లెవల్స్ సహా..
Next articleChicken Liver: చికెన్‌ లివర్‌తో హెల్త్‌ బెనిఫిట్స్‌ ఉన్నాయా?